'వ్యక్తిగత కక్షతోనే టీడీపీ నేతలపై అక్రమ కేసులు - వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు'

'వ్యక్తిగత కక్షతోనే టీడీపీ నేతలపై అక్రమ కేసులు - వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు'
TDP Leaders Fire on YSRCP Govt: వైసీపీ ప్రభత్వం వ్యక్తిగత కక్షతోనే టీడీపీ నేతలను అరెస్టు చేస్తోందని..ఆ పార్టీ నేతలు ఆరోపించారు. బీటెక్ రవి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలను అర్ధరాత్రి వేళల్లో కేంద్ర కారాగారాలకు తరలించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఎన్ని అరెస్టులు జరిగినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు.
TDP Leaders Fire on YSRCP Govt: ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలపై.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించి, అర్ధరాత్రి వేళల్లో కేంద్ర కారాగారాలకు తరలిస్తున్నారని.. ఆ పార్టీ జాతీయ నాయకులు బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ రాంగ్ గోపాల్ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయి, ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారిపై అక్రమ కేసులు బనాయించి అనవసరంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.
TDP Leaders on AP Police: కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న పులివెందుల టీడీపీ నియోజకవర్గ బాధ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు బీటెక్ రవి, ప్రొద్దుటూరు నియోజకవర్గ బాధ్యులు ప్రవీణ్ కుమార్ రెడ్డిలను బీద రవిచంద్ర, మరికొంతమంది నేతలు జైలుకు వెళ్లి పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.
Beda Ravichandra Comments: ''జగన్ మోహన్ రెడ్డి సర్కార్ హయంలో పోలీసులు ఎవరిని, ఎందుకు, ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారో అర్ధంకావటం లేదు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి, అర్ధరాత్రి వేళల్లో కేంద్ర కారాగారాలకు తరలిస్తున్నారు. ధర్మం వైపు ఉండాల్సిన పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. అధికార పార్టీ అగ్ర నాయకులు ఎవరైనా పేరు చెప్తే, వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఆ తర్వాత అనవసరంగా అరెస్టు చేసి అత్యుత్సాహం కనబరుస్తున్నారు.'' అని బీద రవిచంద్ర ధ్వజమెత్తారు.
Rong Gopal Reddy Comments: టీడీపీ ఎమ్మెల్సీ రాంగ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జనవరిలో జరిగిన చిన్నపాటి ఘటనను.. 10 నెలల తర్వాత రీఓపెన్ చేసి, బీటెక్ రవిని కిడ్నాప్ తరహాలో అదుపులోకి తీసుకొవటం దుర్మార్గమన్నారు. అప్పటికప్పుడు వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు చేసి, జడ్జి ఎదుట హాజరుపరిచి, అర్ధరాత్రి సెంట్రల్ జైలుకు తరలించడం దారుణమన్నారు. అయితే, పది నెలల నుంచి బీటెక్ రవి అందుబాటులో లేరని పోలీసులు చెప్పడం సిగ్గుచేటని ఆయన ఖండించారు. బీటెక్ రవి పులివెందులలోనే పోలీసుల ఎదుట తిరుగుతున్నప్పటికీ.. వివిధ రకాల పనులు నిమిత్తం కడప జిల్లా ఎస్పీని కలిసినప్పటికీ.. అప్పుడు అరెస్టు చేయని పోలీసులు ఇప్పుడు ఎందుకు అరెస్టు చేశారు..? అని రాంగ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
''వ్యక్తిగత కక్షతోనే టీడీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ బాధ్యులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓ హత్యాయత్నం కేసులో ఉన్నాడని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాదు. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆ ఘటన జరిగే సమయంలో వేరే ఊర్లో బంధువుల ఇంట్లో ఉన్నారు. టీడీపీ నాయకులను ఒక్కొక్కరిని అరెస్టు చేస్తే, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుకోవడం పొరపాటు. ఎన్ని అరెస్టులు జరిగినా టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు.''-టీడీపీ నేతలు
