ETV Bharat / state

అక్కడ గజ్జ కట్టారంటే..! జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్రొద్దుటూరు బాలికలు

author img

By

Published : Feb 6, 2023, 6:12 PM IST

Proddatur girls excelling in Kuchipudi: పోటీ ఏదైనా.. వేదిక ఎక్కడైనా వారు కాలికి గజ్జెకట్టి నృత్యం చేశారంటే బహుమతి రావాల్సిందే. ఓ వైపు చదువు, మరోవైపు ఇష్టంగా నేర్చుకున్న కూచిపూడి, జానపద నృత్యాల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పలు పురస్కారాలు అందుకుని.. నృత్య గురువులు, ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంటున్నారు ప్రొద్దుటూరు నృత్య త‌రంగిణి క‌ళానిల‌యం బాలిక‌లు.

Kuchipudi dance
కూచిపూడి నృత్యం

Proddatur girls excelling in Kuchipudi: ప్రొద్దుటూరు వైఎమ్ఆర్ కాలనీలోని నృత్య తరంగిణి కళానిలయంలో వందమందికిపైగా బాలికలు కూచిపూడి, జానపద నృత్యాలు నేర్చుకుంటున్నారు. పట్టణంతోపాటు ఇతరప్రాంతాల బాలికలు.. శిక్షకుడు శ్రావణ్‌కుమార్ వ‌ద్ద తర్ఫీదు పొందుతున్నారు. త‌ల్లిదండ్రులు ప్రోత్సాహంతో చ‌దువుకుంటూనే.. ఖాళీ సమయాల్లో కూచిపూడి, జాన‌ప‌ద నృత్య సాధన చేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న చిన్నారులు తమ ప్రదర్శనలతో.. జిల్లా స్థాయినుంచి జాతీయ స్థాయి వరకు పురస్కారాల పంట పండిస్తున్నారు.

గత నెలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కళానిలయం సంస్థ 38వ జాతీయ స్థాయి నృత్య పోటీలు నిర్వహించగా.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 700 మందికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పోటీల్లో ప్రొద్దుటూరు నృత్య తరంగిణిలో శిక్షణ పొందిన బాలికలు సత్తా చాటారు. కూచిపూడి, జానపదం విభాగాల్లో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి ప్రశంసలు అందుకున్నారు. త‌ల్లిదండ్రులు, గురువు ప్రోత్సాహంతోనే తాము అవార్డులు సాధించినట్లు బాలిక‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నవ‌య‌సులోనే అనేక వేదిక‌ల‌పై కూడిపూడి, జాన‌ప‌ద నృత్య ప్రదర్శనలు చేస్తూ తమ పిల్లలు బహుమతులు ద‌క్కించుకోవ‌డంపై వారి త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను వారికి ఇష్టమైన రంగంలో రాణించేందుకు ప్రోత్సాహించాలని చెబుతున్నారు. సంప్రదాయ నృత్యంలో బాలికలు రాణించే విధంగా వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు శిక్షకుడు శ్రావణ్‌కుమార్ వివరించారు. సంప్రదాయ నృత్యంపై మక్కువతో కూచిపూడి, జానపద నృత్యాలు నేర్చుకుంటున్నామని.. నృత్య గురువు సారథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని పురస్కారాలు సాధిస్తామని బాలికలు చెబుతున్నారు.

"గత సంవత్సరం చిలకలూరిపేటలో ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు మూడవ బహుమతి వచ్చింది. ఈ సంవత్సరం బాగా ప్రాక్టీస్ చేయడం వలన మొదటి బహుమతి వచ్చింది. నేను ఇక్కడ అయిదు సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను". - హోసికారెడ్డి, ప్రొద్దుటూరు

"చెప్పడానికి అతిశయోక్తిలా అనిపించవచ్చు కానీ శ్రావణ్ లాంటి గురువు వీళ్లకి దొరకడం.. ఈ పిల్లలు చేసుకున్న పుణ్యం. వీరిని తన పిల్లలులా చూసుకుంటారు. మాకు ఎటువంటి దిగులు లేకుండా.. జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈరోజు నా పిల్లలకి ఇన్ని అవార్డులు రావడానికి శ్రావణ్ గారే కారణం". - డాక్టర్‌ అర్చన, బాలిక త‌ల్లి

"నా దగ్గర దాదాపు 100 మంది విద్యార్థులు కూచిపూడి, జానపద నృత్యాలలో శిక్షణ తీసుకుంటున్నారు. పిల్లలు బహుమతులు గెలుచుకోవడమే కాకుండా.. నాతోటి నాట్య గురువుల ప్రశంసలు అందుకున్నారు". - శ్రావ‌ణ్‌కుమార్, నృత్య శిక్షకుడు

కూచిపూడిలో జాతీయస్థాయిలో రాణిస్తున్న బాలికలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.