ETV Bharat / state

జీతం రాకుండా.. ప్రభుత్వానికి సరెండర్​ చేశారనే కక్షతోనే అచ్చెన్న హత్య: ఎస్పీ అన్బురాజన్​

author img

By

Published : Mar 27, 2023, 4:08 PM IST

Updated : Mar 27, 2023, 7:29 PM IST

కడప పశు వైద్యశాల డీడీ అచ్చెన్న
కడప పశు వైద్యశాల డీడీ అచ్చెన్న

Dr. Achchenna's murder case : కడప పశు వైద్యశాల డీడీ అచ్చెన్న హత్యకేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితులను గుర్తించామని ఆయన వెల్లడించారు. కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఎంఆర్​పీఎస్ నాయకుడు కృష్ణ మాదిగ హెచ్చరించారు.

Dr.Achchenna's murder case : ఐదారు నెలల నుంచి జీతాలు లేకుండా చేయడంతో పాటు ఉద్యోగానికి ఎసరు తెచ్చే విధంగా ప్రభుత్వానికి సరెండర్ చేయడంతోనే పశువైద్యశాల డీడీ అచ్చెన్నను హత్య చేశామని ప్రధాన నిందితుడు సుభాష్ చంద్రబోస్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. సంచలనం కల్గించిన దళిత ఉన్నతోద్యోగి అచ్చెన్నను హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. అచ్చెన్నను కారులో కిడ్నాప్ చేసి మద్యం తాగించి హత్య చేసినట్లు తేలిందని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఉద్యోగులతో వివాదమే కారణం.. పశువైద్యశాలలో పనిచేసే ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు సురేంద్రనాథ్ బెనర్జీ, శ్రీధర్ లింగారెడ్డి, సుభాష్ చంద్రబోస్ ను డీడీ అచ్చెన్న గత డిసెంబరులో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని పేర్కొంటూ సరెండర్ చేశారు. ఉన్నతాధికారులు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించినా అచ్చెన్న ససేమిరా అన్నారు. దీనిపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేసినా పట్టించుకోలేదు.

లాడ్జీలో పథకం.. జీతాలు రాకుండా తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భావించిన అసిస్టెంట్ డైరెక్టర్ సుభాష్ చంద్రబోస్.. డీడీ అచ్చెన్న హత్యకు కుట్ర పన్నాడు. ఈనెల 10న పోరుమామిళ్ల లాడ్జ్ లో కలసపాడుకు చెందిన చెన్నకృష్ణ, గుర్రంకొండకు చెందిన బాలాజీనాయక్ కలిసి పథక రచన చేశారు. 11వ తేదీ ముగ్గురూ కడపకు వచ్చి చంద్రబోస్ ఇంట్లోనే బస చేశారు. ఈనెల 12వ తేదీ ఉదయం 11.30 గంటలకు డీడీ అచ్చెన్న పశువైద్య కార్యాలయం ఎదురుగా ఉన్న సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు ముగించుకుని బయటికి రాగానే ముగ్గురు వ్యక్తులు ఆయన్ని కిడ్నాప్ చేశారు. కారులో అచ్చెన్నకు మద్యం తాగించడంతో పాటు... వారు కూడా మద్యం సేవించారు. ఈవిధంగా రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్ వద్దకు తీసుకెళ్లి కొట్టి చంపారని ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వెల్లడించారు.

ఎస్పీ అన్బురాజన్​

పోస్టుమార్టంతో పూర్తి వివరాలు.. గువ్వలచెరువు ఘాట్ రహదారి పక్కనే మోరీ కింద చంపేశారు. చంపే సమయంలో ఎవరికీ కనపడకుండా కారును అడ్డంగా పెట్టారని ఎస్పీ తెలిపారు. అపస్మారక స్థితిలో మోరీ పైన కూర్చున్న డీడీ అచ్చెన్నను బాలాజీనాయక్ అనే వ్యక్తి గట్టిగా తోసేడంతో చనిపోయడాన్న ఎస్పీ... చంపడానికి ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారనే దానిపై పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత వెల్లడిస్తామన్నారు. అచ్చెన్న సెల్ ఫోన్ ను నిందితులు సీకే దిన్నె పరిధిలోని కొండల్లో పారేశారన్నారు. ఈనెల 14వ తేదీ రాత్రి అచ్చెన్న కనిపించలేదని కుటుంబ సభ్యులు కడప వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే... అదృశ్యం కేసు నమోదు చేశామన్నారు. ఆయన్ని వెదకడానికి ప్రత్యేక బృందాలు గాలించాయన్న ఎస్పీ... దురదృష్టవశాత్తు ఈనెల 24న డీడీ మృతదేహం గువ్వలచెరువు ఘాట్ లో లభ్యమైందన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తే సుభాష్ చంద్రబోస్ అసలు నిందితుడని తేలిందన్నారు. అతనితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్న ఎస్పీ... ఈ కేసులో ఇంకా ఎవరెవరున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అచ్చెన్న హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిలో ఏడీ సుభాష్ చంద్రబోస్ ను పోలీసులు అరెస్ట్ చేయగా... మిగిలిన నలుగురిని కూడా విచారించనున్నట్లు తెలిసింది.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. అచ్చెన్న హత్యపై సిట్టింగ్ జడ్జితో జరిపించాలని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు అచ్చన్న హత్యకు గురైన గువ్వల రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్డు లోని సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు అనంతరం అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుని కలిసి అచ్చన్న హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యాలయ ఉద్యోగులు హత్యకు పాల్పడితే రాష్ట్రంలో దళిత అధికారులు ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఈ హత్య వెనక అధికారి ప్రమేయం కూడా వెలికి తీయాలని ఎస్పీని కోరారు రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాలపై దాడులు హత్యలు అధికమయ్యాయని మండిపడ్డారు. కడప, అనంతపురం, విశాఖపట్నం, కాకినాడలో దళిత ఉద్యోగులు హత్య గురికావడం చూస్తే రాష్ట్రంలో దళితుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. కడపలో అచ్చెన్న తన ప్రాణానికి ముప్పు ఉందని లోకాయుక్తకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు. హత్య వెనుక ఉన్న ఉన్నతాధికారుల హస్తం కూడా బయటపడాలంటే.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పోలీసుకు ఫిర్యాదు చేసినా... చిన్న అచ్చెన్న హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారించాలని ఎంఆర్ పీఎస్ నాయకుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. కడప పోలీసులకు ఫిర్యాదు చేసినా 12 రోజులు స్పందించలేదని ఆయన ఆరోపించారు. కాగా, ఫిర్యాదు చేసిన వారిలో ఒక్కరినీ పోలీసులు విచారించలేదని పేర్కొన్నారు. మృతదేహం లభ్యమయ్యాకే హత్యకేసు నమోదు చేసి అరెస్టు చేశారని తెలిపారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కృష్ణ మాదిగ హెచ్చరించారు.

అచ్చెన్న హత్య కేసులో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అధికారులతో పాటు వారికి సహకరించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. దళిత వర్గం నుంచి ఎదిగిన ఉన్నతాధికారికి ఈ పరిస్థితి ఎదురైతే.. సామాన్యుడి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారించాలి. సీఎం వెంటనే స్పందించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేసు విచారణ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే రీపోస్టు మార్టం నిర్వహించాలి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనపై సీఎం స్పందించాలి. కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. - మంద కృష్ణ మాదిగ, ఎంఆర్ పీఎస్ నాయకుడు

ఇవీ చదవండి :

Last Updated :Mar 27, 2023, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.