ETV Bharat / state

FLOODS EFFECT IN KADAPA: వరదల ప్రభావం.. ఆపద సమయాల్లో రోడ్లు దాటలేక అగచాట్లు

author img

By

Published : Nov 28, 2021, 9:15 AM IST

KADAPA PEOPLE FACING PROBLEMS WITH  ROADS DAMAGED BY FLOODS
వరదల ధాటికి నాశనమైన రహదారులు

ROADS DAMAGED BY FLOODS IN KADAPA: కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగి చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వరద తగ్గినప్పటికీ.. రోడ్లు పాడవడంతో ఇప్పటికీ జనాలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోంది. అనారోగ్యం పాలైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

FLOODS EFFECT IN KADAPA: అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగి చెయ్యేరుకు వరద పోటెత్తటంతో పెనగలూరు చెరువుకట్ట తెగిపోయింది. పెనగలూరు-ఎన్‌.ఆర్‌.పురం ప్రధాన రహదారికి ఏడుచోట్ల భారీగా గండ్లు పడ్డాయి. ఆ రహదారి మూడు కిలోమీటర్ల పొడవున ఉనికే లేకుండా పోయింది. ఫలితంగా ఎన్‌ఆర్‌పురం, పల్లంపాడు, కోడిచిన్నయ్యగారిపల్లె, పద్మయ్యగారిపల్లె, ఏరాసుపల్లె ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయా గ్రామాల్లో అనారోగ్యం బారినపడిన కొందరు బయటకు రావడానికి దారి లేక.. చికిత్స అందక ప్రాణాలు కోల్పోయారు. ‘ఈనాడు ప్రతినిధి’ ఆయా గ్రామాల్లో పర్యటించినప్పుడు ఇలాంటి కన్నీటిగాథలు అనేకం కనిపించాయి.

పెనగలూరు-ఎన్‌.ఆర్‌.పురం రోడ్డు వరద ఉద్ధృతికి పూర్తిగా తెగిపోయింది. ప్రత్యామ్నాయంగా చెయ్యేరు కరకట్టపై నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేస్తున్నారు. పెద్దపెద్ద రాళ్లతో ఉన్న దానిపై ద్విచక్రవాహనం వెళ్లటమే కష్టంగా ఉంది. దీంతో ఆయా గ్రామాల్లో జ్వరాలు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారంతా ఆసుపత్రిలో చూపించుకునేందుకు ఆరు కిలోమీటర్ల దూరంలోని పెనగలూరుకు తెగిపోయిన చెరువుకట్ట మీదుగా కొంత దూరం, చెరువు లోపల నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్తూ కనిపించారు. మరికొందరు నిత్యావసరాలు, అత్యవసర ఔషధాల కోసం కాలినడకన వెళుతున్నారు. ‘నా భార్య గంగమ్మకు నాలుగు రోజులుగా గొంతునొప్పి, జ్వరం. నాకు కూడా చేతికి దెబ్బ తగిలింది. పెనగలూరు ఆసుపత్రికి వెళ్దామంటే రోడ్డు తెగిపోయింది. కాలినడకనే వెళుతున్నాం’ అన్నారు ఎన్‌ఆర్‌ పురానికి చెందిన మాలె శివనారాయణ.

.

పల్లంపాడుది మరో కథ
వరద ముంచెత్తటంతో పల్లంపాడు-ఎన్‌ఆర్‌పురం మధ్య రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడ నది కనిపిస్తోంది. ఈ గ్రామంలో అనేకమంది జ్వరాలతో బాధపడుతున్నారు. వరదల వల్ల ఆసుపత్రికి వెళ్లలేక 4 రోజుల కిందట ఎలుకచర్ల పిచ్చయ్య, శనివారం గండికోట పెంచలమ్మ ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలువురు జ్వరపీడితులు నడుంలోతు నీటిలో నది దాటుకుని ఎన్‌ఆర్‌పురం వచ్చి, కాలినడకన పెనగలూరు వెళ్తూ కనిపించారు.

- పెనగలూరు మండలం ఏరాసుపల్లెకు చెందిన శింగనమల సుధాకర్‌ వేదన

‘రెండు రోజులపాటు ఊరి చుట్టూ వరదనీరే. అది తగ్గాక చూస్తే రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. మా ఊరికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. అదే సమయంలో మా చిన్నాన్న సుబ్బారాయుడికి రక్తపు విరోచనాలు మొదలయ్యాయి. నదికట్టపై నుంచి మరో చిన్నదారిలో ఆటోలో ఆసుపత్రికి తీసుకెళుతుంటే మట్టిలో కూరుకుపోయి ఆగిపోయింది. అక్కడే ఆయన ప్రాణం పోయింది’

- పెనగలూరు మండలం ఎన్‌ఆర్‌పురం వాసి ఉదయగిరి సీతారామయ్య ఆవేదన

‘వరద ముంచెత్తిన రెండు రోజుల తర్వాత మా నాన్న చిన్నకొండయ్యకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. మూడు రోజులపాటు అల్లాడిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్దామంటే మా ఊరి నుంచి పెనగలూరుకు వెళ్లే రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. వైద్యం అందక ఆయన ప్రాణాలు కోల్పోయారు. కడుపునొప్పి మొదలవగానే ఆసుపత్రికి తీసుకెళ్లగలిగితే బతికేవారు’

పల్లంపాడుకు చెందిన ఎలకచర్ల వెంకటసుబ్బమ్మ రోదన

‘వరద వచ్చిన రోజు నుంచే మా ఆయన ఎలకచర్ల పిచ్చయ్యకు తీవ్రమైన జ్వరం. ఆసుపత్రికి తీసుకెళ్దామంటే నది దాటి అవతలికి వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. నా కళ్లముందే ఆయన విలవిలలాడిపోతూ చనిపోవటాన్ని తట్టుకోలేకపోతున్నా..!

ఇదీ చూడండి: Rain Alert to AP: నేటి నుంచి రెండ్రోజులపాటు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.