ETV Bharat / state

దళిత అధికారి అచ్చెన్నది హత్యే.. కిడ్నాప్​ చేసి అంతమొందించిన సహోద్యోగులు

author img

By

Published : Mar 27, 2023, 7:40 AM IST

Dr Chinna Achchenna murder: ఎస్సీ ఉద్యోగి, పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకుడు డాక్టర్‌ చిన్న అచ్చెన్న హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆయన్ను కిడ్నాప్‌ చేసి అంతమొందించినట్లు వెల్లడైంది. ఈ హత్యలో సహోద్యోగులతో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయమూ వెలుగులోకి వచ్చింది. అపహరించిన రోజే అచ్చెన్నను చంపేసినట్లు సమాచారం. ఈ నెల 14నే అదృశ్యంపై ఫిర్యాదు ఇచ్చినా దర్యాప్తులో నిర్లక్ష్యం కారణంగానే.. అచ్చెన్న చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన తండ్రిని కులం పేరుతో దూషించి వేధించారన్న అచ్చెన్న తనయుడు అంటుండగా.. విచారణకు కమిటీని నియమించామని బాధ్యులను వదలబోమని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. పూర్తి వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించనున్నారు.

Achchenna murder
Achchenna murder

Dr Chinna Achchenna murder: సీఎం జగన్‌ సొంత జిల్లాలో ఎస్సీ అధికారి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకుడు డాక్టర్‌ చిన్న అచ్చెన్న కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు తగిన చొరవ చూపలేదు. అదృశ్యమైన 12 రోజుల తర్వాత అనుమానాస్పద రీతిలో అచ్చెన్న మృతదేహం బయటపడితే తప్ప పోలీసుల్లో చలనం రాలేదు. జిల్లా స్థాయి ఉన్నతాధికారి.. అది కూడా దళిత వర్గానికి చెందిన వ్యక్తి కనిపించట్లేదని ఫిర్యాదు అందినా పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో.. దాని ఫలితం ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఈ ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. అంతే కాకుండా.. అచ్చెన్న మృతదేహం లభించిన తర్వాత.. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండానే శవపరీక్ష నిర్వహించి హడావుడిగా వారికి మృతదేహాన్ని అప్పగించడం కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది.

దళిత అధికారి అచ్చెన్నది హత్యే.. కిడ్నాప్​ చేసి అంతమొందించిన సహోద్యోగులు

ఆరు నెలలుగా వివాదం.. కడప బహుళార్థ పశువైద్యశాలలో ఉపసంచాలకుడిగా విధులు నిర్వహిస్తున్న అచ్చెన్నకు అదే వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేసే సురేంద్రనాథ్‌ బెనర్జీ, శ్రీధర్‌ లింగారెడ్డి, సుభాష్‌ చంద్రబోస్‌కు మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. సురేంద్రనాథ్‌ బెనర్జీ, శ్రీధర్‌ లింగారెడ్డి, సుభాష్‌ చంద్రబోస్‌లు విధులు నిర్వర్తించే విధానంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలను, నిబంధనలను పాటించట్లేదని.. తనకు కూడా సహకరించట్లేదని పేర్కొంటూ అచ్చెన్న వారిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఆ ముగ్గురూ కలిసి అచ్చెన్నే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపైన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. సరెండర్‌ చేసిన ఆ ముగ్గురినీ విధుల్లో చేర్చుకోవాలని అచ్చెన్నను ఉన్నతాధికారులు ఆదేశించగా.. ఆయన అందుకు నిరాకరించారు. ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే ఆయన అదృశ్యమవడం గమనార్హం.

పోలీసులు స్పందించి ఉంటే ఫలితం ఉండేది.. సుభాష్‌ చంద్రబోస్‌, శ్రీధర్‌ లింగారెడ్డి, సురేంద్రనాథ్‌ బెనర్జీలపై అనుమానం వ్యక్తం చేస్తూ అచ్చెన్న కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 14న కేసు నమోదు చేసినా.. 24వ తేదీ వరకూ దర్యాప్తులో పోలీసులు ఎలాంటి పురోగతీ సాధించలేదు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్లో రహదారి గోడ కింద ఈ నెల 24న అనుమానాస్పదంగా ఓ మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం అచ్చెన్నదిగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతే కదిలి.. అచ్చెన్న హత్యకు గురైనట్లు తేల్చారు. కడపలోని కోటిరెడ్డి సర్కిల్‌ దగ్గర్లోని చర్చి వద్ద నుంచే నిందితులు అచ్చెన్నను కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. అచ్చెన్న అదృశ్యంపై ఫిర్యాదు వచ్చిన దగ్గర నుంచి పోలీసులు స్పందించి ఉంటే ఫలితం ఉండేది. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినా బాధ్యులెవరో గుర్తించేందుకు వీలుండేది. పోలీసులు ఈ అదృశ్యం ఘటనలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చెన్న అదృశ్యంపై ప్రభుత్వ యంత్రాంగం కొంచెం కూడా స్పందించలేదు.. ఆయన్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి.. అచ్చెన్న హత్యపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణచేపట్టాలని.. MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. అచ్చెన్న హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కడపలోని వీపీసీ ఎదుట అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు.

మంత్రి ఆదేశాలు.. అచ్చెన్న మృతికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించినట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తిస్థాయి విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పశు సంవర్ధక శాఖలో పనిచేసే వారు బాధ్యులైనట్లు తేలితే చర్యలకు వెనుకాడమని.. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అచ్చెన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.