ETV Bharat / state

వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర: చంద్రబాబు

author img

By

Published : Feb 12, 2022, 2:42 PM IST

Updated : Feb 13, 2022, 3:48 AM IST

వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర
వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర

14:39 February 12

కడప జైలర్‌గా వరుణ్‌ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాస్తాం

వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర

CBN On Viveka Murder Case: ‘ఆయన అనంతపురం జిల్లా జైలర్‌గా ఉన్నప్పుడు పరిటాల రవి హత్య కేసులో కీలక నిందితుడు మొద్దు శీను చనిపోయాడు. ఆ కేసులో ఒక్కొక్కరూ హతమయ్యారు. తర్వాత ఆయన చాలాకాలం సస్పెన్షన్‌లో ఉన్నారు. సస్పెన్షన్లు తొలగించి ఇప్పుడు కడప జైలుకు ఇన్‌ఛార్జిగా పంపించారు. అక్కడే ఇప్పుడు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులున్నారు. వారిని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. కడప జైలర్‌ వరుణారెడ్డిపై ఆయన సందేహం ప్రకటించారు. కడప జైల్లో జరుగుతున్న పరిణామాలపై సీబీఐకి లేఖ రాస్తామన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి జగన్‌, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆడుతున్న జగన్నాటకమని ఆరోపించారు. సీఐడీ అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని.. రేపనేది ఒకటి ఉంటుందని పోలీసులు, సీఐడీ అధికారులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. కానిస్టేబుల్‌ నుంచి డీఐజీ వరకు అందరినీ గుర్తుపెట్టుకుంటామని, చట్టవ్యతిరేకంగా వ్యవహరించినవారు తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుందని మండిపడ్డారు. సీఐడీ పోలీసులు అరెస్టు చేసి, బెయిలుపై విడుదలైన పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును శనివారం విజయవాడలోని ఆయన నివాసానికి వచ్చి చంద్రబాబు పరామర్శించారు. అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లడంతో ఆయన కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని, వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

ఆయనేమన్నా ఉగ్రవాదా?

‘అశోక్‌బాబును ఒక టెర్రరిస్టు, కరడుగట్టిన నేరస్థుడిలా అర్ధరాత్రి కిడ్నాప్‌ తరహాలో అరెస్టు చేయడం ఏమిటి? ఆయన చేసిన తప్పేంటి? మీరు ప్రశ్నించాలనుకుంటే నేరుగా తెదేపా రాష్ట్ర కార్యాలయానికి వస్తే.. అక్కడే అశోక్‌బాబు ఉంటారు. అరెస్టు చేసి 18 గంటలు ఎక్కడెక్కడో తిప్పి, నోటీసు కూడా ఇవ్వలేని తప్పుడు నేరాలు మోపి కేసులు పెట్టారు. మీరు పెట్టిన కేసేంటి? ఉద్యోగుల ఉద్యమం గురించి ప్రశ్నలు వేస్తారా? ఎవరిచ్చారు మీకు అధికారం? ముఖ్యమంత్రి చెబితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తారా? దీనికి బాధ్యులైన అందరిపై ప్రైవేటు కేసులు దాఖలు చేసి, న్యాయం ముందు నిలబెడతాం’ అని చంద్రబాబు సీఐడీ అధికారులపై ధ్వజమెత్తారు. ‘క్విడ్‌ప్రో కో తరహాలో ఓ అధికారి తమ్ముడి భార్యకు డైరెక్టర్‌ పదవి ఇప్పించి అశోక్‌బాబుపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. దీనిపై గతంలో శాఖాపరమైన విచారణలో అశోక్‌ తప్పులేదని తేల్చారు. ఆయన పదవీవిరమణ చేసిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కేసును తవ్వితీయడం కక్ష సాధింపు కాదా? ఎంపీ రఘురామ కృష్ణరాజుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా? సీఐడీకి ఎంత ధైర్యం?’ అని మండిపడ్డారు. ‘అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ తెలుగుదేశం ఉంటుంది. ఉద్యోగులకు మద్దతిస్తాం. వారి కోసం పోరాడతాం’ అని స్పష్టం చేశారు.

తెదేపా నేతలపై 4 వేల కేసులు

రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులపై మొత్తం నాలుగు వేల కేసులు పెట్టారని, వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు డీఐజీని డిమాండ్‌ చేశారు. ‘మాజీ మంత్రులు అశోక్‌గజపతిరాజు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, లోకేశ్‌తోపాటు ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, 38 మంది తెదేపా రాష్ట్ర నేతలు, 70 మంది నియోజకవర్గ ఇన్‌ఛార్జులపై కేసులు పెట్టారు. కొందరిని అరెస్టు చేశారు. 33 మంది తెదేపా కార్యకర్తలు, నాయకులను హత్య చేయించారు’ అని ఆరోపించారు.

ఉద్యమం గురించే ప్రశ్నించారు: అశోక్‌బాబు

సీఐడీ పోలీసులు తనపై పెట్టిన కేసుకు సంబంధించి కాకుండా ఉద్యోగుల ఉద్యమంపై ప్రశ్నలు అడిగినట్లు అశోక్‌బాబు చంద్రబాబుకు చెప్పారు. ఉద్యోగుల ఉద్యమం వెనుక నువ్వున్నావా? నువ్వే సలహాలిచ్చావా? ర్యాలీకి అంతమంది ఎలా వచ్చారు? దానికి ప్రణాళిక ఎవరిది? ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు అని ప్రశ్నించారని వివరించారు.

ఇదీ చదవండి

కడప కేంద్ర జైలు ఇన్‌ఛార్జిగా వరుణారెడ్డి.. జిల్లాలో జోరుగా చర్చ!

Last Updated :Feb 13, 2022, 3:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.