ETV Bharat / state

Road Accidents: పాఠశాలకు వెళ్తుండగా బస్సు ప్రమాదాలు.. ఇద్దరు చిన్నారులు మృతి

author img

By

Published : Jul 3, 2023, 4:59 PM IST

road accident
రోడ్డు ప్రమాదం

School children died in Road Accidents: ఉరుకుల పరుగుల జీవితాలు.. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకూ.. పరుగెడుతూనే ఉంటున్నాం. బిజీ బిజీగా గడిపేస్తున్నాం. ఈ గజిబిజి జీవితాలలో మనం చేసే చిన్న పొరపాటు.. ఆత్మీయులని కోల్పోయేలా చేస్తాయి. ఇలాంటి ఘటనలే నేడు చోటు చేసుకున్నాయి. పాఠశాలకు వెళ్తుండగా.. వేర్వేరు ప్రమాదాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో.. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Road Accidents: రెండు వేర్వేరు ప్రమాదాలు.. కానీ ఆ ప్రమాదాలు మనకి చెప్పే పాఠం మాత్రం ఒకటే. పిల్లలను తీసుకొని బయటకు వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని.. ఏ మాత్రం ఆదమరిచినా.. మనం కోల్పోయేది వెల కట్టలేనిదిగా ఉంటుంది. ఇంతకీ ఆ ప్రమాదాలు ఎలా జరిగాయంటే..?

తండ్రితో పాఠశాలకు వెళ్తూ.. అనంతలోకాలకు: తండ్రితో పాఠశాలకు బయలుదేరిన ఆ చిన్నారి.. అనుకోని ప్రమాదం కారణంగా అనంతలోకాలకు వెళ్లిపోయింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఏదైతే పాఠశాలలో చదువుతుందో.. అదే పాఠశాలకు చెందిన బస్సు కింద పడి ఓ నర్సరీ విద్యార్థిని చనిపోయిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచి వేస్తోంది.

జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగేళ్ల సఫీనా నర్సరీ చదువుతోంది. తండ్రి తన ఇద్దరు కుమార్తెలను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకొని పాఠశాలలకు బయలుదేరారు. ఆ సమయంలో ఎదురుగా అదే పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు వస్తోంది. దీంతో దానిని తప్పించబోయి.. ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పక్కకు పడిపోయింది.

ద్విచక్ర వాహనంపై ముందు కూర్చున్న సఫీనా.. బస్సు వెనక చక్రాల కింద పడి చనిపోయింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్​ను నియంత్రించారు. ప్రమాదం జరిగిన వెంటనే.. సంబంధిత స్కూల్ బస్సు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

ఒక వీధిలో రెండు పాఠశాలలు.. మరి స్పీడ్ బ్రేకర్లు ఎందుకు లేవు: కాగా ప్రస్తుతం ప్రమాదం జరిగిన వీధిలో.. రెండు ప్రైవేటు పాఠశాలు ఉన్నాయని.. కానీ స్పీడ్ బ్రేకర్లు మాత్రం ఏర్పాటు చేయలేదని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదం స్థానికులను తీవ్రంగా కలచివేసి.. ఆగ్రహం తెప్పించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరంలోని వడ్డెర కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. కుమారుడిని బైక్‌పై పాఠశాలకు తీసుకువెళ్తున్న క్రమంలో వారి ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి మృతి.. స్థానికులను, బంధువులను తీవ్రంగా కలచివేసింది. ఆగ్రహం తెప్పిచ్చింది. దీంతో స్థానికులు, బంధువులు.. ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకో చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.