ETV Bharat / state

నూతన విద్యా విధానం..ప్రాజెక్టులతో రికార్డుల మోత..విద్యార్థులే గురువులు

author img

By

Published : Apr 1, 2023, 9:18 AM IST

Updated : Apr 1, 2023, 2:08 PM IST

ప్రాజెక్టులతో రికార్డు గురుకుల పాఠశాల విద్యార్థులు
ప్రాజెక్టులతో రికార్డు గురుకుల పాఠశాల విద్యార్థులు

STUDENTS CREATING RECORDS WITH THEIR PROJETS: తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం.. విద్యార్థులు నేర్చుకుని పరీక్షల్లో రాసి ఉత్తీర్ణత సాధించడం పాత పద్ధతి. అందుకు భిన్నంగా విద్యార్థులే ఉపాధ్యాయుల సాయంతో పాఠ్యాంశాలను ప్రాజెక్టులుగా మలుచుకుని అర్థం చేసుకోవడంతో పాటు..తోటి విద్యార్థులకు సైతం అర్థమయ్యేలా బోధిస్తున్నారు. ఎంచుకున్న అంశాన్ని అతి తక్కువ సమయంలో బోధించడమే కాకుండా..పదుల సంఖ్యలో ప్రాజెక్టులు తయారుచేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఇంతకీ ఎవరా విద్యార్థులు, ఎక్కడా పాఠశాల అంటారా..చూసేద్దాం పదండి.

నూతన విద్యా విధానం..ప్రాజెక్టులతో రికార్డుల మోత..విద్యార్థులే గురువులు

Records Of Gurukula Students In West Godavari : ఇక్కడ నేలపై కూర్చుని తీక్షణంగా ప్రాజెక్టులు తయారుచేస్తున్న వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొత్త ఆరుగొలనులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు. అందరూ ఇలా సామూహికంగా కూర్చుకుని ఏదో వైజ్ఞానిక ప్రదర్శనకు సిద్ధమవుతున్నారనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే ఇది వారి దినచర్య. అవును.

పాత విధానానికి స్వస్తి : గతంలో అందరిలానే తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం, వాటిని విని అర్థం చేసుకుని పరీక్షల్లో రాయడం చేసిన వీరు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారావు చొరవతో పాత విధానానికి స్వస్తి పలికారు. విద్యార్థులే స్వయంగా సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను ఎంచుకుని వాటిని ఉపాధ్యాయుల సాయంతో ప్రాజెక్టుల రూపంలో తయారు చేస్తూ సులభంగా అర్థం చేసుకుంటున్నారు.

25 మందితో ప్రారంభం : పాఠాలు విని వాటిని పరీక్షల్లో రాస్తే విద్యార్థులకు అంతగా జ్ఞాపకశక్తి ఉండదని గ్రహించిన ప్రధానోపాధ్యాయులు రాజారావు ఈ ప్రాజెక్టుల తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ విధానంలో ముందుగా ఉపాధ్యాయులు కొన్ని నమూనా ప్రాజెక్టులు చేసి ఆ తర్వాత విద్యార్థులకు వాటి ఆవశ్యకతను వివరించారు. అలా ఇప్పుడు విద్యార్థులు అందరూ అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రాజెక్టులు తయారు చేస్తూ సులభంగా పాఠ్యాంశాలను గ్రహించడమే కాకుండా తోటి విద్యార్థులకు సైతం సహాయపడుతున్నారు. తొలుత 25 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పుడు 200 మందికి పైగా భాగస్వాములయ్యారు.

2-3 నిమిషాల్లోనే ప్రాజెక్టులు : ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు అందరూ ఇలా ప్రాజెక్టులు చేస్తున్నారు. కేవలం ప్రాజెక్టులు తయారు చేయడం మాత్రమే కాదు.. తరగతి గదిలో 45 నిమిషాల పాటు ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాన్ని వీరు కేవలం 2-3 నిమిషాల్లోనే ఈ ప్రాజెక్టుల విధానంలో తిరిగి బోధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక సబ్జెక్టులో లేదా వివిధ సబ్జెక్టుల్లో 25 ప్రాజెక్టులు తయారు చేసి వాటిలోని అంశాలను కేవలం 18 నుంచి 20 నిమిషాల్లోనే అర్థమయ్యే రీతిలో సొంతంగా బోధిస్తున్నారు.

" నేను 25 ప్రాజెక్టులు హిందీ రికార్డ్ చేశాను. దీని వల్ల ముఖ్యంగా స్టేజ్ ఫియర్ పోయింది. అలాగే హిందీలో బాగా మాట్లాడగలను. ఏవైనా సరే తెలుగులో అర్థం చేసుకోగలను. మా స్నేహితులకు హిందీలో ఎక్స్​ప్లేయిన్ చేయగలుగుతున్నాను. సార్ ఆరగంటలో చెప్పెది అందరికి అరగంటలో అర్థం అయ్యేలా చెప్పగలుగుతున్నాను. " - టి. కుమార్, తొమ్మిదో తరగతి విద్యార్థి

149 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం : ఈ ప్రాజెక్టుల తయారీతో తమ జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు నలుగురిలో మాట్లాడాలంటే ఉన్న భయాన్ని సైతం పోగొట్టిందని, ఆత్మ విశ్వాసం పెరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. అలా జ్ఞాపక శక్తిలో విద్యార్థులు చూపుతున్న ప్రతిభకు గానూ ఇప్పటి వరకూ ఈ పాఠశాలకు 149 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతమయ్యాయంటే ఇక్కడి విద్యార్థులను ఈ ప్రాజెక్టుల ప్రక్రియ ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

మార్గనిర్దేశకులుగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు : ఇప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే గురువులుగా కాకుండా మార్గనిర్దేశకులుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల నైపుణ్యం ప్రాజెక్టులకు ముందు ఒకలా ఉంటే ప్రాజెక్టుల తయారీ తర్వాత మరింత పెరగడంపై ఉపాధ్యాయులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

" నేను ఈ ప్రాజెక్టులను 15 నిమిషాల్లో కంప్లీట్ చేయగలిగాను. ఇప్పుడు నేను బయాలజికల్ సైన్స్​లో ఒక సులువైన పద్ధతిలో నెర్చుకోగలిగాను. నేను ప్రతి దాన్ని తయారు చేయడానికి దాదాపు వన్ హవర్ పట్టేది. కాకపోతే చేసేకొద్ది ఇంట్రస్ట్ పుట్టింది. " - షారోన్ కుమార్, ఎనిమిదో తరగతి విద్యార్థి

" ప్యూచర్​లో కూడ ఈ ప్రాజెక్ట్స్ మాకు చాలా ఉపయోగపడతాయి. ఇంగ్లీష్​లో ప్రతీ గ్రామర్, లిటరేచర్ కూడ మా మైండ్​లో ఫిక్స్ అయిపోయింది. " - ఆర్ యశ్వంత్, ఎనిమిదో తరగతి విద్యార్థి

" విద్యార్ధులు తమకు తముగా ప్రాజెక్టులు తయారు చేసుకోని, ఆ కాంసెప్టుని అర్థం చేసుకోని, ఎక్స్​ప్లేయిన్ చేయగలిగితే విద్యార్ధలకు ఎక్కువ కాలం మెమోరీ ఉంటదని నా ఉద్దేశ్యం. " - బి. రాజారావు, ప్రధానోపాధ్యాయుడు

ఇవీ చదవండి

Last Updated :Apr 1, 2023, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.