ETV Bharat / state

తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం.. 'మత్తు'ను చిత్తు చేయడానికి మాస్టర్ ప్లాన్

author img

By

Published : Jan 18, 2023, 1:00 PM IST

Prohibition of drugs in telangana: తెలంగాణ రాష్ట్రంలో ‘మత్తు’ను అంతమొందించేందుకు పోలీసు శాఖ ముందడుగు వేసింది. జాతీయ దర్యాప్తు సంస్థలతో జట్టుకట్టేందుకు సిద్దమైంది. అవసరమైతే అంతర్జాతీయ సంస్థల సాయం కూడా తీసుకోవాలని యోచిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న మత్తు మందులను కట్టడి చేయాడానికి అన్ని విభాగాలతో చర్చించి, ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారులు ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

telangana police
తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం

Prohibition of drugs in Telangana: రాష్ట్రంలో మత్తు మందుల మాటే వినిపించకుండా చేయాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో విభాగం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌-న్యూ) మంచి ఫలితాలు సాధిస్తోంది.

దీనికి నేతృత్వం వహిస్తున్న హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు రాష్ట్ర యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో బాధ్యతలు కూడా అప్పగించారు. వాస్తవానికి మత్తుమందులను అరికట్టే విషయంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ, జాతీయ ముఠాలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున మత్తు మందులు సరఫరా చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పాగావేసిన వారిని పట్టుకోవడం రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారింది.

ఉదాహరణకు.. గోవా కేంద్రంగా గత కొన్ని సంవత్సరాలుగా మత్తు మందుల వ్యాపారం చేస్తున్న ఎడ్విన్‌ను పట్టుకోవడం అసాధ్యంగా మారింది. అతనితో ఉన్న సంబంధాల కారణంగా.. అక్కడి పోలీసులు తెలంగాణ పోలీసులకు సహకరించేవారు కాదు. కానీ, అవరోధాలను అధిగమించి హెచ్‌-న్యూ విభాగం మొదటిసారి ఎడ్విన్‌ను పట్టుకుంది. మత్తు మందుల వ్యాపారంలో రాటుదేలిన డిసౌజా, ప్రీతిష్‌నారాయణ వంటివారిని కూడా అరెస్టు చేయగలిగారు. వీరిని విచారించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఓడల ద్వారా అధిక రవాణా

గంజాయి ఉత్తరాంధ్ర నుంచి సరఫరా అవుతుంది. యాంఫిటమైన్‌ టైప్‌ స్టిమ్యులెంట్స్‌ (ఏటీఎస్‌) వంటి రసాయన మత్తు మందులను తెలుగు రాష్ట్రాల్లోనే తయారు చేస్తున్నారు. ఖరీదైన హెరాయిన్‌, కొకైన్‌ వంటివి విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. కొద్ది మొత్తంలో విమానాల్లో సరఫరా చేస్తుండగా ఓడల ద్వారా టన్నుల కొద్దీ మత్తు మందులు సరఫరా అవుతున్నాయి. వీటిని దేశంలోని వివిధ ప్రదేశాలకు చేర్చేందుకు అనేక ముఠాలు ఉన్నట్లు, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుగుతుందని వారు వెల్లడించారు.

ఈ ముఠాలను పట్టుకోవాలంటే సాంకేతిక కారణాల వల్ల రాష్ట్ర పోలీసు యంత్రాంగం సరిపోదు. జాతీయ దర్యాప్తు సంస్థలైన నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, కస్టమ్స్‌ వంటి విభాగాల సాయంతో ఈ ముఠాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. ఈ సంస్థలకు జాతీయస్థాయిలో నెట్‌వర్క్‌ ఉండటమేకాదు ఎక్కడైనా దర్యాప్తు చేయగలిగే అధికారం ఉంటుంది.

దాంతో రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి ఆయా జాతీయ దర్యాప్తు సంస్థల సాయం తీసుకోవాలని భావిస్తున్నారు. వాటన్నింటితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఓ బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. సరఫరాను అడ్డుకోనంతకాలం మత్తు మందులు అదుపు చేయడం కష్టమనేది నిర్వివాదాంశం.

అందుకే జాతీయ స్థాయిలో ఉన్న మత్తు మందుల నెట్‌వర్క్‌ భరతం పట్టాలంటే అదేస్థాయిలో పనిచేయాలని, తమ ప్రయత్నం కూడా ఇదేనని యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు. అవసరమైతే ఇక్కడ దర్యాప్తులో వెల్లడయిన అంశాల ఆధారంగా అంతర్జాతీయ ముఠాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్‌పోల్‌తో పాటు ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కూడా పంచుకోవాలనేది తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.