వాలంటీర్లతో "ఓటు" మాట.. సమావేశాలు నిర్వహించి మరీ దిశా నిర్దేశం

author img

By

Published : Jan 18, 2023, 7:14 AM IST

Updated : Jan 18, 2023, 9:17 AM IST

Volunteers are campaigning to vote for the ycp party

Village Volunteers: వైసీపీను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు వాలంటీర్లంతా కృషి చేయాలంటూ అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు.. బహిరంగంగానే ఆదేశాలిస్తున్నారు. మరో పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారని పరోక్షంగా బెదిరిస్తున్నారు. వచ్చే ఏడాది జీతాలు 15 వేలకు పెంచేందుకు జగన్‌ సిద్ధంగా ఉన్నారని వైసీపీ కోసం పనిచేస్తే పార్టీ మిమ్మల్ని చూసుకుంటుందంటూ వారిని ప్రలోభపెడుతున్నారు. ఆ మేరకు వాలంటీర్లు సైతం ఇంటింటికీ వెళ్లి అధికార పార్టీకే ఓట్లు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా తీసుకుంటున్న వాలంటీర్లు.. సేవలు మాత్రం వైసీపీకి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

'ఎన్నికల పనులేవీ వాలంటీర్లకు అప్పగించరాదు'.. 'మాకు వినపడదు..కనపడదు సార్!'

Village Volunteers: వాలంటీర్ల గౌరవ వేతనాలకు ఖజానా నుంచి 15 వందల 6 కోట్లను ప్రభుత్వం ఏటా వెచ్చిస్తోంది. ఇవి కాకుండా సెల్ ఫోన్ బిల్లులు, పురస్కారాలు, సత్కారాలు, సాక్షి పత్రిక కొనుగోళ్లకు మరో 343 కోట్లను ఖర్చు చేస్తోంది. ఇవన్నీ కలిపితే దాదాపు 19వందల 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాలంటీర్లు వేతనాలుగా తీసుకుంటున్నారు. కానీ వీరంతా వైసీపీ రాజకీయ సమావేశాలు, కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

పార్టీ పరంగా ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు, ప్రతి 50 ఇళ్లకు ఒక గృహ సారథిని వైసీపీ నియమిస్తోంది. కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు వారితో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటికి వాలంటీర్లంతా హాజరవుతున్నారు. 'రాబోయే ఎన్నికల్లో వైసీపీను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సచివాలయాల కన్వీనర్లతో కలిసి వాలంటీర్లు కష్టపడి పని చేయాలని మంత్రులే వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

వైసీపీ కార్యక్రమాలు వాలంటీర్ల భుజాన: మంత్రులు, ప్రజాప్రతినిధుల తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా తీసుకునే వాలంటీర్లను పార్టీకి పని చేయాలని మంత్రులు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నాయి. అసలు పార్టీ కార్యక్రమాలకు వాలంటీర్లను పిలవడమేంటని నిలదీస్తున్నాయి. సొమ్మొకరిది, సోకొకరిది అన్నట్లుగా అమాత్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వైసీపీ కార్యక్రమాలను భుజాన వేసుకొని వాలంటీర్లు పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కానీ ఎక్కడా అలా జరగట్లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. ఈ నెల 10న ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వాలంటీర్లు, వైసీపీ సచివాలయ కన్వీనర్ల సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. జగనన్నను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమావేశాలకు హాజరు కావాలని వాలంటీర్లను ఆదేశించారు. పుల్లల చెరువులో నిర్వహించిన సమావేశానికి వాలంటీర్లు పెద్దగా హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నాయకులకు అనుగుణంగా : కోనసీమ జిల్లా మామిడికుదురులో గతేడాది డిసెంబర్ 31న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వాలంటీర్లు, వైసీపీ సచివాలయ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో వైసీపీ నాయకుల ఇష్టానికి అనుగుణంగా వాలంటీర్లు నడుచుకోవాలని ఆదేశించారు. రాబోయే ఏడాది కాలం పార్టీకి ఉపయోగపడాలని వాలంటీర్లను కోరారు.

పార్టీ కోసం పనిచేయాలి: మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో డిసెంబరు 29న విజయనగరం జిల్లా రాజాం మండలం కంచారంలో నిర్వహించిన వైకాపా విస్తృతస్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున వాలంటీర్లు హాజరయ్యారు. వీరిని పార్టీ కోసం పనిచేయాలని మంత్రి బొత్స కోరారు.

జగనన్న రుణం తీర్చుకోండి: వైసీపీకి పని చేసిన వారికే వాలంటీర్లుగా అవకాశం కల్పించామని.. గతంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రులు తానేటి వనిత, రాంబాబు.. పలు సందర్భాల్లో దాదాపు ఇలాగే ప్రకటించారు. 'వైసీపీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాలంటూ మంత్రి ఉషశ్రీచరణ్ గతేడాది నవంబరులో మాట్లాడారు. ఈ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారాలు: ఓటరు నమోదు సహా ఎన్నికల పనులేవీ వాలంటీర్లకు అప్పగించరాదని ఎన్నికల సంఘం పలు మార్లు ఆదేశాలిచ్చినా క్షేత్ర స్థాయిలో ఆవి అమలయ్యేలా చూడలేకపోతోంది. దీంతో ఓటరు నమోదు, తొలగింపు, ఓటుకు ఆధార్ అనుసంధానం తదితర పనులన్నింటిలో వాలంటీర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్లను వారికి తెలియకుండానే తొలగించడంతోపాటు అధికార పార్టీ మద్దతుదారుల ఓట్లను పెద్ద ఎత్తున చేర్పిస్తున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఇటీవల పెద్ద ఎత్తున తెదేపా సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. అందులోనూ వాలంటీర్ల పాత్ర వెలుగుచూసింది. ఇదే కాదు.. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా వైకాపా అభ్యర్థుల తరపున ప్రచారాలు ఇతర కార్యక్రమాలను వాలంటీర్లే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్ని కల్లో వారిని వినియోగించుకునేందుకు ఇప్ప టి నుంచే దిశానిర్దేశం చేస్తున్నారు.

అధికారాన్ని దుర్వినియోగం చేయడం: రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరి చొప్పున సుమారు 2లక్షల 60 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. వీరు ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా ఉన్నందున ఎన్నికల సమయంలో వైసీపీకు అనుకూలంగా వినియోగించుకునేందుకు సాంకేతికంగా సమస్య లేకుండా ఉండేందుకే గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లను నియమించారు.

'వాలంటీర్లు.. వారి కుటుంబ సభ్యులనే గృహ సారథులుగా నియమించాలి' అని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అంటే వాలంటీర్లూ పరోక్షంగా ఎన్నికల్లో పాల్గొనే వీలున్నట్లే. "మీకు పింఛన్లు ఎవరిస్తున్నారు. మన పార్టీ గుర్తేంటి? ఎవరికి ఓటేస్తారు?' అంటూ వైకాపా నాయకులతో కలిసి వాలంటీర్లు శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ నెల మొదటి వారంలో తిరిగారు.

పింఛను వారోత్సవాల్లోనే పార్టీకి ప్రచారం చేశారు. కొందరు లబ్ధిదారులు ఎవరికి ఓటేస్తామనేది చెప్పకపోవడంతో పింఛన్లు తీసేయమంటారా? అని గద్దించారు. ఇలా ఇప్పటికే వాలంటీర్లు వైకాపా తరఫున పని చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లోనూ వైకాపా గెలుపు కోసం పని చేయాలని వాలంటీర్లకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పిలు పునివ్వడం కచ్చితంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని, ఇది చట్టవిరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


ఇవీ చదవండి

Last Updated :Jan 18, 2023, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.