ETV Bharat / state

కేంద్రం కొర్రీపై నవంబరు 2న అత్యవసర భేటీ

author img

By

Published : Oct 27, 2020, 4:49 AM IST

Updated : Oct 27, 2020, 5:16 AM IST

పోలవరం నిధులపై కేంద్రం కొర్రీలతో ఆందోళన నెలకొన్న వేళ నవంబరు 2న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కేంద్రం ఆదేశాల మేరకు 2014 నాటి ధరలను ఆమోదించి పంపుతారా లేదా అనేది తేలిపోనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన వాదనలతో సిద్ధమవుతోంది. ప్రాజెక్టు అథారిటీ కేంద్రం చెప్పినట్లు నడుచుకోకుండా రాష్ట్ర ఆవేదనను ఏ మాత్రం అర్థం చేసుకుంటుందనేది అంతుచిక్కడంలేదు.

Polavaram authority
Polavaram authority

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014 ఏప్రిల్‌ 1నాటికి ఉన్న ధరలు, పరిమాణాల ప్రకారం 20 వేల 398 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలను ఆమోదించి పంపాలని కేంద్ర జలశక్తి శాఖకు ఇటీవలే ఆర్థిక శాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థిక శాఖ షరతులే ఎజెండాగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ నవంబర్‌ 2న హైదరాబాద్‌ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశం కానుంది. అథారిటీ ముఖ్య కార్యానిర్వహణాధికారి అయ్యర్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి జగ్‌మోహన్‌ గుప్తా పాల్గొంటారు. తమవాదనను గట్టిగా వినిపించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రెజెంటేషన్‌తో సిద్ధమవుతోంది. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, కేంద్రం తరఫున పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తోందని.. రాష్ట్ర అధికారులు స్పష్టం చేయనున్నారు.

ప్రాజెక్టు నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం ఎంత వ్యయం అవుతుందో మదింపు చేసి, ఆమోదించి కేంద్ర జలసంఘానికి సిఫారసు చేసిన అథారిటీయే ఇప్పుడు అందుకు భిన్నంగా 20 వేల 398 కోట్ల రూపాయలకు ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించనున్నారు. తొలి అంచనాను కేంద్ర జలసంఘం కూడా మదింపు చేసి 2017-18 ధరలకు అనుగుణంగా అంచనా వ్యయం 55 వేల కోట్లు కావాలని సాంకేతిక సలహా కమిటీ ఎదుట స్వయంగా ప్రజెంటేషన్‌ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేయనున్నారు. సాంకేతిక సలహా కమిటీ సైతం ఆ మొత్తాన్ని ఆమోదించిందని ,రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ కూడా మదింపు చేసి ఆమోదించిన తర్వాత తుది అంచనాలను ఎలా తగ్గిస్తారని ప్రశ్నించబోతున్నారు. దేశంలో మొత్తం 12 జాతీయ ప్రాజెక్టులుండగా వాటికి సంబంధించిన అంచనాలను ఇంతవరకూ ఎన్నిసార్లు సవరించారు. ఎప్పటికప్పుడు కొత్త క్వాంటిటీలకు ఎలా అదనపు ధరలు ఆమోదించుకుంటూ వెళ్లారనే అంశాలపై రాష్ట్ర అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వాటితో పోలిస్తే పోలవరం జాతీయ ప్రాజెక్టు ఏవిధంగా భిన్నమైనదని అధికారులు ప్రశ్నించబోతున్నారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వర్గాల్లోనూ తాజా పరిణామాలపై అంతర్గత చర్చ జరగుతోంది. కేంద్రం తాజా షరతు ప్రకారం నిధులిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టమని భావిస్తున్న నేపథ్యంలో.. తాము ఏ నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపాలనే విషయమై.. అథారిటీ పెద్దలు ఆందోళనలో ఉన్నారు. చివరకి కేంద్రం మార్గదర్శనం మేరకే అథారిటీ అడుగులు ఉండొచ్చని కొందరు చెప్తున్నారు.

ఇదీ చదవండి : పోలవరం 'డ్యామ్' నిర్మాణానికే నిధులు: కేంద్రం

Last Updated : Oct 27, 2020, 5:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.