ETV Bharat / state

TDP MLA arrest: దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై నిమ్మల ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

author img

By

Published : Jun 6, 2023, 8:55 PM IST

Nimmala Ramanaidu
Nimmala Ramanaidu

Nimmala Rama Naidu arrest: పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడలో.. దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పెరుగులంక గోదావరి ఏటిగట్టుపై నిద్రించి నిరసన తెలిపారు. ఏటిగట్టుపైనే స్నానం చేసి అక్కడే దళితులతో అల్పాహారం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిమ్మల అరెస్ట్​ను చంద్రబాబు ఖండించారు.

Palakollu MLA Nimmala Ramanaidu arrested: పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ గ్రామంలో దళితుల భూముల్లో అక్రమ మట్టి తరలిస్తున్నారని దళితులు గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దత్తుగా గత రెండు రోజులుగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోరాటం చేస్తున్నారు. రాత్రులు అక్రమంగా మట్టి తరలించడాన్ని అడ్డుకోవడం కోసం చించినాడ నిద్రించారు. దళితులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్న నిమ్మలను పోలీసులు అరెస్టు చేశారు.

పాలకొల్లు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ - పెరుగులంక గ్రామాల్లో దళితుల భూముల్లో వైసీపీ నాయకుల అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే రామానాయుడు సోమవారం నుంచి దళితులు, గ్రామస్థులతో కలసి ఆందోళన చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల వైఖరిని వ్యతిరేకిస్తూ నిన్న రాత్రి చించినాడ గోదావరి గట్టుపైనే నిద్రించి నిరసన తెలిపారు. ఇవాళ మరో సారి గ్రామస్థులతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతుండగా... గోదావరి ఏటి గట్టు ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఎమ్మెల్యే నిమ్మలను బలవంతంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యే నిమ్మల అరెస్టు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేని అరెస్టు చేసిన పోలీసులు ఎక్కడికి తరలించేది చెప్పకుండా.. పలు ప్రాంతాల్లో తిప్పారు.

నిమ్మల రామానాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తే తప్ప ప్రభుత్వానికి పొద్దు గడవట్లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నిన్న ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే స్వామిని అరెస్టు చేశారు.. ఇవాళ ఎస్సీ భూముల రక్షణ కోసం పోరాడిన నిమ్మల అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే మున్ముందు వైసీపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం నిమ్మలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో దళితుల భూములను వైసీపీ ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం అన్యాయమని.. మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు దళిత భూముల్లో మట్టి తవ్వకాలు చేస్తూ... ప్రమాద ఘంటికలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. మట్టి తవ్వకాలను అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేయడం దుర్మార్గమని సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటు పట్టా పేరుతో ఇప్పటికే జగన్ రెడ్డి 12 వేల ఎకరాల దళితుల అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఇంకా జగన్​కు దాహార్తి తీరలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆక్షేపించారు. అరెస్టు చేసిన నిమ్మల రామానాయుడును వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.