ETV Bharat / state

అడగలేవని.. ఆకలి ఆగదుగా!

author img

By

Published : Jul 19, 2022, 6:09 AM IST

వరద ప్రాంతాల్లో బాధితులే కాదు... ఒడ్డెక్కి ఏటి గట్లపైకి చేరిన మూగజీవాలూ ఆకలితో నకనకలాడుతున్నాయి. డొక్కలెండుతున్న పశువుల్ని చూసి రైతులు బాధతో కుంగిపోతున్నారు. మేత కోసం పరుగులు తీస్తున్నారు.

మూగజీవాలూ
మూగజీవాలూ

వరద ప్రాంతాల్లో బాధితులే కాదు... ఒడ్డెక్కి ఏటి గట్లపైకి చేరిన మూగజీవాలూ ఆకలితో నకనకలాడుతున్నాయి. డొక్కలెండుతున్న పశువుల్ని చూసి రైతులు బాధతో కుంగిపోతున్నారు. మేత కోసం పరుగులు తీస్తున్నారు. ముంపు బారిన పడని ప్రాంతాల్లోని తోటి రైతుల దగ్గరకు వెళ్లి.. ఒకటిరెండు పనల గడ్డి తెచ్చుకుంటున్నారు. ఈ కొద్దిపాటి గడ్డితో పశువులకు ఆకలి పూర్తిగా తీరడం లేదు. నాలుగైదు రోజులుగా పశువులు ఇబ్బంది పడుతున్నా.. అధికశాతం ముంపు గ్రామాలకు ప్రభుత్వం మేత సరఫరా చేయలేదు. కొన్ని గ్రామాలకు సమీకృత దాణా(టీఎంఆర్‌) ఇచ్చినా.. అదీ అరకొరే. రెండు పశువులు ఉంటే ఒక బేలు(50 కిలోలు) చొప్పున ఇచ్చినా కొందరికే అందింది.

ఈరోజు...రేపు వస్తుందంటూ చెప్పడం తప్పితే దాణా ఇవ్వలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని ముంపు గ్రామాల పాడి రైతులు వరద ప్రారంభం కాగానే ముందుగా పశు సంపదను ఒడ్డుకు చేర్చారు. ఇళ్లు మునగవని భావించిన వారు.. సామగ్రిని పైకప్పులకెక్కించి టార్పాలిన్లు కప్పి వాటిలోనే కుటుంబసభ్యులకు వసతి కల్పించారు. తాము మాత్రం పశువులతో కలిసి రాత్రింబవళ్లు ఏటిగట్లు, వంతెనలు, రహదారులపైనే ఉంటున్నారు.

ఇంటి దగ్గర పిల్లలు, కుటుంబ సభ్యులకు ఆహారం అందిందో లేదో అనే దిగులు కంటే... పశువులకు మేత ఎలాగనేదే వారిని ఎక్కువగా వేధిస్తోంది. కొందరికి గ్రామాల్లో మేత ఉన్నా తెచ్చుకునే అవకాశం లేదు. మరికొందరి గడ్డి వాములు నీటిలో నానాయి. దీంతో మెరక గ్రామాల రైతుల్ని ఆశ్రయించి కొంతగడ్డిని తెచ్చుకుని మేతగా వేస్తున్నారు. ఒకమోపు తెచ్చినా.. నాలుగైదు పశువులకు ఒకరోజుకు సరిపెడుతున్నామని కొందరు వివరించారు. కిలో రూ.35 పెట్టి తవుడు తెచ్చి తాగిస్తున్నాం’ అని చెప్పారు.

పశువులతోపాటు రైతులు రోడ్లపైకి వచ్చి 5 రోజులపైనే అవుతోంది. అయినా పలు మండలాల్లో నిన్న, మొన్నటి వరకు మూగజీవాల వేదన పట్టించుకున్న వారేలేరు. ఆదివారం నుంచి వరద తగ్గుముఖం పట్టింది. అయినా సోమవారం దాకా దాణా ఇవ్వని గ్రామాలెన్నో ఉన్నాయి. ‘పది గేదెలున్నాయి. అక్కడోమోపు, ఇక్కడో మోపు తెచ్చి వేస్తున్నాం. లంకలో గడ్డి ఉంది. అది తడవలేదు. అయినా తెచ్చుకునే అవకాశం లేదు. ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు’ అని అయినవిల్లి మండలం కొండుకుదురు లంకకు చెందిన ఎర్రియ్య వాపోయారు. ‘మేమైతే ఎక్కడైనా తినొచ్చు.. వాటి సంగతే అర్థం కావట్లేదు. ఆవులు, గేదెల పాలు తగ్గిపోయాయి. ఆ కొద్దిపాటి పాలతో ఈ నాలుగు రోజులు.. దూడలు బతికితే చాలు’ అని పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

కొన్ని చోట్ల సమీకృత దాణా బేళ్లను అరకొరగా సరఫరా చేశారు. గ్రామాల వారీ ఎన్ని పశువులు ఉన్నాయి.. వాటిలో ఎన్నిటికి దాణా అందించాలి? ఎన్ని రోజులకు అవసరం? అనే అంచనా లేదు. పశువులతోపాటు ఊరు విడిచి వచ్చిన మూడు రోజుల తర్వాత.. తమ పేర్లు, పశువుల సంఖ్య నమోదు చేసుకున్నారని రైతులు వివరించారు. వారిచ్చే దాణాబేళ్లను గట్టిగా మేపితే ఒక రోజుకూ చాలవని పేర్కొన్నారు.

..

చనిపోయేలా ఉన్నాయి

- గుణశేఖర్‌, తానేలంక, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా

..

గడ్డి, దాణా లేక పశువులు, దూడల డొక్కలెండుతున్నాయి. నీరసిస్తున్నాయి. కొన్ని చనిపోయేలా ఉన్నాయి. ఇప్పటికే కొందరి పశువులు రెండు, మూడు చనిపోయాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాణా రేపు, మాపు వస్తుందని చెబుతున్నారు.

నాలుగు బేళ్లు ఏ మూలకు?

- గడ్డం అప్పారావు, కొత్తలంక, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా

..

ఐదు గేదెలు, దూడలు ఉన్నాయి. గడ్డి ఎక్కడా దొరకడం లేదు. నాలుగు బేళ్ల దాణా ఇచ్చారు. అది రెండు రోజులకే సరిపోయింది. మళ్లీ ఎక్కడైనా తెచ్చుకోవాల్సిందే.

ఇవీ చదవండి:సాయం అందించాల్సిన నిధులు మళ్లించడమేంటి?: చంద్రబాబు

ఒక్క ప్రాణం పోకుండా సహాయక చర్యలు చేపట్టాం: మంత్రి అంబటి రాంబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.