ETV Bharat / state

బాలింత మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

author img

By

Published : Dec 29, 2020, 7:48 PM IST

వైద్యుల నిర్లక్ష్యం కారంణంగానే బాలింత మృతి చెందిందంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. అక్కడినుంచి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్​కు చేరుకుని రాస్తారోకో చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ తెదేపా, జనసేన పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.

maternity women died family demand for justice
ఆందోళనలో పాల్గన్న బంధువులు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతరాలి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. అక్కడినుంచి పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్​కు చేరుకుని రాస్తారోకో చేపట్టారు. వీరి ఆందోళనకు తెదేపా, జనసేన పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాధితురాలు మృతి చెందిందని.. ప్రభుత్వ అధికారి లేదా స్థానిక ఎమ్మెల్యే వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు.

అసలేం జరిగిందంటే..

రెండు రోజుల క్రితం మండలంలోని వేములదీవి గ్రామానికి చెందిన కారాడి కనకదుర్గ డెలివరీ కోసం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సోమవారం ఆపరేషన్ చేయడంతో శిశువుకు జన్మనిచ్చింది. అయితే శస్త్రచికిత్స అనంతరం దుర్గకు రక్తస్రావం అధికం కావడంతో.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమించడంతో దుర్గను సోమవారం రాత్రి కాకినాడ తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. మంగళవారం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో బంధువుల ఆగ్రహావేశాలు అధికమయ్యాయి.

బాలింతరాలు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న విపక్ష పార్టీలు, మత్స్యకార సంఘం నాయకులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. రాత్రి పొద్దుపోయే వరకూ ఆందోళన కొనసాగుతూనే ఉంది.

ఇదీ చదవండి: నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.