ETV Bharat / state

బీర వంగడం అర్కా ప్రసన్.. ఆదాయం పసంద్

author img

By

Published : Jan 13, 2021, 7:22 PM IST

అతను విశాఖపట్నం పోర్టులో ఉన్నత స్థాయి ఉద్యోగి. జీతం వేలల్లోనే ఉంటుంది. అయినా సంతృప్తి పడలేదు. వ్యవసాయంపై మక్కువ అతనిని సొంత ఊరికి తీసుకొచ్చింది. అందరిలా కాకుండా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని కొత్తగా పంటలను సాగు చేయాలనుకున్నాడు. ఉన్న ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకుని స్వగ్రామం వచ్చేశాడు. నూతన వంగడం అర్కా ప్రసన్ బీర సాగుతో లాభాలు గడిస్తున్నారు. అంతేకాకుండా పలువురికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు.

income of arca prasan ridge gourd
బీర వంగడం అర్కా ప్రసన్

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన యెలిశెట్టి హరిబాబు డిగ్రీ పూర్తి చేశారు. క్రీడల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి పతకాలు సాధించారు. దీంతో ఆయనకు క్రీడా కోటాలో విశాఖపట్నం పోర్టులో డ్రై డాక్ మాస్టర్​గా కొలువు లభించింది. హరిబాబు... తాత, తండ్రి వ్యవసాయం చేస్తుండటంతో తనకు కూడా వ్యవసాయంపై ఆసక్తి ఉండేది. వృత్తి రీత్యా విశాఖపట్నంలో ఉండాల్సి వచ్చినా స్వగ్రామం చేబ్రోలు వచ్చినప్పుడల్లా పొలం పనులు చేస్తూ ఉండేవారు. 28 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఇంకా ఆరేళ్లు సర్వీసు ఉండగా వీఆర్ఎస్ తీసుకుని స్వగ్రామం వచ్చేశారు. అందరిలా కాకుండా తక్కువ కాలంలో పంట చేతికొచ్చే సీజనల్ పంటలపై దృష్టి పెట్టారు. పలువురు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ సాగు విధానాల్ని అమలు చేస్తున్నారు.

బీర వంగడం అర్కా ప్రసన్..

తొలుత పుచ్చ కాయలు దొండకాయలు సాగు చేశారు. గత ప్రభుత్వ కాలంలో రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐఎచ్ఆర్) అభివృద్ధి చేసిన నూతన బీర వంగడం అర్కా ప్రసన్ సాగు చేస్తున్నారు. తక్కువ కాలంలో అధిక దిగుబడులు సాధిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. కేవలం రూ.50 వేల పెట్టుబడితో రూ.లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు.

45 రోజుల్లోనే పంట చేతికి..

ఎకరంన్నర భూమిని రోటవేటర్​తో మెత్తగా దున్ని, వర్మీ కంపోస్టు వేప పిండి, వేప నూనె, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ షీటు ఉపయోగించి అర్కా ప్రసన్ బీర సాగు ప్రారంభించారు. 45 రోజుల్లోనే పంట చేతికొచ్చింది. ఒక టన్ను బీరకాయలు ధర మార్కెట్​లో రూ.40 వేల వరకూ ఉంది. సుమారు ఇరవై ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తోందని హరిబాబు తెలిపారు. పక్కనే కోళ్ల ఫారం కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఎరువు లభ్యత సులభమయ్యింది. కిలో బీరకాయ ధర రూ.40 ఉందని అధిక లాభాలు వస్తున్నాయని హరిబాబు ఆనందం వ్యక్తం చేశారు.

బీర వంగడం అర్కా ప్రసన్

ఇదీ చదవండి: పశ్చిమగోదావరిలో పందేల జోరు.. చేతులు మారుతున్న డబ్బు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.