ETV Bharat / state

మద్దతు ధర లేక పత్తి రైతు కుదేలు

author img

By

Published : Dec 5, 2020, 6:44 PM IST

విజయనగరం జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సాలూరులో ఏర్పాటు చేసిన ఏకైక పత్తి కొనుగోలు కేంద్రాన్ని.. కిలో కూడా కొనుగోలు చేయకుండానే మూసివేశారు. అదేమిటని ప్రశ్నిస్తే.. స్పిన్నింగ్ మిల్లులకు వెళ్లమంటున్నారు అధికారులు. నిబంధనల పేరిట రైతులను అక్కడ రెండు, మూడు సార్లు తిప్పుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు విసుగుచెంది దళారులకు అమ్మడానికి సిద్ధపడుతున్నారు. రైతులకు మద్ధతు ధర అందని ద్రాక్షలాగా మారింది. ఎడతెరిపి లేని వర్షాలకు సగం మేర నష్టపోయిన రైతులను.. ఈ పరిణామం మరింత కుంగదీస్తోంది.

cotton farmers problems
పత్తిరైతు బాధలు

ఈ ఏడాది విజయనగరం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పత్తి రైతులు కుదేలయ్యారు. ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించినా.. కిలో పంటనూ కొనకుండా సాలూరులోని కొనుగోలు కేంద్రాన్ని మూసివేశారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పత్తిసాగు విస్తీర్ణం..

జిల్లాలో పత్తిసాగు సాధారణ విస్తీర్ణం 14,208 హెక్టార్లు కాగా.. ఈ ఏడాది 10.02 వేల హెక్టార్లలో సాగైంది. సీజన్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.. పంట సాగు విస్తీర్ణం తగ్గింది. సాలూరు, పాచిపెంట, రామభద్రపురం మండలాల్లోనే 60శాతానికి పైగా.. గజపతినగరం, దత్తిరాజేరు, పార్వతీపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రైతులు కొంతమేర పత్తి సాగు చేస్తారు. నీటి వనరులు అంతంత మాత్రం ఉన్న సాలూరు, గజపతినగరం, పాచిపెంట, రామభద్రపురం రైతులను.. వరి తర్వాత మొక్కజొన్న, పత్తి పంటలే ఆదుకుంటాయి. తొలుత వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా.. పూత, కోత సమయంలో వాతావరణం మెరుగు కాగా రైతులు సంబరపడ్డారు. మెరుగైన దిగుబడులు వస్తాయని.. గతేడాది చేసిన అప్పుల నుంచి గట్టెక్కవచ్చని ఆశించారు. కానీ దిగుబడులు చేతికొచ్చే సమయంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. పత్తి పంటకు తీరని నష్టాన్ని మిగిల్చాయి.

కొనుగోళ్ల పరిస్థితి:

ఈ పరిస్థితుల్లో క్వింటాకు రూ. 5,855 మద్ధతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. వాటితో కనీసం పెట్టుబడులైనా దక్కించుకోవచ్చని రైతులు ఆశించారు. పత్తిని సేకరించేందుకు సాలూరు ఏఎంసీ ఆవరణలో అక్టోబరు 29న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 1,200 మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ ఇప్పటికీ కిలో పత్తి కూడా ఇక్కడ నుంచి కొనుగోలు చేయలేదు. పైగా రామభద్రపురం మండలం బూశాయవలస సమీపంలోని స్పిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్లమని అధికారులు సలహాలు ఇస్తున్నారు. పంట నమూనాలు తీసుకెళ్లి రైతులు వారికి చూపిస్తే.. నచ్చితే లోడు తీసుకురమ్మంటున్నారు, లేదంటే వర్షాలకు తడిసిందని చెప్తూ రెండు, మూడు సార్లు తిప్పించుకుంటున్నారు. ఈ బాధలు పడలేక అనేక మంది రైతులు.. క్వింటా రూ. 4,000 చొప్పున దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ లెక్కన క్వింటాకు దాదాపు రూ. 1,800కి పైగా రైతులు నష్టపోతున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి:

దిగుబడులు చేతికొచ్చే తరుణంలో కురిసిన భారీ వానలకు.. సుమారు 25 వేల క్వింటాళ్ల పంట వర్షార్పణమైంది. సుమారు రూ. 10 కోట్ల మేర జిల్లా రైతులు నష్టపోయారు. చేతికొచ్చిన అరకొర పంటా రంగు మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రమూ ఆదుకోవరడం లేదంటూ పత్తి రైతులు తలలు పట్టుకుంటున్నారు. పంటల కొనుగోళ్లకు శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం మాటలు.. ప్రకటనకే పరిమితమయ్యాయి. దళారీలనే ఆశ్రయించి.. వచ్చిన ధరకు పంటను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. సాలూరులోని కొనుగోలు కేంద్రంలోనే పత్తిని సేకరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులేమంటున్నారు?

ఈ ఏడాది పత్తి రవాణా ఛార్జీలు లేకపోవడంతో నేరుగా మిల్లుకు తరలిస్తున్నామని సాలూరు ఏఎంసీ కార్యదర్శి సతీష్ తెలిపారు. సీసీఐ నిబంధనల మేరకే అక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలకు పత్తి పూర్తిగా తడిచి, రంగు మారడంతో రైతులకు మద్ధతు ధర లభించడం లేదంటూ.. కొనుగోలు కేంద్రం మూసివేతపై వివరణ ఇచ్చారు. - సతీష్, సాలూరు ఏఎంసీ కార్యదర్శి

ఇదీ చదవండి:

కొత్తూరులో పేలిన గ్యాస్ సిలిండర్..పూరిళ్లు దగ్ధం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.