శృంగవరపుకోట సీటు కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గ పోరు

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 8, 2024, 7:58 PM IST

Srungavarapu kota YCP Leaders MLA vs MLC

విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైఎస్సార్సీపీలో వర్గపోరులో చివరకూ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. నేటి వరకూ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అంటూ సాగిన వర్గపోరులో చివరకు బొత్స నుంచి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు స్పష్టత లభించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

శృంగవరపుకోట సీటు కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గ పోరు

Srungavarapukota YCP Leaders MLA vs MLC: అధికార పార్టీలో రోజు రోజూకు వర్గవిబేధాలు బహిర్గతమవుతున్నాయి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైఎస్సార్సీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఆ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ వైఎస్సార్సీపీ అసమ్మతి నాయకులు ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వద్ద తేల్చి చెప్పగా, నేడు బొత్స సత్యనారాయణతో భేటీ అయిన ఇరువురిలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు బొత్ససత్యనారాయణ మద్దతు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

శృంగవరపుకోట వైఎస్సార్సీపీలో వర్గపోరు ముదిరింది. అధికారపార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వద్దంటున్న ఓ వర్గం, ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుతో పార్టీకి నష్ఠమంటూ మరో వర్గం పార్టీ ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. గతేడాది ఈ విషయంపై అమాత్యుల ఎదుట ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలు పోటాపోటీగా నిరసన వ్యక్తం చేశారు. తాజాగా ఎమ్మెల్సీ వర్గీయలు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాకు వద్దని వైవీ సుబ్బారెడ్డి వద్ద బలప్రదర్శనకు దిగారు.

ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాకొద్దు, స్థానికులెవరికైనా టికెట్‌ ఇవ్వండి, తప్పకుండా గెలిపించుకుంటామని వైఎస్సార్సీపీ అసమ్మతి వర్గం స్పష్టం చేసింది. కాదని ఆయనకు టికెట్‌ ఇస్తే ఓటమి ఖాయం’ అని వైవీ సుబ్బారెడ్డిని విశాఖపట్నంలో కలిసి చెప్పారు. నియోజకవర్గం నుంచి 45 మంది సర్పంచులు, 50 మంది ఎంపీటీసీ సభ్యులు, పలువురు నాయకులు వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. వీరితోపాటు ఎస్‌.కోట ఎంపీపీ సోమేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యురాలు ఎం.వెంకటలక్ష్మి ఉన్నారు. ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయామని వైవీ సుబ్బారెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

2014 నుంచి పార్టీ కోసం పని చేసిన వారిని ఎమ్మెల్యే పూర్తిగా పక్కన పెట్టారని సుబ్బారెడ్డికి వివరించారు. తాను చెప్పినట్లు అందరూ వినాలనే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గురించి పలుమార్లు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా, ఆయనలో మార్పు రాలేదని తెలిపారు. తమపై కక్ష సాధింపులకు కూడా పాల్పడుతున్నారని ఈ విధంగా చేస్తే పార్టీలో ఎలా పని చేయాలని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని సుబ్బారెడ్డి చెప్పినట్లు అసమ్మతి నాయకులు చెప్పారు.

బొత్స నుంచి స్పష్టత: అయితే, తాజాగా రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఇద్దరు నేతల పంచాయతీ నేడు మంత్రి బొత్స సత్యనారాయణ వద్దకు చేరింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘురాజు, వారి వారి మద్దతుదారులతో విజయనగరంలోని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డిని కలసిన అనంతరం, నేడు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణను రెండు వర్గాలు విడివిడిగా కలిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మీద మంత్రి బొత్స మండిపడినట్లు తెలిసింది. నీకు ఇందుకేనా ఎమ్మెల్సీ ఇచ్చామంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నీ పని నువ్వు చేసుకోమని, తనకు మంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే కడుబండి మీడియాకు తెలియచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.