ETV Bharat / state

కల్లాల్లో నెలల తరబడి ధాన్యం.. దళారులను ఆశ్రయించక తప్పటం లేదంటున్న రైతులు

author img

By

Published : Feb 1, 2023, 10:26 AM IST

Grain Farmers: దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు. పండిన ప్రతి ధాన్యం గింజా కొంటాం. ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీ. కానీ క్షేత్రస్థాయిలో అమలు కావటంలేదు. ధాన్యం నిల్వలు ఎక్కడికక్కడ కల్లాల్లో కనిపిస్తున్నాయి. దళారులను ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయని.. రైతులు లబోదిబోమంటున్నారు.

Etv Bharat
Etv Bharat

కల్లాల్లో నెలల తరబడి ధాన్యం..

Grain Farmers Problems: పంట కోసి కల్లంలో పోసి ఉంచామని రైతులు వాపోతున్నారు. రైతు భరోసా కేంద్రంలో పోసి సంచులలో నింపి ఉంచామని.. ధాన్యం కొనుగోళ్లు జరగలేదని, పెట్టుబడి ఖర్చులకు ఇబ్బందిగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పంట కోసి రెండు నెలలు గడుస్తున్నా.. ధాన్యం రైతు భరోసా కేంద్రం నుంచి కదలటం లేదని రైతులు అంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తే వెళ్తాయి అంటున్నారని.. కూలీ డబ్బుల చెల్లించటానికి ఇబ్బందులు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

విజయనగరం జిల్లాలో ధాన్యం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవి మచ్చుకు మాత్రమే. జిల్లాలో ఈ ఏడాది 5.11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో 2.80లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. మిగిలిన ధాన్యం.. కల్లాల్లోనే ఉన్నా అధికారులు మాత్రం సంక్రాంతికి ముందు నుంచే కొనుగోళ్లు నిలిపివేశారు. తాజాగా జిల్లాలో అదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతులు వచ్చాయి. ఇది ఏ మాత్రం సరిపోదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు.

"పంట కోసి నెల రోజులు అవుతోంది. పంట కోసిన కూలీలకు నగదు చెల్లించలేదు. 80 వేల రూపాయల పెట్టుబడి ఖర్చు అయ్యింది. కూలీ డబ్బులు చెల్లించటానికి నా దగ్గర నగదు లేదు. ఈ ధాన్యం ఎప్పుడు అమ్ముడవతుందో తెలియటం లేదు." -రైతు

ఖరీఫ్ ధాన్యం కళ్లాలకే పరిమితం కావటం వల్ల.. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు, కూలీల డబ్బులు ఇవ్వలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో మారుతున్న వాతావరణం, ఎలుకల బెడదతో రైతులు కలవరం చెందుతున్నారు.

"వానకు ధాన్యం తడిసిందంటే వాటిని కోనుగోలు చేయరు. ధాన్యం బస్తాలలో నింపి ఉంది. ఒకవేళ ధాన్యం తడిస్తే మొలకవచ్చింది, నల్లబడ్డాయి అంటారు. తడవటం వల్ల రెండు కేజీలు అదనంగా వస్తోంది, తక్కువగా వస్తోందని అంటారు. ఇన్ని రకాలుగా మాట్లడితే మేము ఏం చెప్పాలి. మేము కష్టం చేసుకునే రైతులం మేము ఏం చేయగలం" -రైతు

అధికారులు మాత్రం ఖరీఫ్ ధాన్యం సేకరణపై రైతులు దిగులు చెందవద్దని చెబుతున్నారు. ఆర్బీకేల ద్వారా రెండో విడత కొనుగోలు ప్రారంభించామని.. ఎక్కడైన సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సూచించారు.

"విజయనగరం జిల్లాలో దాదాపు లక్ష మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణకు ఉందని తెలిసింది. దాని ప్రకారం ప్రతి ఆర్బీకే సెంటర్​కు టార్గెట్​లు ఇచ్చి కోనుగోలు చేస్తున్నాము. జిల్లాలో ఎక్కడ సమస్యలు లేవు. రైతులకు సహాయం కోసం కంట్రోల్​ రూమ్​ కూడా ఏర్పాటు చేశాము. ఏవైనా సమస్యలు ఉంటే రైతులు కంట్రోల్​ రూమ్​కు ఫోన్​ చేసి తెలపవచ్చు." -మయూర్ అశోక్, విజయనగరంజిల్లా జేసీ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.