విమానాశ్రయ ప్రతిపాదిత గ్రామాల్లో కూల్చివేతలు..

author img

By

Published : Jan 30, 2023, 12:30 PM IST

BHOGAPURAM AIRPORT

DEMOLITIONS IN BHOGAPURAM : భోగాపురం మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించిన గ్రామాల్లో.. ఇళ్లను అధికారులు కూల్చేశారు. ఖాళీ చేయాలంటూ నోటిమాటగా చెప్పి మర్నాడే కూల్చివేయటంతో.. నిర్వాసితులు మండిపడుతున్నారు. ఉన్నపళంగా ఎక్కడికెళ్లి బతకాలంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

విమానాశ్రయ ప్రతిపాదిత గ్రామాల్లో కూల్చివేతలు.. ఎక్కడికెళ్లి బతకాలంటూ నిర్వాసితుల ఆవేదన

HOUSES DEMOLITIONS IN BHOGAPURAM : విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముడసర్లపేట, బొల్లింకపాలెంలో నాలుగు ఇళ్లతోపాటు పాఠశాల భవనాన్ని(జేసీబీ) JCB సాయంతో తొలగించారు. గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలని లేకపోతే విద్యుత్‌, తాగునీటి సరఫరా నిలిపివేస్తామని ఆర్డీవో సూర్యకళతోపాటు రెవెన్యూ అధికారులు హెచ్చరించారని స్థానికులు చెబుతున్నారు.

కొంతమందికి పూర్తి పరిహారం రాలేదని, ఇతర ప్రయోజనాలు అందాల్సిఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం కూల్చిన ఇళ్లకు సంబంధించిన యజమానులు పునరావాసకాలనీల్లో ఇళ్లు నిర్మించుకున్నారని, వారి అంగీకారంతోనే కూల్చేశామని అధికారులు అంటున్నారు.

విమానాశ్రయం కోసం 2200 ఎకరాలు అవసరం కాగా ప్రభుత్వం ఇతర అవసరాల కోసం అదనంగా 500 ఎకరాలను సేకరించడంతో నాలుగు గ్రామాలను తరలించాల్సి వస్తోంది. మరడపాలెంలో 223, ముడసర్లపేటలో 33. బల్లింకపాలెంలో 55, రెల్లిపేటలో 85 కుటుంబాలు ఉన్నాయి. వీరి కోసం గూడెపువలసలో 17 ఎకరాలు, పోలిపల్లి రెవెన్యూ లింగాలవలసలో 25 ఎకరాల్లో పునరావాస కాలనీలను నిర్మిస్తున్నారు. ఇక్కడ నిర్వాసితుల ఇళ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.

"ఇప్పటి కూడా మేము ఇళ్లులు ఇవ్వమని పేచిపెట్టట్లేదు. ఎప్పటికైనా ఇళ్లులు ఇస్తాం. కాకపోతే మాకు కొంచెం గడువు ఇస్తే మా అంతటా మేమే ఖాళీ చేస్తాం. అయితే మరొక రెండు నెలలు సయయం ఇచ్చి.. ఇళ్లు కూల్చివేతలు చేపడితే బాగుంటది. పాలనకు కూడా ఒక రూల్​ ఉంటుంది. ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉండాలి కానీ.. ప్రజల నుంచి అన్యాయంగా లాగేసుకుంటే ఎలా"-చిట్టిబాబు, స్థానికుడు

రహదారులు, కాలవల నిర్మాణం పూర్తి కాలేదు. అవన్నీ పూర్తయితే వెంటనే ఖాళీ చేస్తామని నిర్వాసిత గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ముడసర్లపేట, మరడపాలెం, బొల్లింకలపాలెం, రెల్లిపేటలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలను మూసేస్తున్నట్టు విద్యాశాఖాధికారి ఈ నెల 28న ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులను సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేస్తామని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.