ETV Bharat / state

"ఇక్కడ పండు చెబితేనే ఏదైనా...మాతో వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి"

author img

By

Published : Apr 9, 2022, 9:52 AM IST

బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన ఆ మహిళకు కన్నీళ్లీ తోడయ్యాయి... ప్రమాదంతో మంచాన పడిన భర్త, ఇద్దరు పిల్లలు... రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి... అద్దె కట్టలేక ఖాళీ స్థలంలో పాక వేసుకుని బతుకు నెట్టుకొస్తున్న ఆ మగువకు... కార్పొరేటర్ భర్త​ రూపంలో కష్టాలు మొదలయ్యాయి. అంతేనా అతడి మనుషులతో గడపాలని మానసిక వేధింపులు చుట్టుముట్టాయి. చివరికి ఆమె ఏం చేసిందంటే..?

Corporator harassing woman
మహిళకు కార్పొరేటర్​ భర్త వేధింపులు

"నువ్వు నేరుగా ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి వద్దకు వెళ్తే పనిచేస్తారా? అక్కడ నిన్ను ఎవరూ ఖాతరు చేయరు. రూ.లక్షలు ఖర్చు పెట్టి 'పండు' తన భార్యను కార్పొరేటర్‌ చేశాడు. అతను ఎమ్మెల్యేకు చెబితేనే ఏ పనైనా అయ్యేది! అన్నా.. మొన్న ఎన్నికల్లో ఈమె మనకు ఓటేస్తానని వేయలేదు, మనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని పండు చెప్పాడనుకో.. ఏమవుతుంది! అవేమీ లేకుండా అంతా నేను చూసుకుంటాను. నువ్వంటే నాకిష్టం. మా వద్దకు వస్తే నిన్ను కాపాడుతాం" ఓ అభాగినికి కార్పొరేటర్‌ భర్త తాలూకు మనుషుల బెదిరింపులు ఇవి.. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

గంట్యాడ మండలానికి చెందిన ఓ మహిళ 15 ఏళ్ల కిందట కుటుంబంతో కలిసి నగరానికి వచ్చి ఒక అపార్టుమెంటులో కాపలాదారుగా చేరింది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఒక ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమవ్వడంతో ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. అద్దెలు కట్టలేక కేఎల్‌పురం సమీపంలో కొండ పక్కన ఖాళీ స్థలంలో పాక వేసుకుంది. ఇటీవల కార్పొరేటర్‌ భర్త పండు వచ్చి 'పాక తీస్తావా? రూ. 2 లక్షలు ఇస్తావా?' అంటూ బెదిరించడం ప్రారంభించాడు. ఆమె బతిమిలాడగా, తన మనిషి వస్తాడని, అతను అన్నీ చెబుతాడని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత కార్పొరేషన్‌లో మేస్త్రీగా పనిచేసే త్రినాథ్‌, పండు సోదరుడు వేణు రోజూ ఆమె వద్దకు వెళ్లి 'డబ్బులు వద్దులే.. మా ముగ్గురితో గడిపితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి' అనడం మొదలెట్టారు. ఆమె ఒప్పుకోకపోవడంతో రోజూ కార్పొరేషన్‌ ఉద్యోగులు ఇద్దరిని పంపి బెదిరించడం మొదలెట్టారు. ఈ క్రమంలో త్రినాథ్‌ సదరు మహిళతో అసభ్యకరంగా మాట్లాడారు. వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా దిశ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ టి.త్రినాథ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: రూ.15 లక్షలిస్తేనే పెళ్లి.. లేదంటే నన్ను మరిచిపో.. ఆ తర్వాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.