విశాఖ దసపల్లా భూముల స్వాహాకు వడివడిగా అడుగులు..

author img

By

Published : Nov 17, 2022, 9:05 AM IST

Visakhapatnam

Visakha Dasapalla lands are 22A: దసపల్లా భూముల స్వాహాకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం అధికార పార్టీ కీలకనేత అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. సదరు నేత ఒత్తిడికి తలొగ్గిన అధికారులు.. ఆగమేఘాలపై భూముల సబ్‌డివిజన్‌ పూర్తి చేశారు. ఇక అతిత్వరలోనే విశాఖ కలెక్టర్‌.. దసపల్లా భూములను 22ఏ నుంచి డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందనే ప్రచారం.. ముమ్మరంగా జరుగుతోంది.

Visakha Dasapalla lands are 22A: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన.. దసపల్లా భూముల స్వాహాకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీనిపై కీలక నిర్ణయం తీసుకొనే దిశగా అధికార యంత్రాంగం పావులు కదుపుతోంది. ఈనెల 13న ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటన సందర్భంగా.. విశాఖలో బస చేసిన వైకాపా ముఖ్యనేత.. అధికారులతో ఈ భూముల డీనోటిఫికేషన్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.. దీంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్‌, ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌లతో పాటు జీవీఎంసీ, రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ, సర్వేశాఖ అధికారులు 1027, 1028, 1196, 1197 సర్వే నంబర్లలో విస్తరించి ఉన్న 60 ఎకరాల దసపల్లా భూములను పరిశీలించారు.

వాటిలో కొన్నింటిని ఇప్పటికే సేకరించి పరిహారం చెల్లించారు. అలా సేకరించిన భూమి 40 ఎకరాల వరకు ఉంది. అవి ఎక్కడ ఉన్నాయి? రాణి కమలాదేవి నగరంలో 65 మందికి విక్రయించిన భూములు ఎక్కడ ఉన్నాయి? గవర్నర్‌ బంగ్లా, నౌకాదళ భవనానికి చెందిన స్థలాలు ఏయే సర్వే నంబర్లలో విస్తరించి ఉన్నాయి? జీవీఎంసీ నిర్మించిన రెండు నీటి ట్యాంకులు, సులభ్‌ శౌచాలయం, వీఎంఆర్‌డీఏ వేసిన రోడ్లు, పార్కులు ఏయే సర్వే నంబర్లలో ఉన్నాయో తేల్చాల్సి ఉంది. ఇవి తేలాలంటే సబ్‌ డివిజన్‌ పనులు పూర్తి కావాలి. దీంతో ఆగమేఘాలపై ఇటీవల సబ్‌ డివిజన్‌ పనులు పూర్తి చేశారు.

నాలుగైదు రోజుల నుంచి కలెక్టర్‌, జేసీలు తరచూ జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, సర్వేశాఖ అధికారులతో భేటీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇంతకన్నా కీలకమైన పనులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ పెద్దల నుంచి గట్టి ఆదేశాలు రావడంతో ఇదే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ.. దసపల్లా భూముల్లో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ భవనాలు, పార్కులు, రహదారులు, ఇతర కట్టడాల వివరాలను అందజేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆయా వివరాలు అందిన వెంటనే ప్రభుత్వ ఆస్తులను 22ఏలో ఉంచి, మిగిలిన భూములను మినహాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కసరత్తు నాలుగైదు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం కలెక్టర్‌ దసపల్లా భూములను డీనోటిఫై చేసి ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

జిల్లాలో వేలమంది తమ భూములను 22ఏ నుంచి మినహాయించాలని వినతులు ఇస్తున్నారు. విశాఖలో మురళీనగర్‌, రేసపువానిపాలెం, మద్దిలపాలెం తదితర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి సబ్‌ డివిజన్‌ కాకపోవడంతో వేలమంది ఇప్పటికీ తమ ఆస్తులను 22ఏ చట్టం నుంచి మినహాయించుకోలేకపోతున్నారు. ఆయా అంశాలను పట్టించుకోని యంత్రాంగం.. ఆగమేఘాలపై దసపల్లా భూముల వ్యవహారాన్ని చక్కబెడుతుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ భూములపై గత ప్రభుత్వాలు న్యాయపోరాటం చేశాయి. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఆరేళ్ల క్రితం వచ్చిన కోర్టు తీర్పులను అడ్డు పెట్టుకుని భూముల స్వాహాకు వైకాపా కీలక నేత మంత్రాంగం నడిపారు. ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్‌ నుంచి దిగువ స్థాయి అధికారి వరకు డీనోటిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టడంపై అధికార వర్గాలూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

విశాఖలో ప్రధాని సభ ముగిసిన మరుసటి రోజు నుంచే రెవెన్యూ, సర్వే, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఏ కోణంలోనూ దసపల్లా భూములను రక్షించడంపై అధికారులు దృష్టి సారించలేదు. పైగా నీటి ట్యాంకులు, శౌచాలయం, రహదారులు, పార్కుల పరిరక్షణకు దసపల్లా భూములను సబ్‌డివిజన్‌ చేసి 22ఏ నుంచి మినహాయిస్తున్నామని కొత్త వాదన తెస్తున్నారు. ఇక గవర్నర్‌ బంగ్లా, నౌకాదళ భవనానికి సేకరించిన భూములకు 1969లోనే అవార్డులు జారీ చేసి పరిహారం చెల్లించారు. అప్పట్లోనే వాటిని సబ్‌ డివిజన్‌ చేసి 22ఏ నుంచి మినహాయించాల్సి ఉంది. అది జరగకపోవడంతో ఇప్పుడు చేస్తున్నారు. అంతేతప్ప తాజాగా అధికారులు చేస్తున్నదేం లేదని ఆయా వర్గాలు వివరిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.