ETV Bharat / state

8.40 గంటల్లో విశాఖకు వందేభారత్‌.. దురంతో కంటే గంటన్నర తక్కువ

author img

By

Published : Jan 11, 2023, 7:08 AM IST

Updated : Jan 11, 2023, 9:34 AM IST

Vande Bharat Express: సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఈ నెల 19 తర్వాత అందుబాటులోకి రానున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. రెండు నగరాల మధ్య ప్రయాణ వేగాన్ని బాగా తగ్గించనుంది. కేవలం 8 గంటల 40 నిమిషాల్లోనే గమ్యం చేరుకోనుంది. ఈ రెండు నగరాల మధ్య నడిచే అత్యంత వేగవంతమైన సర్వీసైన దురంతో కంటే గంటన్నర ముందుగానే వందేభారత్‌ గమ్యం చేరనుంది.

Vande Bharat Express
వందేభారత్ ఎక్స్​ప్రెస్

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఈ నెల 19న సికింద్రాబాద్‌ నుంచి విశాఖ మధ్య ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నడుస్తున్న రైళ్లలో అత్యంత వేగంగా వెళ్లేది దురంతోనే. వారానికి మూడు రోజులు నడిచే ఈ రైలు.. 10 గంటల 10 నిమిషాల్లో గమ్యం చేరుకుంటోంది. అదే.. వందేభారత్‌ రైలు ప్రయాణం 8 గంటల 40 నిమిషాలుగా.. రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.

సికింద్రాబాద్‌ నుంచి విశాఖ మధ్య ప్రారంభం కానున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

మాడు గంటల సమయం ఆదా: దురంతో కంటే గంటన్నర ముందుగా.. ఇది సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు చేరుకుంటుంది. రోజు నడిచే ఇతర రైళ్లతో పోలిస్తే.. వందేభారత్‌లో దాదాపు 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. గరీబ్‌రథ్‌ 11 గంటల 10 నిమిషాలు, ఫలక్‌నుమా 11 గంటల 25 నిమిషాలు, గోదావరి 12 గంటల 5 నిమిషాలు, ఈస్ట్‌కోస్ట్‌ 12 గంటల 40 నిమిషాలు, జన్మభూమికి 12 గంటల 45 నిమిషాల సమయం పడుతోంది.

ఛార్జీలపై రైల్వే శాఖ స్పష్టత ఇవ్వాలి: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణవేళలు, ఛార్జీల వివరాల్ని రైల్వేశాఖ ప్రకటించాల్సి ఉంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు 699 కిలోమీటర్ల దూరం. దిల్లీ.. జమ్మూలోని కాట్రా మధ్య వందేభారత్‌ నడుస్తోంది. ఈ రెండింటి మధ్య దూరం 655 కిలోమీటర్లు కాగా.. ఇందులో ఛైర్‌కార్ టికెట్‌ ధర 16 వందల 65, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ధర 3 వేల 55 రూపాయలు.

ఆరోజున ప్రయాణికులకు నో అనుమతి: సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య దూరం ఇంకాస్త ఎక్కువే కావడంతో.. దిల్లీ-కాట్రా వందేభారత్‌ ఛార్జీల కంటే కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఈ నెల 19న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నప్పటికీ.. ఆ రోజున ప్రయాణికులను అనుమతించరు. ఈ రైలు ఎప్పటినుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నది.. రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది.

వందేభారత్​ రైలు ఆగే స్టేషన్లలో ఖమ్మంకు చోటు: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రోజూ ఉదయం 5 గంటల 45 నిమిషాలకు విశాఖ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 20 నిమిషాల విరామంతో తిరిగి బయల్దేరుతుంది. రాత్రి విశాఖకు చేరుకుంటుంది. విజయవాడలో 5 నిమిషాలపాటు, ఇతర స్టేషన్లలో రెండు నిమిషాల చొప్పున ఆగుతుంది. వందేభారత్‌ ఆగే స్టేషన్లలో ఖమ్మంను కూడా చేర్చారు. అయితే అక్కడ ఈ రైలు ఆగే సమయం తెలియాల్సి ఉంది. ఏలూరు, సామర్లకోట స్టేషన్లలోనూ ఈ రైలును ఆపాలని తొలుత రైల్వే శాఖ భావించింది. అయితే ఎక్కువ స్టేషన్లలో ఆపితే ప్రయాణ సమయం పెరుగుతుందని భావించి.. వీటిని మినహాయించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.