ETV Bharat / state

అయ్యో పాపం.. బిడ్డ మృతదేహంతో స్కూటీపై 120 కిలోమీటర్ల ప్రయాణం

author img

By

Published : Feb 16, 2023, 9:23 PM IST

Updated : Feb 16, 2023, 10:33 PM IST

No Ambulance: రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడే సంఘటన ఇది.. సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 15రోజుల శిశువు కన్నుమూయగా.. బిడ్డ మృతదేహాన్ని తల్లిదండ్రులు స్కూటీపై తమ ఇంటికి తీసుకుపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆస్పత్రి వర్గాలు అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో... దాదాపు 120 కిలోమీటర్లు ఆ బాలింత తన బిడ్డను ఒళ్లో పెట్టుకుని బైక్​పై ప్రయాణించింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్​ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

స్కూటీ పై బిడ్డ మృతదేహంతో తల్లిదండ్రులు
స్కూటీ పై బిడ్డ మృతదేహంతో తల్లిదండ్రులు

No Ambulance: విశాఖ కేజీహెచ్ లో దారుణం చోటు చేసుకుంది. కేజీహెచ్ నుండి 120 కిలోమీటర్లు స్కూటీపై బిడ్డ మృతదేహంతో తల్లిదండ్రులు ప్రయాణించిన ఘటన కలచివేస్తోంది. అంబులెన్స్ కోసం ఎంత ప్రాధేయపడినా కేజీహెచ్ సిబ్బంది నుండి స్పందన కరవవడంతో.. గత్యంతరం లేక తల్లిదండ్రులు స్కూటీపై పాడేరుకి పయనమయ్యారు.

స్కూటీ పై బిడ్డ మృతదేహంతో తల్లిదండ్రులు

పుట్టిన 15 రోజులకే...: అల్లూరి జిల్లా కుమడకు చెందిన గర్భిణి ఫిబ్రవరి 2వ తేదీన పాడేరు ఆస్పత్రిలో ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పిన వైద్యులు.. మెరుగైన వైద్య సహాయం కోసం విశాఖలోని కేజీహెచ్​కు రిఫర్ చేశారు. కాగా, విశాఖ కేజీహెచ్​లో చికిత్స పొందుతున్న శిశువు గురువారం తెల్లవారుజామున 7.15 గంటలకు కన్నుమూసింది. పసిబిడ్డ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు కేజీహెచ్​లోని ఐటీడీఏ సెల్​లో సంప్రదించగా.. అంబులెన్స్ లేదని చెప్పారు. అప్పటికే 2గంటలు వేచి ఉన్న తల్లిదండ్రులు.. చేసేది లేక తమ ద్విచక్రవాహనంలో సొంత గ్రామానికి పయనమయ్యారు. ఇదిలా ఉండగా కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అంబులెన్స్ సమకూర్చలేదన్న ఆరోపణ అవాస్తవం. ఉదయం 7.50 గంటలకు చిన్నారి చనిపోతే 9.15 గంటలకు అంబులెన్స్ ఏర్పాటు చేశాం. ఉదయం 8.57 గంటలకే మృత శిశువుతో తల్లిదండ్రులు వెళ్లిపోయారు.. దాంతో పాడేరులో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవోకు సూచించాం. కేజీహెచ్ తరఫున ఏ లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.. ఘటనపై విచారణ జరుపుతున్నాం. - డా.అశోక్‌, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌

గిరిజన దంపతులకు సీఎం క్షమాపణలు చెప్పాలి: శిశువు మృతదేహాన్ని స్కూటీపై తరలించాల్సిన పరిస్థితి రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేజీహెచ్​లో చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వని ముఖ్యమంత్రి.. విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. బిడ్డ మృతదేహాన్ని 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్లిన ఆ గిరిజన దంపతులకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పాడేరు ప్రాంతంలోని కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతులు పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని మృతదేహాన్ని తీసుకువెళ్లటం చూసి ఎవరికైనా గుండె కరుగుతుందన్నారు. కానీ రాతిగుండె ప్రభుత్వంలో మాత్రం కనీస స్పందన లేదని దుయ్యబట్టారు.

కేజీహెచ్​లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా... ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అమానవీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు అశ్రద్ధకు ఈ ఘటనే నిదర్శనంగా అభివర్ణించారు. కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడిన ఇబ్బందులను పవన్ గుర్తు చేశారు. అలాగే మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారన్నారు. మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని ప్రశ్నించారు.

బెంజి సర్కిల్​లో అంబులెన్సులు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే చాలదన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు రూ.14 వేల కోట్ల బడ్జెట్ ఇచ్చినట్లు గొప్పలు చెప్పటం మాని.. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 16, 2023, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.