ETV Bharat / state

TDP Leaders Meet CEO: వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నారు: అచ్చెన్నాయుడు

author img

By

Published : Aug 3, 2023, 5:10 PM IST

TDP Leaders Meet CEO: విశాఖలో ఎన్నికల ప్రధాన అధికారిని టీడీపీ నేతలు కలిశారు. అచ్చెన్న నేతృత్వంలో ముకేశ్ కుమార్ మీనాను కలిసిన టీడీపీ నేతలు.. ఓటరు జాబితా, మార్పులు చేర్పులు, తొలగింపులపై వివరాలను అందించారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

TDP Leaders Meeting with CEO
ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన టీడీపీ నేతలు

TDP Leaders Meet CEO: విశాఖ నోవాటెల్​ హోటల్​లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాను టీడీపీ నేతల బృందం కలిసింది. ఓటర్ జాబితా, సవరణ, మార్పులు చేర్పులు, తొలగింపులు ఇతర అంశాలపై పార్టీ తరఫున వివరాలను అందించారు. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని నియోజకవర్గాల వారీగా జరుగుతోన్న ఉదంతాలను వివరంగా తెలిపామని అచ్చెన్నాయుడు అన్నారు.

ఏపీలో ఉండే పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. పక్క రాష్ట్రాల నుంచి ఎన్నికల విధులకు అధికారులను వినియోగించాలని చెప్పామని అన్నారు. 34 ఓట్లు ఒకే తండ్రి పేరు ఉందంటే.. రాష్ట్రంలో పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని చెప్పారు. టెంపరరీ మైగ్రేషన్ ఓట్లను కూడ తొలగించారని ఆవేదన చెందారు.

ఓట్ల తొలగింపులపై ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన టీడీపీ నేతలు

"స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల విధానం ఎప్పుడూ ఒకే విధంగా జరిగేది. కానీ ఈ సారి కొత్తగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లను తీసుకురావడం వలన తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధానం తెలియదు. వాలంటీర్ల ద్వారా ఓట్లు తొలగిస్తున్నారు". - అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

తప్పుచేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 9 నెలల ముందుగానే ఎన్నికల కసరత్తు మొదలైందంటే రాష్ట్రంలో పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం అర్ధం చేసుకుందని అన్నారు. అధికారులు ఎవరైనా తప్పుచేస్తే శిక్ష తప్పదని ఎన్నికల కమిషన్ కచ్చితంగా చెప్పిందని తెలిపారు. ఎన్నికల కమిషన్​ను స్వతంత్రంగా పని చేయలేని దుస్ధితిని ఇప్పటి వరకూ ఏపీలో చూశామని.. రూల్ ఆఫ్ లా లేకుండా రూల్ ఆఫ్ రూలింగ్ నడుస్తోందని మండిపడ్డారు.

దారి మళ్లిస్తున్నారు: అనుభవం లేని సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని సూచించామని.. ఎన్నికల అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ వాటిని దారి మళ్లిస్తున్న విషయాన్ని దృష్టికి తెచ్చామన్నారు. వర్షాకాలం ఇబ్బందుల కారణంగా ఓటర్ల సర్వే ప్రక్రియను ఒక నెల పొడిగించాలని కోరామని.. అందుకు సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు.

ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాతో జరిగిన ఈ సమావేశంలో అచ్చెన్నాయుడుతో పాటు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, శాసన మండల సభ్యులు పరుచూరి అశోక్ బాబు, ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ కృష్ణయ్య, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జి ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.