ETV Bharat / state

TDP Leaders Bus Yatra in AP: రెట్టింపు ఉత్సాహంతో 'భవిష్యత్​కు గ్యారెంటీ' బస్సు యాత్ర..

author img

By

Published : Jun 28, 2023, 7:29 AM IST

TDP Leaders Bus Yatra in AP: అవినీతి, అక్రమ దాడులు, అఘాయిత్యాలే తప్ప.. ఉపాధి, అభివృద్ధి ఊసే లేని వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడితేనే రాష్ట్రానికి భవిష్యత్‌ అంటూ.. తెలుగుదేశం నేతలు భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్రల్లో ప్రజలకు పిలుపునిస్తున్నారు. వైసీపీ పాలనలో అన్నివిధాల నాశమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి.. అభివృద్ధి పథంలో నడిపించాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

Etv Bharat
Etv Bharat

TDP Leaders Bus Yatra in AP: విశాఖలో గాజువాకలో భవిష్యత్‌కు గ్యారెంటీ చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ నేతలు.. అగనంపూడి టోల్ గేట్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. వైసీపీ ఎంపీ కమిషన్‌కు కక్కుర్తి పడి టోల్ గేట్ నిర్వహిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్‌ నిర్వాసిత కాలనీల్లో యాత్రకు సిద్ధమైన టీడీపీ నేతలను అనుమతులు లేవంటూ పెద్ద గంట్యాడలో పోలీసులు అడ్డుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్ర నిర్వహించారు. పెరవలి మండలంలో రచ్చబండ చేపట్టారు. 9 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఏడు లక్షల కోట్లు స్వాహా చేసిందని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

"రాష్ట్రంలో రెండు లక్షల కోట్లను నేరుగా బటన్ నొక్కి ప్రజలకు అందించాను అని చెప్తున్న జగన్.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయితే ఆ సంక్షేమం అందదు అని అసత్యాలు పలుకుతున్నారు. రాష్ట్రానికి తొమ్మిది లక్షల కోట్లు వచ్చాయి. మరి ఆ మిగిలిన ఏడు కోట్లు ఏమయ్యాయో రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి." - నిమ్మల రామానాయుడు, టీడీపీ ఎమ్మెల్యే

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పేటసన్నెగండ్లలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సుయాత్ర నిర్వహించారు. దుర్గి మండలం అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి ఆలయ సమీపంలోని అక్రమ మట్టి తవ్వకాలపై సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు.

"ఇసుక, మట్టి, గ్రానైట్, అక్రమ మద్యం ఇవన్నీ చాలవన్నట్టు.. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కూడా వైసీపీ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా వందల కిలోమీటర్ల నుంచి అమ్మవారి దేవాలయానికి వచ్చి.. మొక్కులు తీర్చుకునే ఆలయ ధర్మకర్తను అనేక ఇబ్బందులకు గురిచేశారు." - ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ సీనియర్ నేత

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పిలో కాల్వ శ్రీనివాసులు భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్ర సాగింది. జగన్​కు ఓటు వేస్తే ఆయన కుటుంబం బాగు చూసుకుంటారని, చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రజల కోసం పనిచేస్తారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.

"ఈ రాష్ట్రంలో కూలి చేసి కష్టపడే సంపాదించే ప్రతిఒక్కరూ తమ జేబు నుంచి రోజూ 100 రూపాయలు తాడేపల్లికి కడుతున్నారు. ఎప్పుడో వచ్చే 18 వేల రూపాయలు చూసి అక్కచెల్లెమ్మలు మురిసిపోతున్నారు. కానీ ప్రతి రోజూ వారి భర్తలు వైసీపీ ప్రభుత్వానికి కడుతున్నారని నేను గుర్తుచేస్తున్నాను. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. రైతుల ఎరువులపై సబ్సిడీ తీసేశారు. పురుగుల మందులు, ఎరువుల రేట్లు పెరిగిపోయాయి. వీటన్నింటి వల్ల మనకు అప్పులు పెరిగితే.. జగన్​కు లెక్కలు పెరిగాయి." - పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా కావలిలో బస్సు యాత్ర ఉత్సాహంగా సాగింది. నిలిచిపోయిన ప్రధాన ప్రాజెక్టుల పనులను టీడీపీ నేతలు పరిశీలించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు టీడీపీ నేతలు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.