ETV Bharat / state

ఒక్కసారి రుచి చూస్తే.. మళ్లీ మళ్లీ తినాల్సిందే

author img

By

Published : Nov 7, 2022, 7:45 PM IST

milk kova
శ్రీకాళహస్తి పాలకోవా

Srikalahasti pala kova: శ్రీకాళహస్తి పాలకోవా.. ఈ పేరు వింటే చాలు.. ఆ రుచి తెలిసినవారికి నోరూరక మానదు. కోవాలందు కాళహస్తి కోవా రుచి వేరయా అనక మానరు. అంతగా ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీకాళహస్తి పాలకోవాపై ప్రత్యేక కథనం..

Srikalahasti pala kova: తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి అంటే గుర్తొచ్చేది.. అక్కడి శ్రీకాళహస్తిశ్వరుడి ఆలయం. కానీ అక్కడికి వెళ్లిన వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేది మరొకటి ఉంది. అదే పాలకోవా. ఆ కోవా రుచి చూసిన వారెవరూ దాన్ని మరచిపోలేరు. శ్రీకాళహస్తి పాలకోవా... దాదాపు 7 దశాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. పరిసర ప్రాంతాల్లోని పాడి రైతుల నుంచి సేకరించిన పాలతో దీనిని తయారుచేస్తారు. కేవలం పాలు, చక్కెరతో... యంత్రాల సాయం లేకుండా చేతులతో తయారుచేసే ఈ కల్తీలేని కోవా అంటే... సామాన్యులకే కాదు ఎంతో మంది ప్రముఖులకూ చాలా ఇష్టం. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలోనూ... శ్రీకాళహస్తి పాలకోవాపై ఓ డైలాగ్‌ వాడారు. చిత్ర బృందం... కాళహస్తికి వచ్చి మరీ ఇక్కడి పాలకోవాను తీసుకెళ్లారు..

"43 గ్రామాలలో నేరుగా రైతుల దగ్గర నుంచే పాలను సేకరిస్తాము. ఇందులో 1000లీటర్ల పాలను కోవా, ఐస్​క్రీమ్​, భాసంతి తయారీకి ఉపయోగిస్తాము. పాలకోవాను మెషిన్స్​తో కాకుండా మ్యాన్యువల్​గా తయారుచేయటం ద్వారా కోవా బాగా రుచికరంగా వస్తుంది." -మధుసూదనరావు, ఛైర్మన్‌, శ్రీకాళహస్తి పాల సరఫరా సంఘం

శ్రీకాళహస్తి పాలకోవాకు తెలుగు రాష్ట్రాలతోపాటు.. కర్ణాటక, తమిళనాడులోనూ మంచి గిరాకీ ఉంది. డిమాండ్‌ను బట్టి.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకూ ఇక్కడి పాలకోవాను రవాణా చేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కసారి ఈ కోవా రుచి చూసినవారు.. మళ్లీ మళ్లీ ఆస్వాదించాలనుకుంటారు.

"పుష్ప సినిమా షూటింగ్​ సమయంలో.. చిత్ర బృందంలో 20 మంది వరకు మా షాప్​కు వచ్చి ఐస్​క్రీమ్ కోవా తిన్నారు. చాలా బాగుందని చెప్పి 10కేజీల పాలకోవాను ప్యాక్​ చేసుకుని తీసుకెళ్లారు. చిత్ర బృందం పాలకోవా ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్​ చేసిన తరువాత మంచి ఆధరణ లభించింది. రోజూ పాలకోవాను సాయంత్రం 3గంటల వరకు అమ్మే మేము.. పుష్ప సినిమా ఎఫెక్ట్​తో మధ్యాహ్నం 12గంటలకే పాలకోవా అయిపోతుంది." -మునిరాజయ్య, మేనేజర్‌, శ్రీకాళహస్తి పాల సరఫరా సంఘం

శ్రీకాళహస్తి పాలకోవా.. ఒక్కసారి రుచి చూస్తే.. మళ్లీ మళ్లీ తినాల్సిందే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.