ETV Bharat / state

'చెట్ల కూల్చివేతకు అనుమతి లేదు' : అటవీ అధికారుల వివరణ

author img

By

Published : Aug 18, 2021, 8:01 PM IST

Updated : Aug 19, 2021, 4:34 AM IST

జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించిన కమిటీ.. విశాఖ జిల్లా బమిడికిలొద్ది లేటరైట్ క్వారీని పరిశీలించింది. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం నివేదికను ఎన్జీటీకి అందజేస్తామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.

NGT team inspecting a laterite quarry in Bamidi
బమిడికిలొద్ది లేటరైట్ క్వారీని పరిశీలించిన ఎన్జీటీ బృందం

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నియమించిన కమిటీ బుధవారం విశాఖ జిల్లా నాతవరం మండలం బమిడికలొద్ది లేటరైట్‌ క్వారీని పరిశీలించింది. కొండ పైభాగంలో తవ్వకాలు జరిగిన చోట చెట్లు ఉన్నాయా? ఉంటే కూల్చిన చెట్లకు అనుమతులు తీసుకున్నారా? అని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అటవీ అధికారులను ప్రశ్నించారు. క్వారీవాళ్లు ఎప్పుడూ తమను సంప్రదించలేదని, అనుమతులు తీసుకోలేదని నర్సీపట్నం డీఎఫ్‌వో సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో కొన్ని చెట్లు ఉంటాయని, వాటిలో కొన్ని పనికిరానివి ఉండొచ్చని రేంజ్‌ అధికారి ఒకరు సమాధానం చెప్పారు. పనికిరానివని మీరెలా చెబుతారంటూ కలెక్టర్‌ ప్రశ్నించారు. అనంతరం కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారి, అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎలెన్‌ మురుగన్‌ క్వారీ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో లేటరైట్‌ తవ్వారు?, అనుమతులు తీసుకున్న ప్రాంతంలోనే మైనింగ్‌ చేశారా? తదితర అంశాలపై ఆరుగురు కమిటీ సభ్యులు చర్చించుకున్నారు. క్వారీపై ఎన్జీటీలో ఫిర్యాదు చేసిన దళిత ప్రగతి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మరిడియ్యతో మాట్లాడారు. తవ్వకాలు సక్రమమేనా అని తేల్చేందుకు డీజీపీఎస్‌ సర్వే చేయించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రహదారిని పరిశీలించి వెనుతిరిగారు.

కాలినడక, ద్విచక్ర వాహనంతో కొండపైకి..

ఎన్జీటీ కమిటీ సభ్యులంతా కొండపైకి వెళ్లడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సుమారు ఆరు కిలోమీటర్ల ఘాట్‌రోడ్డులో... రెండు కిలోమీటర్ల వరకు కలెక్టర్‌ మల్లికార్జున కాలినడకనే ప్రయాణించారు. తర్వాత ద్విచక్ర వాహనంపై మైనింగ్‌ ప్రాంతానికి చేరుకున్నారు.

పరిశీలించాం... నివేదిక ఇస్తాం...

‘జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఏడు అంశాలను పరిశీలించాలని పేర్కొంది. వాటన్నింటినీ పరిశీలించి కొన్నింటిని గుర్తించాం. చెట్ల తొలగింపు అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రిజర్వు ఫారెస్ట్‌తో సంబంధం లేదు. రహదారి నిర్మాణం, డంపింగ్‌ యార్డు వంటి అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ఎన్జీటీకి నివేదిక ఇస్తాం’ అని కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. వారి వెంట విశాఖ డీఎఫ్‌వో అనంతశంకర్‌, పీసీబీ ఈఈ ప్రమోద్‌కుమార్‌, గనుల శాఖ డీడీ సూర్యచంద్రరావు, శాస్త్రవేత్త సురేష్‌బాబు, జేసీ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి..

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. సునీల్‌ యాదవ్​కు రిమాండ్ పొడిగింపు

Last Updated :Aug 19, 2021, 4:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.