ETV Bharat / state

National Best Teacher Uma Gandhi : ఆటపాటలే బోధనాభ్యసన మార్గాలు.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఉమాగాంధీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 3:37 PM IST

National Best Teacher Uma Gandhi : ఆటపాటలతో చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి కలిగించి.. వారిలో మనోవికాసం కలిగించాలని ఆమె తపన పడ్డారు. పేద విద్యార్థులను గొప్ప స్థాయికి తీసుకెళ్లడమే నిజమైన దేశభక్తిగా భావించారు. వినూత్న బోధనతో విద్యార్థుల మనసుతోపాటు అనేక అవార్డులూ గెలుచుకున్నారు. ఆమే.. జీవీఎంసీ శివాజీనగర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు డాక్టర్‌ మురహరరావు ఉమా గాంధీ.

National_Best_Teacher_Uma_Gandhi
National_Best_Teacher_Uma_Gandhi

National Best Teacher Uma Gandhi : ఆటపాటలే బోధనాభ్యసన మార్గాలు..! జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఉమాగాంధీ

National Best Teacher Uma Gandhi: విశాఖలోని జీవీఎంసీ శివాజీనగర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు డాక్టర్‌ మురహరరావు ఉమా గాంధీ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. విద్యారంగంలో ఆమె చేసిన విశేష సేవలకుగాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. నేటి తరం ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచిన ఉమాగాంధీపై కథనం. తన తండ్రి రామ కేశవరావు జీవన విధానం చూసి స్ఫూర్తి పొందిన ఉమాగాంధీ.. ఎలాగైనా ఉపాధ్యాయురాలు కావాలన్న సంకల్పంతో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని జీటీపీ కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. 1998 డీఎస్సీ (DSC)లో ప్రైమరీ స్కూల్‌ టీచర్‌గా మొదటిసారి విజయనగరంలోని మజ్జిపేట పాఠశాలలో పోస్టింగ్‌ తీసుకున్నారు. ఆ పాఠశాల అప్పుడే ప్రారంభం కావడంతో బిల్డింగ్‌ లేక... పూరిపాకలోనే పాఠాలు చెప్పేవారు. చుట్టుపక్కల పాములు, విషపురుగులతో దారుణమైన పరిస్థితులు ఉండేవి. పిల్లలను తరగతి గదిలో కూర్చోవాలని చెప్పినా పట్టించుకునేవారు కాదు. దీంతో తల్లులు వచ్చి వారి బాధను మొర పెట్టుకునేవారు. ఎలాగైనా పిల్లలను తరగతిలో కూర్చోబెట్టాలని ఉమాగాంధీ నిర్ణయించుకున్నారు. దాని కోసం తన తండ్రి అనుసరించిన విధానాన్ని ఎంచుకున్నారు.

గురుదేవోభవ

పిల్లలు చేసే అల్లరి, చిలిపి చేష్టలను పరిశీలిస్తూ, వాటినే పాటలుగా మార్చి వారి ముందు పాడేవారు. దీంతో చిన్నారుల్లో సైతం ఆసక్తి పెరిగి, తరగతి గదిలోకి వచ్చి పాఠాలు వినేవారు. మెల్లగా పాఠాలను కూడా పాటలుగానే మార్చి చెప్పడం మొదలు పెట్టారు. ఈ విధానం సత్ఫలితాలివ్వడంతో... విజయనగరంలోని లార్డ్‌ కిచెనరీ యూపీ స్కూల్‌, రేసపువానిపాలెం పాఠశాలల్లోనూ కొనసాగించారు. ప్రస్తుతం శివాజీపాలెంలోని ప్రాథమిక పాఠశాల (Primary School)లో 12 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడే ఐదేళ్ల క్రితం ఉమాగాంధీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందారు. ఇప్పడు రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకోవడం తమకు ఆదర్శంగా ఉందని... సహచర ఉపాధ్యాయురాలు అంటున్నారు.

Mekala Bhaskar Rao selected as National Best Teacher: విధిని ఎదిరించి.. అంగవైకల్యం అడ్డుకాదని నమ్మి.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక

పిల్లలు ఇష్టపడేలా ఆటపాటలతో పాఠాలు చెబితే వినేందుకు ఆసక్తి చూపిస్తారు. వాళ్ల స్థాయికి తగిన విధంగా ఉపాధ్యాయులు బోధనను మలచుకోవాలని... అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని ఉమాగాంధీ (Uma Gandhi) చెబుతున్నారు. పాఠాలతోపాటు జాతీయ వేడుకలు, స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక ఘట్టాలను చిన్నారులకు పాటలుగానే బోధిస్తున్నారు. పాటలు రూపొందించడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు. అప్పటికప్పుడు చిన్నారులు చేసే పనులను చూసి పాటలుగా మలిచి పాఠాల రూపంలో చెప్పడం ఉమాగాంధీ ప్రత్యేక నైపుణ్యం. పిల్లలు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటంతో పాటు వారి మెదడు చురుగ్గా పని చేసేందుకు వారితో యోగా, ధ్యానం చేయిస్తున్నారు.

విద్యార్థుల కుటుంబాలకు టీచర్ల అండ- 150 ఇళ్లు కట్టించి ఫ్రీగా...

పిల్లల అల్లరి, ఇతర కార్యకలాపాలను ఉమాగాంధీ గేయాలుగా మార్చి ‘పాలపుంత’ పేరుతో మొదటి బాలగేయ పుస్తకాన్ని రచించారు. పదనిసలు, రాధామాధవీయం, రాగమాల పుస్తకాలను రాశారు. వాటిలో సాహిత్యం, ఆధ్యాత్మికం, యువతకు సంబంధించిన విషయాలను విశదీకరించారు. విద్యా బోధనలో అనుసరిస్తున్న వినూత్న పద్ధతులకు ఉమా గాంధీని పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2010లో నాగార్జున వర్సిటీ (Nagarjuna University)లో ‘పట్నాయకుని మోహన’ కవిత్వంపై ఎంఫిల్‌ చేసి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. శీలా సుభద్రదేవి ‘కవిత్వం- పరిశీలన’ అంశంపై పరిశోధనకు 2016లో డాక్టరేట్‌ పొందారు. 2014లో జిల్లా స్థాయిలో, 2019లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలి ( Best teacher ) గా అవార్డులు పొందారు. గిరి ప్రదక్షిణ, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (Single use plastic) పై ప్రజల్లో చైతన్యం కలిగించేలా పాడిన పాటలకు.. జీవీఎంసీ (GVMC) గతేడాది ‘స్వచ్ఛ పురస్కార్‌’తో సత్కరించింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం తన ఉపాధ్యాయ జీవితంలో అలుపెరుగని కృషికి దక్కిన ఫలితంగా భావిస్తున్నట్టు తెలిపారు.

ఉమా గాంధీ లాంటి వారు దేశ ప్రగతిని మార్చే మార్గదర్శకులని... విశాఖకు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అభినందిస్తున్నారు. విశాఖ పేరును జాతీయ స్థాయిలో మార్మోగేలా చేసినందుకు ఉమాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

స్కూల్​​ యూనిఫామ్​లో టీచర్​.. పిల్లల్లో కలిసిపోయి, ఆటపాటలతో పాఠాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.