ETV Bharat / state

Hudhud Cyclone Complete 9 years: "హుద్‌హుద్‌" పీడకలకు తొమ్మిదేళ్లు.. చంద్రబాబును గుర్తు చేసుకుంటున్న ఉత్తరాంధ్ర ప్రజలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 12:16 PM IST

Updated : Oct 14, 2023, 2:39 PM IST

Hudhud Cyclone Complete 9 years: అంతకుముందెన్నడూ చూడని విలయం.. కళ్లెదుటే కరాళనృత్యం చేసింది. అలాంటి సమయంలో ప్రజలకు కావాల్సిన భరోసా ఇవ్వడమే కాదు. నేనున్నానంటూ ఆ నాయకుడు అండగా నిలిచారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హుద్‌హుద్‌ పీడకలకు తొమ్మిదేళ్లు పూర్తి అయిన వేళ ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును గుర్తు చేసుకుంటున్నారు

hudhud_cyclone_complete_9_years
hudhud_cyclone_complete_9_years

Hudhud Cyclone Complete 9 years : అంతకుముందెన్నడూ చూడని విలయం.. కళ్లెదుటే కరాళనృత్యం చేసింది. విధ్వంసకర విపత్తు.. చుట్టుముట్టేసింది. ఆ రక్కసి ధాటికి సర్వం కోల్పోయిన ప్రజలు తల్లడిల్లిపోయారు. అలాంటి సమయంలో ప్రజలకు కావాల్సిన భరోసా ఇవ్వడమే కాదు. నేనున్నానంటూ ఆ నాయకుడు అండగా నిలిచారు. నాలుగు గోడల మధ్య కూర్చొని సమీక్షలు చేయకుండా బస్సులోనే మకాం పెట్టి మరీ బాధితులకు ఆయన భుజం కాశారు. వారిలో మనోధైర్యం నింపి బతుకుపై ఆశను నింపారు. అధికారులను పరుగులు పెట్టించి మరీ కూలబడిపోయిందనుకున్న ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టారు. నెలల వ్యవధిలో తుపాను గాయాన్ని తుడిచి విశాఖకు పూర్వవైభవం తీసుకొచ్చారు. హుద్‌హుద్‌ పీడకలకు తొమ్మిదేళ్లు పూర్తి అయిన వేళ...పెను తుపాను సైతం తలొంచి చూసిన ఆ నాయకుడు...మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పని తనాన్ని మరోసారి ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు..

Hudhud Cyclone Complete 9 years: "హుద్‌హుద్‌" పీడకలకు తొమ్మిదేళ్లు.. చంద్రబాబును గుర్తు చేసుకుంటున్న ఉత్తరాంధ్ర ప్రజలు

Uttarandhra People Remenber Chandrababu Naidu Work in Hudhud Cyclone Situation : ప్రశాంత విశాఖ నగరంపై హుద్‌హుద్‌ విరుచుకుపడి అప్పుడే తొమ్మిదేళ్లు పూర్తి అయ్యింది. 2014 అక్టోబరు 12న తీరం దాటిన పెనుతుపాను.. కుండపోత వర్షాలతో పాటు గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులతో విశాఖలో విలయం సృష్టించింది. విద్యుత్తు, సమాచార వ్యవస్థలను కుప్ప కూల్చింది. రోడ్లపై కూలిన భారీ వృక్షాలు బాహ్య ప్రపంచానికి విశాఖతో సంబంధాలను తెంచేశాయి. నిత్యావసరాలు కాదు కదా కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక అల్లాడిపోతున్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు అప్పటి సీఎం చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు.

Chandrababu Effort in Hudhud Storm Situation : వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమహేంద్రవరం దగ్గరే రోడ్డుపైనే హెలికాప్టర్‌ దిగి దారి పొడవునా విరిగిపడిన చెట్లను తొలగించుకుంటూ, రోడ్డు మార్గాన్నే 13వ తేదీన విశాఖపట్నం చేరుకున్నారు. నేనున్నానంటూ ప్రజలకు తోడుగా నిలిచారు. బస్సులోనే బస చేశారు. రాత్రింబవళ్లు సహాయ చర్యలను పర్యవేక్షించారు. ప్రతి కాలనీకి వెళ్లిన చంద్రబాబు.. బాధితుల్ని పరామర్శించారు. నిత్యావసరాలు పంచారు. వేగంగా సమాచార వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

Biggest Cyclone In India : తిత్లీ, హుద్​హుద్​, అంపన్.. గత పదేళ్లలో భారత్​ను వణికించిన తుఫాన్​లివి..

రోజుకు 18 గంటలు ప్రజల్లో : చంద్రబాబు సీనియర్‌ అధికారులు, I.A.S., I.F.S. అధికారుల సారథ్యంలో సహాయ బృందాలను ఏర్పాటు చేశారు. స్థానిక సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కలిసి పనిచేయాలని నిర్దేశించారు. తాను కునుకు తీయలేదు. I.A.S.ల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరితో రోజుకు 18 గంటలు పని చేయించారు. అర్ధరాత్రిళ్లు కూడా తనిఖీలు చేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కూరగాయలు, నిత్యావసర సరకులు, విద్యుత్‌ స్తంభాలు, సహాయ చర్యలకు సిబ్బందిని పంపాలని కోరారు. నెలకైనా వెలుగులు వస్తాయో లేదో అనే అనుమానాల్ని చంద్రబాబు పటాపంచలు చేశారు. అయిదు రోజుల్లోనే మూడో వంతు ప్రాంతాల్లో విద్యుత్తును పునరుద్ధరించారు. ఆయన పిలుపుతో వివిధ ప్రాంతాల నుంచి సహాయ బృందాలు నిత్యావసరాలతో తరలి వచ్చి, లక్షల మందికి ఉచితంగా అందజేశాయి.

మొబైల్‌ టవర్లను అందుబాటులోకి తెచ్చారు : విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో విశాఖ నగరంలో ఒక్కో కొవ్వొత్తి 20 నుంచి 30 రూపాయలు అమ్మిన పరిస్థితి. దీంతో తూర్పుగోదావరి జిల్లా నుంచి నాలుగు లారీల కొవ్వొత్తులు తెప్పించి, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయించారు. నగరం, చుట్టుపక్కల మండలాల్లో సుమారు 30 వేల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యుత్తు కార్మికుల్ని రప్పించి, యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. నగరంలో మొత్తం 7 లక్షల 50 వేల విద్యుత్తు కనెక్షన్లు ఉంటే 18వ తేదీ సాయంత్రానికి 2 లక్షల 50 వేల కనెక్షన్లకు సరఫరా పునరుద్ధరించారు.

కేంద్రం, టెలికం సంస్థలతో పలుమార్లు సంప్రదించి, ఎక్కడికక్కడ మొబైల్‌ టవర్లను అందుబాటులోకి తెచ్చారు. తుపాను గాలుల ధాటికి విమానాశ్రయ టెర్మినల్‌ పైకప్పులు ఎగిరిపోయి ఎముకల గూడును తలపించింది. 15 మంది ప్రయాణికులు ఇరుక్కుపోయారు. రాడార్‌ యాంటీనా దెబ్బతిని, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. తాత్కాలిక మరమ్మతులు చేయించి, తర్వాత రోజు నుంచే విమాన ప్రయాణాల్ని పునరుద్ధరించారు.

నిధులు వచ్చేదెప్పుడు.. సమస్యలు తీరేదెప్పుడు..?

పచ్చదనంతో కళకళలాడిన నగరం : హుద్‌హుద్‌ పోర్టల్‌ను ప్రారంభించి సహాయచర్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు ఆహ్వానించారు. వేలమంది కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్ల వివరాలను పోర్టల్‌లో ఉంచారు. పేదలకు ఉచితంగా పాలు, నిత్యావసరాలు అందించారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి కూరగాయలు, ఉల్లిపాయలు తెప్పించి ప్రజలకు కిలో 3 రూపాయలకే కూరగాయలు, కిలో 5 రూపాయల చొప్పున ఉల్లి, ఒక్క రూపాయికే అరటికాయ అందజేశారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో.... బహుళ అంతస్తుల్లోకి తాగునీరు అందలేదు.

అగ్నిమాపక శకటాల సాయంతో ట్యాంకులకు నీళ్లు ఎక్కించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వందల అగ్నిమాపక వాహనాల్ని రప్పించి పని చేయించారు. పెట్రోలు, డీజిల్‌ బంకులకు జనరేటర్లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో విశాఖ ఉక్కు కర్మాగారంలోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు, S.M.S.లు, రోలింగ్‌ మిల్లుల్లో ఎక్కడికక్కడే ఇనుము ఆగిపోయింది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు, కోక్‌ ఓవెన్‌లు పూర్తిగా చల్లబడి, ప్లాంటుకు భారీ నష్టం వాటిల్లేది.

చంద్రబాబు వెంటనే స్పందించి 16వ తేదీ తెల్లవారుజాముకే కర్మాగారానికి విద్యుత్తు సరఫరా పునరుద్ధరింపజేశారు. విశాఖను మళ్లీ నిలబెడదామంటూ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. బీమా క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని సంస్థలను కోరారు. హుద్‌హుద్‌తో విశాఖ నగరంలో 80 శాతం వృక్ష సంపద ధ్వంసమైంది. కైలాసగిరి కొండ మోడువారింది. ఆంధ్రా యూనివర్సిటీ సహా నగరంలో దశాబ్దాల వయసున్న చెట్లన్నీ నేలకూలాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కొద్దికాలంలోనే కైలాసగిరి సహా నగరం పచ్చదనంతో కళకళలాడింది.

విలయం నుంచి వికాసం.. విజన్‌తో చంద్రబాబు ముద్ర : తుపాను తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల ముందు నుంచే ప్రజల్ని అప్రమత్తం చేసి, మరణాల శాతం బాగా తగ్గించగలిగింది. హుద్‌హుద్‌ సమయంలో సహాయ చర్యల అమలును కేంద్రం కూడా ప్రశంసించింది. తుపాను సమయంలో శాఖల వారీగా చేపట్టాల్సిన సహాయ చర్యలతో నివేదిక రూపొందించి, భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు అనుసరించాల్సిన విధానాలను నిర్దేశించింది. విలయం నుంచి వికాసం వైపు నడిపించడంలో తనదైన విజన్‌తో చంద్రబాబు ముద్ర వేశారు. హుద్‌హుద్‌ సమయంలో చంద్రబాబు పనితీరు.. దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. కొన్ని నెలల్లోనే విశాఖ పూర్వవైభవం సంతరించుకుంది.

'ఈనాడు' తోడు... సాకారమైన గూడు

Last Updated : Oct 14, 2023, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.