ETV Bharat / state

GULAB EFFECT: గులాబ్ తుపాన్ బీభత్సం...విశాఖ జిల్లా అతలాకుతలం

author img

By

Published : Sep 28, 2021, 4:51 PM IST

విశాఖ జిల్లాలో జోరు వానలు
విశాఖ జిల్లాలో జోరు వానలు

విశాఖ జిల్లాను గులాబ్ తుపాన్ కుదిపేసింది. జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లాలోని నదులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో చాలా చోట్ల పంటలు కోతకు గురయ్యాయి.

విశాఖలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం భారీ వర్షాల వల్ల ఆ ప్రాంత వాసులకు తీవ్ర ఎదురవుతున్నాయి. నగర శివార్లలోని
సుజాతనగర్, పాపరాజు పాలెంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాకపోవడంతో భారీగా చేరిన వర్షపు నీటితో రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారింది. ఇళ్లల్లో నిన్నటినుంచి వర్షపు నీటితో ఇక్కట్లు తప్పడం లేదు. జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు .

పాయకరావుపేటలో ...

పాయకరావుపేటలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల వెంట నీరు నిలిచిపోవటంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. నక్కపల్లి మండలంలో సుమారు 100 ఎకరాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. యస్. రాయవరం మండలం సోముదేవుపల్లి గ్రామం వద్ద వరాహనది ఉధృతికి రహదారి కోతకు గురైంది. గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

చోడవరంలో..

చోడవరంలోని పలు ఆలయాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా వర్షాలు కురవటంతో స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరుడి ఆలయం గర్బగుడిలోకి వర్షపు నీరు చేరింది. ఆలయ అర్చకులు ఎప్పటికప్పుడు నీటిని తోడుతూ విగ్రహం.. భక్తులకు కనపడేలా చేస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో...భారీ వర్షాలు

గులాబ్ తుఫాను శాంతించినప్పటికీ విశాఖ ఏజెన్సీలో మత్స్యగడ్డ పొంగి ప్రవహిస్తోంది. పాడేరు, పెదబయలు, ముంచింగిపుట్టు నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉరకలు వేస్తుంది. మార్గంలో ఉన్నటువంటి రహదారులు రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు మండలం రాయగడ, గుత్తులపుట్టుల వద్ద వరద నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. ఏళ్ల తరబడి రహదారులు కావాలని మొరపెట్టుకున్నా వంతెన నిర్మించలేదు.

ఎలమంచిలిలో శారదా వంతెన ప్రవాహం...

ఎలమంచిలి మండలం నారాయణపురం సమీపంలో శారదానది వంతెనపై నుంచి నీరు పొంగి ప్రవహించడంతో ఎలమంచిలి-గాజువాక బైపాస్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురవడంతో శారదానది పొంగి ప్రవహిస్తోంది.

మాడుగులలో పెద్దేరు జలాశయం...

మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి వరదనీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి వరదనీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం 3,602 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం పూర్తి నీటిమట్టం 137 మీటర్లు కాగా, 136.45 మీటర్లకు చేరింది. దీంతో రెండు రోజులుగా పెద్దేరు జలాశయం నుంచి గేట్లు ఎత్తి.. వరదనీటి విడుదల చేస్తున్నారు.

అనకాపల్లి-చోడవరం రావికమతం తదితర మండలాల్లో పంట పొలాల్లో మోకాలు లోతు నీళ్లు చేరాయి. కొన్నిచోట్ల పంటపొలాలా నదీ పరివాహక ప్రాంతాలా అనే అనుమానం వచ్చే రీతిలో పొలాలు దర్శనమిస్తున్నాయి.

మండలంలోని మామిడిపాలెం వద్ద ఉరకగెడ్డ వరదనీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఐదు గిరిజన గ్రామాల ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు. రెండు రోజులగా.. గిరిజన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవతల వైపు ఉన్న కొందరు గెడ్డ అవతల వున్న వారికి ఆహార పొట్లాలు, కూరగాయలను అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

న్యాయం చేయాలంటూ మహిళ నిరసన..తహసీల్దారు కార్యాలయానికి తాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.