ETV Bharat / state

విశాఖ, చుట్టుపక్కలున్న ప్రభుత్వ భూముల తనఖా... మాటలకు చేతలకు పొంతనేది?

author img

By

Published : Nov 2, 2022, 7:17 AM IST

Government lands Mortgage: ఉత్తరాంధ్రపై వైకాపా సర్కార్‌ ప్రేమ... మాటల్లో ఒకలా, చేతల్లో మరోలా ఉంటోంది. 15 వేల కోట్లతో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దుతామంటూ ఓవైపు బీరాలుపోతూ, మరోవైపు 23 వేల కోట్లకు విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టేసింది. మొత్తం 128 ఎకరాలను బ్యాంకులకు తనఖా పెట్టింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదంటూ సవాళ్లు విసిరే నాయకులు... విశాఖను మార్టిగేజ్ చేస్తుంటే ఎందుకు నోరుమెదపడం లేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.?

Visakha lands
విశాఖ చుట్టుపక్కలున్న ప్రభుత్వ భూముల తనఖా

Government lands Mortgage: వెనకబడిన ఉత్తరాంధ్రకు ఆయువుపట్టు విశాఖ. వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ఈ ఉక్కునగరంలో పెద్దఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని విస్తృత ప్రజాప్రయోజనాల కోసం వినియోగిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ.. వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి 25 వేల కోట్ల అప్పు తెచ్చుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములు, భవనాలు, ఖాళీ స్థలాలను తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం విశాఖలోని 128 ఎకరాలకు పైగా విలువైన భూములను తొలుత కార్పొరేషన్‌కు బదలాయించారు. ఆనక ఆ భూములను బ్యాంకుల వద్ద తనఖా పెట్టేసింది. మార్టిగేజ్‌ ఒప్పందాన్ని ఏకంగా రిజిస్ట్రేషన్‌ కూడా చేసింది. అలా తెచ్చిన రూ.23 వేల కోట్ల నిధులను ఉత్తరాంధ్ర అభివృద్ధికో, ఇక్కడ వెనుకబడ్డ జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులకో, ఇతరత్రా ఆస్తులు సృష్టించేందుకో తనఖా పెట్టలేదు. ఏపీఎస్‌డీసీ కార్యకలాపాలకు ఈ భూములు అప్పగించేసింది.

అప్పులు తెచ్చి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా ఏపీఎస్‌డీసీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌ అప్పు తీసుకునేందుకు గ్యారంటీలు కూడా ఇచ్చింది. దీంతో ఏపీఎస్‌డీసీకి రుణాలిచ్చేందుకు 5 బ్యాంకులు ముందుకొచ్చాయి. వాటన్నింటికీ ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీగా వ్యవహరిస్తోంది. అయితే ఏపీఎస్‌డీసీ అడుగుతున్న రూ.25 వేల కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ సరిపోదని, రుణం తీసుకునే మొత్తంలో పది శాతం విలువైన ఆస్తులు తనఖా పెట్టాలని బ్యాంకులు షరతు పెట్టాయి. దీంతో విశాఖ నగరంలో 2 వేల 954 కోట్ల మార్కెట్‌ విలువ ఉన్న 13 ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం ఏపీఎస్‌డీసీకి బదలాయించింది. తర్వాత వాటిని తనఖా పెట్టి రుణం తీసుకుంది.

విశాఖ భూములను తనఖా పెట్టి ఎస్‌బీఐ వద్ద 6వేల కోట్లు యూనియన్‌ బ్యాంకు నుంచి 5వేల కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి 5వేల కోట్లు ,బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి 3వేల 500కోట్లు , ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి 2వేల500 కోట్లు, ఇండియన్‌ ఓవరీస్‌ బ్యాంకు నుంచి 1,250 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి వెయ్యికోట్లు,పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌ నుంచి 750 కోట్లు చొప్పున మొత్తం 25 వేల కోట్లు మంజూరు కాగా... కేంద్రం అభ్యంతరం చెప్పడంతో ఎస్బీఐ పూర్తిమొత్తం ఇవ్వలేదు.

బ్యాంకులకు గ్యారంటీగా విశాఖలోని విలువైన భూములను ప్రభుత్వం తాకట్టుపెట్టింది. వాటిల్లో 2.9ఎకరాల్లో విస్తరించి ఉన్న విశాఖలోని.... ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌, సీతమ్మధారలో ఎకరం విస్తీరణంలో ఉన్న తహశీల్దార్‌ కార్యాలయం... మూడెకరాల్లో ఉన్న రహదారులు భవనాలశాఖ క్వార్టర్లు 23.58 ఎకరాల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, 17.33 ఎకరాల ప్రభుత్వ ఐఐటీ కళాశాల ఉన్నాయి. వీటితో పాటు రైతులు, పేదలకు ఎంతో ఉపయోగకరమైన 3.80 ఎకరాల్లోని రైతుబజారు 30 ఎకరాల డెయిరీఫాం, 5.78 ఎకరాల సెరికల్చర్‌ స్థలాన్ని కార్పొరేషన్‌కు బదలాయించింది. 19.39 ఎకరాల్లో టీసీపీసీ స్థలం, 8.58 ఎకరాల్లోని పోలీసుశాఖ క్వార్టర్లు, 4.25 ఎకరాల్లోని జలవనరులశాఖ ఈఈ ఆఫీస్‌ మూడున్నర ఎకరాల్లోని పీడబ్ల్యూడీ కార్యాలయం, 5.55 ఎకరాల్లోని సీఈ కార్యాలయం మొత్తం కలిపి 128.63 ఎకరాల ప్రభుత్వ భూములు బ్యాంకులకు తాకట్టు పెట్టి ప్రభుత్వం రుణాలు తీసుకుంది.

మద్యం ఆదాయం మళ్లించి భవిష్యత్‌లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ముందే తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం తప్పని ఆర్​బీఐ, కేంద్రం తేల్చి చెప్పాయి. దీంతో ఎస్‌బీఐ తాను ఇస్తానన్న 6 వేల కోట్ల రుణం పూర్తిగా ఇవ్వలేదు. తప్పుడు పద్ధతిలో రుణాలు తీసుకునేందుకు విలువైన ఉత్తరాంధ్ర భూములను ప్రభుత్వం తనఖా పెట్టేసింది. దీనిపై ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్‌ నేతలు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ ఒక్కరూ నోరెత్తకపోవడం గమనార్హం.

విశాఖ చుట్టుపక్కలున్న ప్రభుత్వ భూముల తనఖా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.