ETV Bharat / state

ముగిసిన తొలి విడత ప్రచారం... ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: విశాఖ డీఐజీ

author img

By

Published : Feb 7, 2021, 9:53 PM IST

మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 9న జరగనున్న పంచాయితీ ఎన్నికల ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పతిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు. విశాఖ జిల్లాలో చివరిరోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది.

Security set up for panchayati elections
ముగిసిన తొలివిడత ప్రచారం

విశాఖ రేంజ్ పరిధిలో ఈ నెల 9న జరగనున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం రేంజ్ పరిధిలో 582 పంచాయతీలకు ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఐజీ కోరారు.

'ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 144 అతి సమస్యాత్మక ప్రాంతాలుగా, 206 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాం. సుమారుగా 4,500 మంది పోలీసులతో ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు' అని డీఐజీ రంగారావు హెచ్చరించారు.

ముగిసిన చివరి రోజు ప్రచారం...

పార్టీలకు అతీతంగా సర్పంచులను ఎన్నుకోవాలని ప్రజలకు విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం మండలంలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వైకాపా మద్దతుదారు అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి డివిజన్​లో..

అనకాపల్లి రెవెన్యూ డివిజన్​లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. మారేడు పూడి, మాకవరం, బవులవాడ గ్రామాల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విస్తృతంగా ప్రచారం చేశారు.

మాడుగుల నియోజకవర్గంలో..

మాడుగుల నియోజకవర్గంలో చివరిరోజు ప్రచారం జోరుగా సాగింది. నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలా పరిధిలోని సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఈనెల 9న పోలీంగ్ జరుగనుంది.

పోలీంగ్​కు సర్వం సిద్ధం..

మాడుగుల నియోజకవర్గంలో తొలివిడత పంచాయతీ పోలీంగ్​కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండల పరిధిలో 111 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 95 పంచాయతీల్లో ఈనెల 9న పోలింగ్ జరుగనుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రత్యేక అధికారి అనిత పేర్కొన్నారు.

తెదేపాలో చేరికలు..

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలో కొందరు పార్టీలు మారుతున్నారు. గొలుగొండ మండలంలో బహుజన సమాజ్ పార్టీకి చెందిన పలువురు నేతలు తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో తెదేపాతో చేరారు. తెదేపా సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని పార్టీలో చేరామని మాజీ జడ్పీటీసీ సభ్యుడు చెట్ల చలపతి, దళిత నాయకులు నాయకులు, నేతల నాగేశ్వరరావు, తదితరులు తెలిపారు.

ఇదీ చూదవండి:

ఎన్నికల సంఘం బాధ్యతతో వ్యవహరించాలి: బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.