Cargo Services at Airports Have Stopped: దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో కార్గో సేవలు నిలిచిపోయాయి. అనుమతులు పునరుద్ధరించుకోవాలని బీసీఏఎస్ ఆదేశించినప్పటికీ..గడువులోగా అనుమతులు తెచ్చుకోకపోడంతో సరుకు రవాణా సేవలు స్తంభించాయి. సరకు రవాణా సేవలను పర్యవేక్షించే భారత విమానయాన సంస్థకు చెందిన కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ నిర్లక్ష్యం వల్లే.. గడువులోగా అనుమతులు తెచ్చుకోలేకపోయామని.. కార్గో ఆపరేటర్లు పేర్కొంటున్నారు. విమానాశ్రయాల్లో సరకు రవాణా సేవలు అందించే సంస్థలు ఇప్పటివరకూ కామన్ యూజర్ డొమెస్టిక్ కార్గో టెర్మినల్ ఆపరేటర్లుగా ఉండేవి.
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో తాజాగా సీయుడీసీటీ ఆపరేటర్ల అనుమతులు రద్దు చేశారు. సరకు రవాణాలో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగు పరుస్తూ రెగ్యులేటరీ ఏజెన్సీ వ్యవస్థను బీసీఏఎస్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ సీయుడీసీటీ గా సేవలు అందిస్తున్న కార్గో నిర్వహణ సంస్థలు.. రెగ్యులేటరీ ఏజెన్సీ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని బీసీఏఎస్ సూచించింది. దీనికోసం ఏఏఐ క్లాస్‌తో మళ్లీ కొత్తగా ఒప్పందం సవరించుకుని.. ఆ పత్రాలను తీసుకురావాలంటూ బీసీఏఎస్ ఆరు నెలల కిందట ఆదేశించింది.
కొత్త ఒప్పంద పత్రాల కోసం గత ఆరు నెలలుగా ఏఏఐ క్లాస్‌ను కార్గో ఆపరేటర్లు సంప్రదిస్తున్నారు. కానీ..ఏఏఐ క్లాస్ సిబ్బంది తీవ్ర జాప్యం చేసి పది రోజుల కిందటే కొత్తగా సవరించిన పత్రాలను ఇచ్చారు. వాటితో రెగ్యులేటరీ ఏజెన్సీ కోసం విమానాశ్రయాల్లోని కార్గో నిర్వాహకులు ఇప్పటికే బీసీఏఎస్ కు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ.. అనుమతులు వచ్చేందుకు కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుంది. ఆరు నెలలు సమయం ఇచ్చినా.. రెగ్యులేటరీ ఏజెన్సీగా మారకపోవడంతో దేశంలోని 20 విమానాశ్రయాల్లో ఆదివారం నుంచి కార్గో సేవల అనుమతులు నిలిపేస్తున్నట్టు బీసీఏఎస్ ప్రకటించింది.
ఏఏఐ క్లాస్ సంస్థ చేసిన తీవ్ర జాప్యం వల్లే ఆలస్యం అయిందని, ఇప్పటికే తాము అన్ని ఒప్పంద పత్రాలతో దరఖాస్తులు చేసుకోవడం వల్ల తాత్కాలికంగా అనుమతులు ఇవ్వాలంటూ కార్గో ఆపరేటర్లు బీసీఏఎస్ కు విజ్ఞప్తి చేశారు. బీసీఏఎస్ తాత్కాలికంగానైనా వెంటనే అనుమతి ఇస్తే సరకు రవాణా సేవలు తిరిగి ఆరంభమవుతాయి. లేదంటే రెగ్యులేటరీ ఏజెన్సీ అనుమతి వచ్చేందుకు కనీసం మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ రాష్ట్రంలోని మూడు విమానాశ్రయాల్లోనూ సరకు రవాణా సేవలు ఆగిపోయినట్టే...
ఎయిర్ కార్గో సేవలు ఆగిపోవడం వల్ల అనేక రంగాలు ఇబ్బంది పడుతున్నాయి. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ విమానాశ్రయాల్లో ఇప్పటికే సరకు రవాణా సేవలు అంతంతమాత్రంగా ఉన్నాయి. పూర్తిస్థాయి సరకు రవాణా విమాన సర్వీసులు నడపడం లేదు. ప్రయాణికుల విమానాల్లోనే కార్గో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వాటిని కూడా ఆపేయడంతో అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. విశాఖలోని పలు ఆసుపత్రులకు నిత్యం వచ్చే అత్యవసర మందులు ఆగిపోయాయి. మెట్రో నగరాల నుంచి రోడ్డు మార్గంలో తీసుకురావాలంటే రెండు మూడు రోజుల సమయం పడుతుంది. ఈ విషయంపై విమానాశ్రయాల అధికారులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టిసారించి వెంటనే సేవలు ఆరంభమయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ఇవీ చదవండి: