ETV Bharat / state

visakha steel: వెనక్కి తగ్గం... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టీకరణ

author img

By

Published : Mar 23, 2022, 9:25 PM IST

Updated : Mar 24, 2022, 5:25 AM IST

నష్టాలు కారణంగా చూపి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దని.. తెదేపా, వైకాపా ఎంపీలు కేంద్రాన్నికోరారు. సొంత గనులు కేటాయిస్తే లాభాలు వస్తాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటీకరణే ఉత్తమమన్న కేంద్ర ఉక్కుమంత్రి.. సొంత గనులకు, లాభాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

విశాఖ ఉక్కుపై గళమెత్తిన ఎంపీలు
విశాఖ ఉక్కుపై గళమెత్తిన ఎంపీలు

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరించాలన్న నిర్ణయం సరైందేనని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఆ ప్లాంటు మేలు కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో పునరాలోచనే లేదని, ప్రభుత్వం దానికే కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. బుధవారం రోజు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎంపీలు కె.రామ్మోహన్‌ నాయుడు, కేశినేని నాని, వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ స్థాయిలో పార్లమెంటులో దీనిపై చర్చ జరగడం ఇదే తొలిసారి. రామ్మోహన్‌ నాయుడి ప్రశ్నకు తొలుత మంత్రి రామచంద్రప్రసాద్‌ సింగ్‌ బదులిస్తూ.. ‘ఆర్‌ఐఎన్‌ఎల్‌, దాని అనుబంధ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ వాటాలను 100% ఉపసంహరించడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ 2021 జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. గత పదేళ్లుగా ప్లాంటు లాభాలను పెంచుకోలేకపోతోంది. దాని సంచిత నష్టాలు రూ.7,122.25 కోట్లకు చేరాయి’ అని బదులిచ్చారు.

‘విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. 16,500 మంది ఈ ప్లాంటు కోసం 20వేల ఎకరాల భూమిని దానం చేశారు. వారిలో 8,200 మందికే ఉద్యోగాలు దక్కాయి. ఇంకా 8,300 మందికి రాలేదు. వారి ఉద్యోగాలకు కేంద్రం ఎలా భరోసా ఇస్తుంది? అని మంత్రిని రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ.. ‘5వేల మందికి ఉద్యోగాలివ్వాలని అప్పట్లో ఒప్పందం కుదిరింది. కానీ 8వేల మందికిపైగా ఉద్యోగాలిచ్చినట్లు ఎంపీయే చెబుతున్నారు. ఇప్పటికే నిర్వాసితులకు పరిహారం, ఇళ్లు ఇచ్చాం. ప్రతి కుటుంబానికీ రూ.17,500 ఇచ్చాం. ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం. ప్లాంటును ఆధునికీకరించి సామర్థ్యం ఎలా పెంచాలని ఆలోచించి.. ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నాం. 1999 నుంచి 2003-04 మధ్య ప్రైవేటీకరించిన సంస్థలన్నీ మంచి ప్రగతి సాధించాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై పునరాలోచించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

కేప్టివ్‌ మైన్స్‌ను ఎందుకు కేటాయించలేదు: మంత్రి సమాధానాన్ని రామ్మోహన్‌ నాయుడు వ్యతిరేకించారు. ‘మంత్రి సమాధానంతో మేం ఏకీభవించం. ప్రైవేటీకరణపై కచ్చితంగా పునరాలోచించాల్సిందే. ప్లాంటు సామర్థ్యం పెంచాలనుకుంటే ఇంతవరకూ కేప్టివ్‌ మైన్స్‌ను ఎందుకు కేటాయించలేదు? అవి ఇవ్వాలని పార్లమెంటు స్థాయీ సంఘం చెప్పింది కదా’ అని ప్రశ్నించారు. మంత్రి బదులిస్తూ.. ‘ఆర్‌ఐఎన్‌ఎల్‌ 1992 నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. తొలి 12 ఏళ్లు కేప్టివ్‌ మైన్స్‌ లేకపోయినా లాభాల్లో నడిచింది. అందువల్ల కేప్టివ్‌ మైన్స్‌ లేకపోవడంవల్లే నష్టాలు వచ్చాయన్నది సరికాదు. విస్తరణవల్ల రుణభారం రూ.22వేల కోట్లకు చేరింది. గత పదేళ్లలో రూ.7వేల కోట్లకు పైగా నష్టాలను మూటగట్టుకుంది. నెట్‌వర్త్‌ తగ్గిపోయింది. అందుకే పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి అయింది’ అని పేర్కొన్నారు.

అంత వడ్డీ భారం మోయడం ఎవరికి సాధ్యం: రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ.. తాము మంత్రి సమాధానాన్ని అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. ‘రూ.7వేల కోట్ల నష్టానికి కారణం కేప్టివ్‌ మైన్స్‌ కేటాయించకపోవడమే. అదే సమయంలో దానికున్న రూ.20వేల కోట్లకుపైగా రుణాలపై 14% వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. ఏ సంస్థ అయినా ఇంత వడ్డీ భారం ఎలా మోస్తుంది? ప్రైవేటీకరణపై పునరాలోచించాలని సీఎం కేంద్రానికి లేఖ రాశారు. ‘విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఉద్యమించి 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన ఈ స్టీల్‌ ప్లాంటుకు ప్రజలు వేల ఎకరాలను ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడాలి. మంత్రి, ప్రధాన మంత్రి దీనిపై పునరాలోచించాలి’ అని కోరారు. మంత్రి మాట్లాడుతూ.. ఉత్పాదకత, ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడమే నష్టాలకు కారణమని, ఈ సంస్థ నెట్‌వర్త్‌ రూ.3వేల కోట్లకు పడిపోవడంవల్ల ప్రైవేటీకరణ అత్యవసరమని చెప్పారు.

కేశినేని నాని మాట్లాడుతూ.. ‘సెయిల్‌కు లేని ప్రైవేటీకరణ విశాఖ ఉక్కుకు ఎందుకు? ఈ ప్లాంటు సాధన ఉద్యమంలో 32 మంది చనిపోయారు. లాభాల్లోకి తెచ్చే అవకాశం ఉన్న ప్లాంటును ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. మంత్రి బదులిస్తూ.. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో ఉన్న ఎన్‌ఐఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత ఇప్పుడు దాని రిజర్వ్‌ప్రైస్‌ రెట్టిపైందని తెలిపారు. ఉపసంహరణ తర్వాత యాజమాన్యం మారినా ప్లాంటు అలాగే ఉంటుందని, మరింత మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కుపై గళమెత్తిన ఎంపీలు

ఇదీ చదవండి: Nara Lokesh : సీఎం జగన్​కు నారా లోకేశ్ సవాల్.. ఏమన్నారంటే?

Last Updated :Mar 24, 2022, 5:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.