ETV Bharat / state

ఏపీకి మెట్రో అందని ద్రాక్షగానే మిగిలిపోనుందా..?

author img

By

Published : Dec 28, 2022, 7:54 AM IST

Updated : Dec 28, 2022, 1:58 PM IST

కొన్ని రాష్ట్రాల్లో 3, 4 నగరాల్లో మెట్రో రైళ్లు ఉండగా... మరికొన్ని చోట్ల ఆయా ప్రభుత్వాలు విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు 2019-20 నుంచి దేశవ్యాప్తంగా, కేంద్రం 75,111 కోట్ల నిధులు మంజూరు చేసింది. విభజన చట్టంలో ఉండి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉన్నా సరే.. సీఎం జగన్‌ మాత్రం ప్రతిపాదనలు పంపడంలేదు. ఒక్క రూపాయీ తేలేదు. ఇలా చివరకు ఏపీని ఒడిశా, ఝార్ఖండ్‌ వంటి వెనుకబడిన రాష్ట్రాల సరసన నిలిపిన ఘనతను జగన్‌ ప్రభుత్వం దక్కించుకుంది.

metro rail project
ఏపీకి మెట్రో

Metro Rail Works in AP: ఆంధ్రప్రదేశ్, ఒడిశా తప్ప.. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటిలో మెట్రో రైళ్లు ఉన్నాయి. మన విశాఖ, విజయవాడలతో దాదాపు సమాన జనాభా ఉన్న.. పుణె, నాగ్‌పుర్, ఇందౌర్, భోపాల్, కోచి, కాన్పుర్‌ వంటి నగరాలకు ఇప్పటికే మెట్రో అందుబాటులోకి వచ్చింది. శ్రీనగర్, జమ్ము, గోరఖ్‌పుర్‌ వంటి తృతీయశ్రేణి, అంతకంటే తక్కువ స్థాయి నగరాలూ మెట్రో ఏర్పాటుకు నడుంకట్టాయి. కొన్ని రాష్ట్రాల్లో మూడు నాలుగు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులున్నాయి. వాటి విస్తరణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్ని సొంత నిధులతో, మరికొన్నింటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్నాయి.

ఏపీకి మెట్రో అందని ద్రాక్షగానే మిగిలిపోనుందా

విభజన చట్టం: 2017 మెట్రో విధానం ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు వ్యయాన్ని 50:50 నిష్పత్తిలో భరించేలా కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం కోసం వచ్చిన, కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోని ప్రాజెక్టులు 18 ఉన్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నీ మెట్రో కోసం ఇంతగా తపిస్తుంటే.. రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వానికి మాత్రం స్పందనే లేదు. విజయవాడ, విశాఖల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టులు చేపట్టాలని విభజన చట్టంలోనే ఉన్నా కేంద్రాన్ని ఏనాడూ గట్టిగా అడగలేదు. ఒక్క రూపాయి తెచ్చుకోనూ లేదు.


కేంద్రానికి ప్రతిపాదనే పంపకపోవడం: వైసీపీ ప్రభుత్వానికి మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రాధాన్యం, ఆవశ్యకతపై కనీస అవగాహన, ఆలోచన ఏ కోశానా లేవు. మెట్రో రైల్‌ వంటి భారీ ప్రాజెక్టుల్ని చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపన, దూరదృష్టి అంతకన్నా లేవు. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టులపై కేంద్రానికి ప్రతిపాదనే పంపకపోవడం ఇందుకు నిదర్శనం. కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే, వాళ్లు ప్రాజెక్టును మంజూరు చేస్తే... రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు ఎక్కడ కట్టాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్‌ ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా.. ప్రజలు ఏమనుకున్నా.. ప్రభుత్వం మాత్రం చలించడం లేదు. మెట్రో రైళ్ల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులతో రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతుంటే... ఏపీని వెనుకబడిన రాష్ట్రాలైన ఒడిశా, ఝార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల సరసన నిలిపిన ఘనత నిస్సందేహంగా జగన్‌ ప్రభుత్వానిదే.


హైదరాబాద్‌లో ప్రస్తుతం 72 కిలోమీటర్ల మెట్రో కారిడార్​: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002-03లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనకు బీజం పడింది. వివిధ కారణాలతో ప్రాజెక్టులో జాప్యం జరిగింది. పీపీపీ విధానంలో చేపట్టిన మెట్రో రైల్‌ ప్రాజెక్టు 2017 నవంబరు 29న అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడది హైదరాబాద్‌కు మణిహారంలా భాసిల్లుతోంది. రెండు దశాబ్దాల క్రితమే.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్‌ వచ్చింది. ఇప్పుడు మెట్రో కూడా రావడంతో ప్రజలకు చాలా వెసులుబాటు లభిస్తోంది. ఉదాహరణకు నగరానికి ఆ చివర ఉన్న మియాపూర్‌ నుంచి ఈ శివార్లలో ఉన్న ఎల్బీనగర్‌కు 29 కిలోమీటర్ల దూరం. బస్సులో వెళ్లాలంటే సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అదే మెట్రోలో 45 నిమిషాల్లోనే చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 72 కిలోమీటర్ల పొడవైన మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం: మరో రెండు కారిడార్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ‘రాయదుర్గం స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్‌ను 6,105 కోట్ల నిధులతో, పూర్తిగా సొంత ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 8,453 కోట్లతో బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకపూల్‌ 26 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5 కిలోమీటర్ల మేర.... మరో కారిడార్‌ను అభివృద్ధి చేయనుంది. 2017 మెట్రో విధానం ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం ఆర్థిక సాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని ఈ నెల 15న లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు పొడవునా మెట్రో కారిడార్‌ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

వివిధ రాష్ట్రాల్లో నిర్మాణ దశలో: మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో మూడు, నాలుగు నగరాల్లో మెట్రో రైళ్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోనో, నిర్మాణ దశలోనో, కొత్త ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనో ఉన్నాయి. దిల్లీలో ఇప్పటికే మూడు దశల మెట్రో రైళ్ల నిర్మాణం పూర్తైంది. దిల్లీ నుంచి మేరఠ్‌కు ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్‌ ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ, కాన్పుర్, ఆగ్రా, నోయిడాల్లో మెట్రో రైళ్లున్నాయి. గోరఖ్‌పుర్, నోయిడా- గ్రేటర్‌ నోయిడా విస్తరణ ప్రాజెక్టులు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. గుజరాత్‌లో అహ్మదాబాద్, సూరత్‌లోనూ మెట్రోరైళ్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్, ఇందౌర్‌లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.మహారాష్ట్రలో ముంబయితో పాటు పుణె, నాగ్‌పుర్‌ల్లో ఇప్పటికే మెట్రో రైళ్లు ఉన్నాయి. నాసిక్, నాగ్‌పుర్‌ మెట్రో ఫేజ్‌-2, పుణె మెట్రో ఫేజ్‌1ఎ, ఠానె ఇంటిగ్రల్‌ రింగ్‌ మెట్రో, స్వర్‌గేట్‌ నుంచి కాట్రా వరకు పుణె మెట్రో రైల్‌ ప్రాజెక్టు విస్తరణ ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి.


అన్ని రాష్ట్రాలు మెట్రోరైళ్ల కోసం ఇంత ప్రయత్నిస్తుంటే వైకాపా ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. పైగా పరిపాలన రాజధానిగా విశాఖను ఉద్ధరించేస్తామని ప్రగల్భాలు పలుకుతోంది.

ఇవీ చదవండి:

Last Updated :Dec 28, 2022, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.