ETV Bharat / state

విశాఖ నుంచి తరలిపోయిన 2 విస్టాడోమ్ కోచ్‌లు

author img

By

Published : Jul 25, 2021, 5:39 PM IST

విశాఖకు దక్కాల్సిన కోచ్‌లు.. ఇతర ప్రాంతాలకు తరలిపోతుంటే చూస్తుండటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వాల్తేర్ రైల్వే డివిజన్ ఉంది. విశాఖ-అరకు మధ్య రావాల్సిన రెండు విస్టాడోమ్ కోచ్‌లను ముంబయికి తరలించడానికి తూర్పుకోస్తా రైల్వే దగ్గరుండి సహకరించింది. అయితే.. విశాఖకు దక్కాల్సిన కోచ్‌ల తరలింపుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

విస్టాడోమ్ కోచ్‌లు
విస్టాడోమ్ కోచ్‌లు

విశాఖ నుంచి తరలిపోయిన 2 విస్టాడోమ్ కోచ్‌లు

ముంబయి-పుణె మధ్య విస్టాడోమ్ కోచ్‌లతో గత నెల ఓ సర్వీసు ప్రారంభించారు. 204708 నెంబర్‌తో రిజిష్టర్ అయిన ఓ అద్దాల కోచ్‌ను విశాఖ నుంచి ముంబయికి తరలించారు. వారం క్రితం వచ్చిన 204709 నెంబర్‌ విస్టాడోమ్ కోచ్‌ను విశాఖకు కేటాయించినట్టు రికార్డుల్లో ఉన్నా.. దీన్నీ ముంబయికి తరలించాలని ఆదేశాలు వచ్చాయి. వెంటనే వాల్తేర్ అధికారులు తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ముంబయి-పుణె మధ్య నడుస్తున్న విస్టాడోమ్ కోచ్‌పై.. తూర్పుకోస్తా రైల్వేకి చెందినదిగా రాసి ఉంటుంది.

2016 నుంచే ప్రతిపాదన..

విశాఖ-అరకు మధ్య 5 విస్టాడోమ్ కోచ్‌లతో పర్యాటక రైలు నడపాలన్న ప్రతిపాదన 2016 నుంచే ఉంది. అప్పటినుంచి తయారైన కోచ్‌ల్లో విశాఖకు కేవలం ఒకటే కేటాయించి.. మిగతావాటిని ఇతర రాష్ట్రాలకు పంచుతూనే ఉన్నారు. 2019 సెప్టెంబర్‌లో విశాఖ వచ్చిన అప్పటి రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగాడీ.. త్వరలోనే కోచ్‌లు వస్తున్నాయని ప్రకటించినా ఇప్పటిదాకా అది జరగలేదు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఈ ఏప్రిల్‌కే అదనపు కోచ్‌లు వస్తాయన్న అధికారిక సమాచారం అప్పట్లో వాల్తేరు అధికారులకు వచ్చింది. వివిధ పరిణామాల కారణంగా.. తాజాగా రెండు కోచ్‌లను ముంబయికి తరలించాల్సి వచ్చింది. ఈ ఘటనపై భువనేశ్వర్‌లోని తూర్పుకోస్తా అధికారులను ప్రశ్నించగా.. తమకు కోచ్‌లు కేటాయించినట్టు ఎక్కడా సమాచారం లేదని కొట్టిపారేశారు.

విశాఖ-అరకు మార్గంలో ప్రస్తుతం తిప్పుతున్న ఒక్క కోచ్‌ 100 శాతం ఆక్సుపెన్సీతో నడుస్తోంది. అదనపు కోచ్‌లు వస్తే మంచి డిమాండ్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదనంగా ప్రతిపాదించిన 4 కోచ్‌ల్లో ఇప్పటికే రెండింటిని తరలించగా.. మరో రెండు త్వరలోనే విశాఖకు వస్తాయని సమాచారం.

ఇదీ చదవండి:

వర్షంలో తడుస్తూ.. టీకా కోసం ఎదురుచూస్తూ..

రెండు ఎలుకలను 'రెండు' తలలతో ఒకేసారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.