శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు.. తితిదే విస్తృత ఏర్పాట్లు

author img

By

Published : Nov 20, 2022, 10:54 AM IST

Updated : Nov 20, 2022, 12:31 PM IST

Sri Padmavati Ammavaru

Brahmotsavams of Sri Padmavati Ammavaru: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరులో తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో అమ్మవారు వివిధ వాహనాలపై నాలుగు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కరోనాతో ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన తితిదే.. ఈ ఏడాది భక్తుల మధ్య నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. కార్తీక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు ధన, ధాన్య, ధైర్య, సంతాన లక్ష్మి రూపంలో భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. ఇవాళ (ఆదివారం) ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం చిన్నశేష వాహన సేవతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

Brahmotsavams of Sri Padmavati Ammavaru: ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల తరహాలోనే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు... తొమ్మిదో రోజున నిర్వహించే పంచమతీర్థంతో ముగుస్తాయి. రోజూ ఉదయం, సాయంత్రం రెండు వాహన సేవలు నిర్వహిస్తారు. గజవాహనం, గరుడ వాహనం, రథోత్సవంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తారు.

బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే పంచమతీర్థం కార్యక్రమానికి తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. పంచమతీర్థానికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఉన్న ప్రాధాన్యత అమ్మవారి ఉత్సవాల్లో పంచమతీర్థానికి ఉంది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నేపథ్యంలో తొలిరోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిగింది.

బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచోసుకోకుండా తితిదే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల వేళ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరానుండటంతో అమ్మవారి దర్శనం, ప్రసాదాలు, అన్నదానం సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తితిదే చర్యలు తీసుకుందని ఆలయ అర్చకులు తెలిపారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలనూ తితిదే వైభవంగా నిర్వహించనుంది. వాహన సేవల్లో వివిధ రకాల అలంకరణలో అలమేలుమంగ భక్తులకు సాక్ష్యాత్కరించనున్నారు. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోర్కెలు తీరడంతో పాటు జన్మధన్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

ఇవీ చదవండి:

Last Updated :Nov 20, 2022, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.