ETV Bharat / state

'ఇదేం పాపం.. ఇంజెక్షన్ ఇచ్చి వ్యభిచార కూపంలోకి దింపుతారా..?'

author img

By

Published : Dec 8, 2022, 2:49 PM IST

Updated : Dec 8, 2022, 3:04 PM IST

Prostitution gangs in yadadri: ‘బరువు పెరగడానికి బాయిలర్‌ కోళ్లకు ఇంజెక్షన్లు ఇచ్చినట్లుగా.. బాలికల శరీరాలు పెరిగేలా వారికి హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి వారిని వ్యభిచార కూపంలోకి దించుతారా?.. ఎంత అవమానకరమైన, అమానుషమైన చర్య ఇది. పవిత్ర స్థలంలో ఇంత జరుగుతుంటే అధికార, పోలీసు యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి?’ 2018 జులై 30న యాదాద్రి పుణ్యక్షేత్రంలో పసిపిల్లలను వ్యభిచార రొంపిలోకి నెట్టేందుకు సంబంధిత ముఠాలు వారికి ఇంజెక్షన్లు ఇస్తున్నాయని వెలుగులోకి రావడంతో దీనిపై దాఖలైన వ్యాజ్యంపై అప్పట్లో ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) చేసిన వ్యాఖ్యలివి.

Prostitution gangs in yadadri
Prostitution gangs in yadadri

Prostitution gangs in yadadri : తెలంగాణలోని యాదాద్రిలో గత కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న వ్యభిచార ముఠాలు.. ఇటీవల మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించాయి. రాచకొండ పోలీసులు ఈ పాపపు కూపం నుంచి ఇద్దరు బాలికలకు విముక్తి కలిగించడంతో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. యాదాద్రిని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. దీంతో వ్యభిచార వృత్తిలో ఉన్నవారందరికీ మెరుగైన ప్రత్యామ్నాయాలు కల్పించేందుకు అధికార, పోలీసు వర్గాలు చర్యలు తీసుకున్నాయి. దీంతో గత కొన్నాళ్లుగా యాదాద్రిలో ఇటువంటి కార్యకలాపాలు చోటు చేసుకోలేదు. అయితే స్థానిక పోలీసు, అధికారుల సహకారంతో కొంత మంది దీనిని తిరిగి వ్యవస్థీకృతం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

గతంలోనూ స్థానిక అధికారులు, పోలీసుల అండతోనే యాదాద్రిలో వ్యభిచార ముఠాలు చురుగ్గా పని చేస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యలు చేయడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యాదాద్రిలోని వ్యభిచార గృహాల్లో చిన్నారులు త్వరగా ఎదిగేందుకు వివిధ హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నారని భువనగిరి షీ-టీం సభ్యులు 2018 జులై 30న చేసిన తనిఖీల్లో బయటపడింది. కానీ దేవాలయ అభివృద్ధిలో భాగంగా.. అప్పటి నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటూ నిత్యం ప్రభుత్వ పెద్దలు ఈ పుణ్యక్షేత్రానికి రాకపోకలు సాగిస్తుండటంతో ఐదారేళ్లుగా ఈ దందా సాగలేదు. ఈ ఏడాది మార్చిలో ఆలయ ఉద్ఘాటన అనంతరం ఉన్నతాధికారుల రాకపోకలు తగ్గాయి. దీంతో పోలీసులు తిరిగి వ్యభిచార ముఠాలతో ఒకటైపోయి ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారన్న విమర్శలు తీవ్రమయ్యాయి. తాజాగా ఇద్దరు బాలికలను చిన్నప్పుడే కొనుగోలు చేసి, ప్రస్తుతం 16 ఏళ్ల లోపున్న ఇద్దరు బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపగా.. అందులో ఒకరు తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇక్కడ సాగుతున్న దందాను గుట్టురట్టు చేశారు.

పీడీ చట్టం ప్రయోగించినా..: గత ఐదేళ్లలో ఈ వ్యవహారంతో సంబంధమున్న 35 మందిపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. 40 మంది వరకు అరెస్టు చేసి 36 మంది చిన్నారులను రక్షించారు. సుమారు 50 వరకు వ్యభిచార గృహాలను సీజ్‌ చేశారు. అయినా ఈ దందా ఆగడం లేదు. తరచూ ఈ ముఠాల ఆగడాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ వృత్తిపై ఇక్కడ మొత్తం 110 కుటుంబాలు జీవనం సాగించేవని లెక్కలు తీసిన అధికార యంత్రాంగం.. వారికి సరైన ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. కొందరు ఉన్నత చదువులు చదివి ఉపాధి అవకాశాలు చూసుకోగా, మరికొందరు కొండ కింద దుకాణాలు, హోటళ్లు నిర్వహిస్తూ ఆటోలు నడుపూతూ పొట్టపోసుకుంటున్నారు.

సుమారు 70 శాతం మంది మెరుగైన జీవనం సాగిస్తున్నా.. మరో 30 శాతం మందికి ఇప్పటికీ ఈ వృత్తే జీవనాధారం అయింది. దీంతో ఇక్కడ వ్యవస్థీకృతమైన ముఠాలు వీరి బలహీనతలను అడ్డుపెట్టుకుంటూ దందా సాగిస్తున్నాయి. ఆలయ ఉద్ఘాటన సమయంలో ఇక్కడి పోలీసు స్టేషన్‌ను ఏసీపీ స్థాయికి పెంచారు. ఒక ఇన్స్‌పెక్టర్‌, నలుగురు ఎస్సైలు, సుమారు 70 మంది పోలీసు సిబ్బంది ఉన్న చోట స్వయంగా బాలిక వచ్చి తనకు జరిగిన అన్యాయం చెప్పే వరకు పోలీసులకు తెలియదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ ఈ దందా మాకు తెలిసి జరుగుతుందన్నది వాస్తవం కాదు. చాలా మంది బాలికలను ఈ వ్యభిచార రొంపిలోంచి మేం బయటకు తీసుకువచ్చాం. పూర్తిగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం..’ అని పేరు రాయడానికి ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు వెల్లడించారు.

ఇవీ చూడండి..

Last Updated : Dec 8, 2022, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.