ETV Bharat / state

ఆగిన అవిలాల చెరువు సుందరీకరణ పనులు.. దొంగలకు పండగే..!

author img

By

Published : Apr 4, 2023, 1:25 PM IST

Avilaala pond Beautification Works Stopped: తిరుపతి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రారంభించిన అవిలాల చెరువు సుందరీకరణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి సామాగ్రిని, వస్తువులను కనుగోలు చేయగా అవి దొంగల పాలవుతున్నాయి. ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే కోట్ల రూపాయలు మట్టిపాలవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

Avilaala pond Beautification Stoped Problems
నిలిచిపోయిన తిరుపతి అవిలాల చెరువు సుందరీకరణ

నిలిచిపోయిన తిరుపతి అవిలాల చెరువు సుందరీకరణ

Avilaala pond Beautification works Stopped: తిరుపతి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రారంభించిన అవిలాల చెరువు సుందరీకరణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిర్మాణంలో వినియోగించిన కోట్ల రూపాయల విలువ చేసే సామగ్రి, వస్తువులు దొంగల పాలవుతున్నాయి. నిర్మాణాలను నిలిపివేసిన అధికారులు, పూర్తయిన వాటిని సంరక్షించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోట్ల రూపాయలు మట్టిపాలవుతున్నాయి. కోట్ల రూపాయలు వ్యయం చేసిన ప్రాజెక్ట్‌లు ప్రభుత్వం మారాక ఆపివేయడంతో అప్పటికే వెచ్చించిన నిధులు వృథా అవుతున్నాయి. దాదాపు 50 శాతం పూర్తయిన పనులను పక్కకు పెట్టేయడంతో లక్ష్యం నెరవేరకపోగా నిధులు నిరుపయోగమయ్యాయి.

దేశం నలుమూలల నుంచి.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని కలిగించే లక్ష్యంతో నగర శివార్లలోని ఆవిలాల చెరువును 'శ్రీ వేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవ ఉద్యానవనం' పేరుతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. 169 ఎకరాల విస్త్రీర్ణంలో ఓ భారీ ప్రాజెక్ట్​కు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేకూర్చేలా ఒకే ప్రాజెక్ట్​లో విభిన్నమైన అంశాలను జోడిస్తూ ప్రాజెక్ట్‌ రూపకల్పన చేశారు. నగరవాసులు ఉదయం, సాయంత్రం నడక కోసం మూడు కిలోమీటర్ల కాలి నడక మార్గం, సైక్లింగ్ చేసేలా ట్రాక్ నిర్మాణాలు చేపట్టారు.

పది ఎకరాల విస్త్రీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి బోటింగ్ సౌకర్యం, సప్తగిరులు సాక్ష్యాత్కరించేలా ఏడు కొండలను ఏర్పాటు చేస్తూ పనులు చేపట్టారు. రెండు దశలుగా ప్రాజెక్ట్‌ పూర్తి చేసేలా నిర్మాణాలు ప్రారంభించారు. తొలి దశలో 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రభుత్వం మారడంతో ప్రాజెక్ట్‌ అటకెక్కింది. ఇప్పటికే తొలి దశతో పాటు రెండో దశకు వ్యయం చేసిన నిధులు వృధాగా మారిపోయాయి. నిర్మాణాలు ఆగిపోవడంతో ఆవిలాల చెరువు కాస్త కంపచెట్లతో నిండిపోయి ఆసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.

తిరుపతి ప్రజలకు ఆహ్లాదకరమైన పార్కు అందుబాటులో లేదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం అవిలాల చెరువును ఆధ్యాత్మిక ఎకో పార్కుగా మార్చాలని నిర్ణయించింది. జలవనరులశాఖ అధికారులు చెరువు నిర్వహణ బాధ్యతలు తితిదేకు అప్పగించారు. 18.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు 2018లో తితిదే ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఏపీయూజీ అండ్ బీసీఎల్(ఏపీ అర్బన్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీయూజీ అండ్ బీసీఎల్ తొలి దశలో 80.14 కోట్లు, రెండో దశలో 100.99 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందించింది. ప్రతిపాదనలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించి తొలి దశ పనులకు ఆమోదం తెలిపారు.

పనులు చేపడుతున్న సమయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో శాశ్వత కట్టడాలు నిర్మించకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రతిపాదలను 46 కోట్ల రూపాయలకు కుదించారు. నిర్మాణంలో భాగంగా దాదాపు 20 కోట్ల రూపాయలు వ్యయం చేశారు.ఆధ్యాత్మిక భావనతో పాటు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే మహోన్నతమైన ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోవడంపై నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో 25 శాతం లోపు పనులు జరిగిన వాటిని నిలిపివేయాలన్న ఆదేశాలతో ఆవిలాల ప్రాజెక్ట్‌ పనులు ఆగిపోయాయి. 25 శాతం పైబడి ఆవిలాల అభివృద్ధి జరిగినా అధికారులు మాత్రం నిర్మాణాలు కొనసాగింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన పరికరాలు ఒక్కొక్కటిగా చోరీకి గురవుతున్నాయి. సుందరీకరణలో భాగంగా చెరువు లోపల ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మెలు.. ప్రహరీకి గ్రానైట్ రాళ్లతో పాటు సామగ్రిని దొంగలు తరలిస్తున్నారు.

"తొలి దశలో టీటీడీ నిధుల నుంచి కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం మారిపోయిన తర్వాత పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో తొలి దశలోపాటు రెండో దశకు వ్యయం చేసిన నిధులు వృధాగా మారిపోయాయి. నిర్మాణంలో వినియోగించిన కోట్ల రూపాయల విలువ చేసే సామగ్రి, వస్తువులు దొంగలపాలవుతున్నాయి. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. ఇంతకు ముందుకన్నా ఇక్కడ ట్రాకింగ్ పెద్దగా లేదు. ఈ మధ్య మేము మా సొంత ఖర్చులతో ట్రాక్ రెడీ చేసుకున్నాము. తిరుపతిలోనే ఇది నంబర్ వన్ ట్రాక్. కాకపోతే ఇక్కడ వసతులు లేవు. కొంతమంది మద్యం సేవించి బాటిల్స్​ను ఇక్కడే పడేస్తారు. ఇక్కడికి వచ్చిన వారు పగిలిన మద్యం సీసాలను చూసుకోకుండా తొక్కడం వల్ల గాయాలు కూడా అవుతున్నాయి. తిరుపతిలో పెద్ద మట్టి ట్రాక్ ఇదే. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ తీసుకుంటే ఈ ట్రాక్ ఇంకా బాగుంటుంది." - నగరవాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.