ETV Bharat / state

రోగం చుట్టేస్తోంది.. సాయం అందనంటోంది..!

author img

By

Published : Nov 21, 2020, 11:40 AM IST

శ్రీకాకుళం జిల్లాలో కరోనా ప్రభావంతో కిడ్నీ రోగులకు వైద్యసేవలు దూరమయ్యాయి. పూర్తిస్థాయి రక్త పరీక్షలు జరగక బాధితులు అవస్థలు పడుతున్నారు. ఫలితంగా బాధితులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి ఆర్థికంగా కుదేలవుతున్నారు. బాధితులు పింఛనుకూ నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు.

no medication for kidney diseased in srikakulam district
no medication for kidney diseased in srikakulam district

ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను, ప్రజలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ బాధితులనూ వదల్లేదు.. దీని కారణంగా ఎంతోమంది ప్రాణాలు విడిచారు.. మరికొందరు కోలుకున్నారు. అయితే కొవిడ్‌తో గత జనవరి నుంచి ఉద్దానం, ఇతర ప్రాంతాల్లో రక్త పరీక్షలతో పాటు ప్రత్యేక వైద్యం, మందుల పంపిణీ నిలిచిపోయింది. వైద్యులంతా కరోనా సేవల్లో నిమగ్నం కావడంతో డయాలసిస్‌ రోగులకు తప్ప ఇతర మూత్రపిండ సంబంధిత సమస్యలకు వైద్యమందలేదు. మరోపక్క కిడ్నీభూతం యువత, పిల్లలపై కూడా విరుచుకుపడుతుండడంతో వైద్యనిపుణులు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూలాల శోధన, వైద్యసేవలు విస్తరించేలా పాలకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

నవరి నెలకు ముందు వరకు కిడ్నీ రోగులకు అన్నిరకాల రక్త పరీక్షలు జరిగేవి. సామాజిక ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌ ఆధ్వర్యంలో 23 రకాల మందులు అందించేవారు. ఉద్దానంలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 10, సామాజిక ఆసుపత్రుల్లో 12 రకాల రక్త పరీక్షలు చేసేవారు. ఇక్కడి వైద్యుల సూచన మేరకు టెక్కలి, శ్రీకాకుళం రక్త నమూనాలు పంపించి 42 రకాల పరీక్షలు జరిపేవారు. అయితే జనవరి నుంచి అక్టోబరు వరకు కిడ్నీ రోగులకు సంబంధించిన అన్నిసేవలూ ఆపేశారు. వైద్యులు, ల్యాబ్‌ సిబ్బందికి కరోనా విధుల్లో ఉండటంతో మార్చి నుంచి అదే పరిస్థితి కొనసాగుతోంది. ఫలితంగా పరీక్షల కోసమే రూ.వేలల్లో వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మళ్లీ రక్త పరీక్షల నిర్వ హణకు అనుమతి ఇచ్చినా పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో కేవలం 10 నుంచి 12 పరీక్షలే జరుగుతున్నాయి. దీంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లపై ఆధారపడుతున్నారు. ●

* జనవరికి ముందు ఉద్దానం మండలాల్లో రోజుకు వెయ్యికి పైగా రక్త పరీక్షలు చేస్తే ప్రస్తుతం వందలోపు మాత్రమే జరుగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు ఇందుకు కారణం ఫిజీషియన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవలు అందుబాటులో లేకనే. ఫలితంగా బాధితులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి ఆర్థికంగా కుదేలవుతున్నారు.

పలాసలో డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులు

* వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడు రెండేళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. సీరంక్రియాటినిన్‌ పెరుగుతుండడంతో కొంతకాలం విశాఖలో చికిత్స పొందాడు. నెలకు రూ.5 వేల విలువైన మందులు వాడేవాడు. ప్రత్యేక పింఛను మంజూరుకు శ్రీకాకుళం రెండుసార్లు వెళ్లినా ఫలితం లేకపోయింది. రూ..5 వేలు సాయం కూడా అందలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే మందుల పంపిణీ నిలిచిపోవడంతో సరైన వైద్యమందక వారం రోజుల కిందటే మృత్యువాత పడ్డాడు. ●

* కవిటి మండలం వరక గ్రామానికి చెందిన ఓ మహిళకు మూత్రపిండాల పరిమాణం తగ్గడంతో డయాలసిస్‌ స్థాయికి చేరుకుంది. ప్రత్యేక పింఛను రూ.5 వేలు అందుకునేందుకు అన్ని అర్హతలున్నా పరీక్షల కోసం రెండు, మూడు రోజులు శ్రీకాకుళం వెళ్లాల్సిరావడం, అక్కడ రోజంతా పడిగాపులు పడాల్సిన పరిస్థితితో ఒకసారి ప్రయత్నించి విరమించుకుంది. నెలకు మందుల కోసం రూ.6 వేలకు పైగా ఖర్చవుతుండటంతో ఆర్థికంగా అవస్థలు పడుతోంది.

పడకేసిన మూలాల శోధన...

కిడ్నీ బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉన్న సిక్కోలు విషయంలో పాలకుల ఉదాసీనత కొనసాగుతూనే ఉంది. మూడు దశాబ్దాలుగా ఇక్కడ మాయదారి జబ్బుకు దాదాపు 30 వేల మందికి పైగానే బలయ్యారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తల పరిశోధనలో మూలాల శోధన విషయమై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ పరంగా నామమాత్ర చర్యలే మిగులుతున్నాయి.

యువతపైనా ప్రభావం

గతంలో మధ్యవయస్కులు, వృద్ధులకే పరిమితమైన ఈ వ్యాధి కొంతకాలంగా యువతపైనా విరుచుకుపడుతోంది. ప్రభుత్వం పలాసలో పరిశోధనా కేంద్రం, కార్పొరేట్‌ తరహా ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా అవి అందుబాటులోకి రావాలంటే మరో రెండేళ్లు సమయం పట్టే పరిస్థితి ఉంది. పలు పరిశోధనల్లో తాగునీటి ఇబ్బందులు ప్రస్తావించారు. ఇక్కడ వినియోగిస్తున్న నీటిలో సిలికా ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇతర కారణాల విషయంలో మరింత లోతుగా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో అదీ పడకేసింది.

ప్రత్యేక పింఛను నామమాత్రమే...

ముఖ్యమంత్రి జగన్‌ ఉద్దానం కిడ్నీ రోగులకు ఇచ్చిన హామీ మేరకు డయాలసిస్‌ రోగులకు రూ.10 వేలు ఇస్తున్నారు. సీరంక్రియాటినిన్‌ ఐదు పాయింట్లు దాటి, మూత్రపిండాల పరిమాణం చిన్నవిగా ఉన్నవారికి వైద్యం, ఇతర అవసరాల కోసం రూ.5 వేల పింఛను (సీకేడీ రోగులకు) సదుపాయం కలిగించారు. అయితే లబ్ధి అందరికీ అందడం లేదు. నిబంధనలు, ఇతర సమస్యలు ఆటంకంగా మారాయి. జిల్లాలో సీకేడీ బాధితులు 8 వేలకు పైగానే ఉంటే కేవలం 294 మందికే రూ.5 వేలు పింఛను అందుతోంది.

శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలోనే పరీక్షలు చేయించుకుని నెఫ్రాలజిస్టు ద్వారా ధ్రువపత్రం పొందాల్సి ఉంది. దీనికిగాను నాలుగైదుసార్లు తిరగాల్సి రావడంతో బాధితులు ఈ సదుపాయం పొందలేకపోతున్నారు. ఉద్దానం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లి రోజంతా పడిగాపులు పడాల్సి వస్తోంది. ఈ విషయంపై జిల్లా మంత్రి అప్పలరాజు చొరవతో వారంలో కొన్నిరోజులు పలాస వచ్చి పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. అయినా గత మూడునెలలుగా పలాసలోనూ ఈ సేవలు ఆగిపోవడంతో మళ్లీ ఇబ్బందులు తప్పలేదు.

జాతీయ స్థాయిలో కదలిక రావాలి..

డయాలసిస్‌ కంటితుడుపు చర్య మాత్రమే. మూలాల శోధనతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించి చర్యలు చేపట్టాల్సి ఉన్నా అటువంటి పరిస్థితి లేదు. యువత, పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. జాతీయస్థాయిలో కదలికొస్తే మహమ్మారి నుంచి విముక్తి దొరకదు.

- డాక్టర్‌ వై.కృష్ణమూర్తి, అధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షణ సమితి

సాధారణ రక్త పరీక్షలు మళ్లీ ప్రారంభం

కరోనా నేపథ్యంలో కిడ్నీ రోగులకు వైద్యసేవలు నిలిచిపోయాయి. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో మళ్లీ నిర్వహించాలని ఇటీవల ఆదేశాలిచ్చాం. ప్రస్తుతానికి మందుల పంపిణీ నిలిచింది. ప్రత్యేక పరీక్షలు కూడా ఆగాయి. ప్రత్యేక పింఛను కోసం మళ్లీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. సీరంక్రియాటినిన్‌ ఐదు పాయింట్లు దాటిన వారు మంగళ, శుక్రవారం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి వెళితే మిగిలినవి చేసి ధ్రువపత్రం ఇస్తారు. అక్కడ నెఫ్రాలజిస్టు ద్వారా సేవలు పొందొచ్ఛు

- కె.లీల, జిల్లా ఉప వైద్య, ఆరోగ్యశాఖాధికారి

  • బాధిత మండలాలు : ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస, నందిగాం, మెళియాపుట్టి, టెక్కలి, పాతపట్నం, పొందూరు, ఎచ్చెర్ల
  • సీకేడీ బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాలు : ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు
  • డయాలసిస్‌ చేయించుకుంటున్నవారు 582 మంది
  • ఉద్దానంలో కిడ్నీ బాధితుల సంఖ్య 35వేలకు పైనే..
  • రెండేళ్ల కిందట ఉద్దానంలో పరీక్షలు చేసిన వారి సంఖ్య 1.03 లక్షల మంది
  • బాధితులు 13 వేలు
  • సీరంక్రియాటినిన్‌ ఐదు పాయింట్లు దాటిన వారు సుమారు 8 వేలు వరకు
  • రూ.5 వేలు పింఛను అందుకుంటున్నవారు 294 మంది మాత్రమే
  • జిల్లాలో డయాలసిస్‌ కేంద్రాలు: 7 (కవిటి, సోంపేట, మందస, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, పాలకొండ)

ఇదీ చదవండి: కార్మికుడి మృతిపై నిరసన.. నిలిచిన పోలవరం స్పిల్‌వే పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.