ETV Bharat / state

చుక్కల భూముల చిక్కులతో రైతులకు తిప్పలు

author img

By

Published : Jan 9, 2022, 2:00 PM IST

అవి సొంత భూములే... కానీ అమ్ముకోలేరు. పట్టాలు ఉంటాయి.. కానీ పేరు మార్చుకోలేరు. తమ ఆధీనంలోనే ఉన్నా సరే... అవసరానికి మాత్రం ఉపయోగపడవు. అత్యవసర సమయాల్లో బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్నా సాధ్యం కాదు. అలాంటి భూములతో ప్రకాశం జిల్లా రైతులు అవస్థలు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని చుక్కల భూముల చిక్కులపై ఈటీవీ-భారత్ ప్రత్యేక కథనం.

prakasham-farmers-who-want-rights-over-chukka-lands
చుక్కల భూముల చిక్కులతో రైతులకు తిప్పలు

చుక్కల భూముల చిక్కులతో రైతులకు తిప్పలు

బ్రిటిష్ కాలంలో భూమి శిస్తు ద్వారానే అధిక ఆదాయం వచ్చేది. అప్పట్లో కొందరు రైతులు శిస్తు చెల్లించలేకపోయారు. 1910లో సర్వే ఆధారంగా కొలతలు వేసిన రెవెన్యూ అధికారులు... రికార్డుల్లో నమోదు చేయని భూములకు చుక్కలు పెట్టి వదిలేశారు. అలా శిస్తు కట్టలేక వదిలివేసిన భూములు రికార్డుల్లో చుక్కల భూములుగా నమోదయ్యాయి. ఈ భూములకు హక్కుదారులు ఉన్నా... నిషేధిత ప్రభుత్వ భూముల జాబితాలో చేరాయి. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్నా.. హక్కులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

వందేళ్ల నాటి చుక్కల భూముల సమస్య పరిష్కారం కోసం ఎంతో మంది అధికారులకు రైతులు మొరపెట్టుకున్నా.. ప్రయోజనం మాత్రం శూన్యం. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 70 వేల ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయి. కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోని 24 మండలాల్లో రైతులు ఈ భూముల సమస్యతో అల్లాడిపోతున్నారు.

చుక్కల భూములు జాబితాలో వ్యవసాయ భూములే కాకుండా.. పట్టణాల్లో కోట్ల విలువ చేసే భవనాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. తమ భూములను చుక్కల జాబితా నుంచి తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని గత ప్రభుత్వం ప్రయత్నించినా.. పూర్తిస్థాయి ఆచరణకు నోచుకోలేదు. ఇప్పటికైనా చుక్కల భూములను పట్టా భూములుగా గుర్తించి హక్కులు కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. దశాబ్దాలుగా చిక్కుముడి పడిన చుక్కల భూములకు చక్కటి పరిష్కారం చూపితే.. వేలాది మందికి మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.

ఇదీ చూడండి: నాడు భిక్షమెత్తుకున్నాడు.. నేడు క్రీడారంగంలో రాణిస్తూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.