ఇదీ జిల్లాలో ప్రజా నేతల ప్రస్థానం

author img

By

Published : Feb 1, 2021, 7:30 PM IST

from sarpanch to mla

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని నిజం చేశారు. స్థానిక పోరులో ప్రజల మద్దతుతో గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయికి ఎదిగి ఎమ్మెల్యేలుగానూ శాసనసభలో అడుగు పెట్టారు. పల్లె సీమ నుంచి చట్టసభల్లోకి ప్రవేశించి, మరెన్నో పదవులు అలంకరించి అభివృద్ధిలో తమదైన ముద్ర వేశారు.

జిల్లాకు చెందిన కీలక నాయకులు గ్రామ పాలనలో ఉత్తమ సేవలందించి మేటి అనిపించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని నిజం చేశారు. స్థానిక పోరులో ప్రజల మద్దతుతో గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయికి ఎదిగి ఎమ్మెల్యేలుగానూ శాసనసభలో అడుగు పెట్టారు. పల్లె సీమ నుంచి చట్టసభల్లోకి ప్రవేశించి, మరెన్నో పదవులు అలంకరించి అభివృద్ధిలో తమదైన ముద్ర వేశారు.

తండ్రీ కుమారులిద్దరూ ఇద్దరే...

సర్పంచి నుంచి జడ్పీ అధ్యక్షుని వరకు సాగిన ప్రస్థానం పోతుల చెంచయ్యది. 1960-70 మధ్య రెండు సార్లు టంగుటూరు సర్పంచిగా పనిచేశారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి 1974- 75 మధ్య జిల్లా పరిషత్‌ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. చెంచయ్య మరణానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన వారసుడు పోతుల రామారావు పయనమూ పంచాయతీ నుంచే ప్రారంభమైంది. 1997లో టంగుటూరు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2004లో కొండపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పునర్విభజనలో ఈ స్థానం ఎస్సీలకు కేటాయించడంతో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

దామచర్ల.. తనదైన ముద్ర...
టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సర్పంచిగా 1962లో రాజకీయ జీవితాన్ని ఆరంభించారు దివంగత నేత దామచర్ల ఆంజనేయులు. 1983లో పీడీసీసీ బ్యాంకు అధ్యక్షునిగా., 1990 తర్వాత తెదేపా జిల్లా అధ్యక్షునిగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1994, 1999 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై దేవాదాయ శాఖ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించి శభాష్‌ అనిపించుకున్నారు.

సమితి అధ్యక్షునిగానూ...

పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం పావులూరుకి చెందిన గాదె వెంకటరెడ్డి 1967లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో పంచాయతీ సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తర్వాత రెండు సార్లు పర్చూరు నుంచి శాసనసభకు వెళ్లారు.

కీలక పదవుల్లో కాశిరెడ్డి...

కనిగిరి నియోజకవర్గానికి చెందిన ముక్కు కాశిరెడ్డి 1981లో వెలిగండ్ల మండలం ఇమ్మడిచెరువు గ్రామ పంచాయతీ సర్పంచిగా గెలుపొందారు. అనంతరం తెదేపాలో చేరి 1983, 1985, 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా, జిల్లా తెదేపా అధ్యక్షునిగా కొనసాగారు. ఆ తర్వాత పీసీపల్లి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది జడ్పీ అధ్యక్షుడిగానూ ఎంపికయ్యారు.

పమిడిపాడు టు శాసనసభ...

జాగర్లమూడి రాఘవరావు 1981 ప్రాంతంలో పమిడిపాడు సహకార సంఘం అధ్యక్షుడిగా, 1988లో కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామ సర్పంచిగా పనిచేశారు. తదనంతర పరిణామాలతో 1989 శాసనసభ ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

ఇరిగినేని హ్యాట్రిక్‌...

కనిగిరి ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికైన ఇరిగినేని తిరుపతినాయుడు 1976లో పామూరు మండలం మోపాడు నుంచి సర్పంచిగా తన ప్రస్థానం ఆరంభించారు. 1987లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి శాసనసభలోకి అడుగుపెట్టారు. 1999, 2004లోనూ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు.

కాసునే కంగు తినిపించారు...
రైతు కుటుంబం నుంచి వచ్చిన కాటూరి నారాయణస్వామి 1956లో పొదిలి పంచాయతీ సర్పంచిగా ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 1962, 1967లో కాంగ్రెస్‌ నుంచి, 1972లో స్వతంత్ర అభ్యర్థిగా శాసన సభ్యుడయ్యారు. తెదేపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థిగా దర్శి నుంచి 1983లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1984లో నిర్వహించిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నరసరావుపేటలో పోటీ చేసి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు.

ఇవీ చూడండి..: వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్​కు సీబీఐ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.