ETV Bharat / state

వైకాపాను తరిమికొట్టే రోజులు త్వరలోనే వస్తాయి: లోకేశ్

author img

By

Published : Dec 5, 2020, 10:49 PM IST

రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వంపై పోరాడుతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉద్ఘాటించారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో నివర్ తుపాను కారణంగా పాడైన పంట పొలాలను లోకేశ్ పరిశీలించారు. రైతులను పరామర్శించారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, నూకసాని బాలాజీ తదితరులు లోకేశ్ వెంట ఉన్నారు.

Nara Lokesh Fires On Jagan Over Farmers Issue
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని నల్ల కాలువను నారా లోకేశ్ పరిశీలించారు. కాలువలో తూటుకాడ పెరిగిపోవటం వల్ల వరదకు ఆటంకం ఏర్పడి పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ కారంచేడులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. లోకేశ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడంలేదని, తుపానుకు రైతులు తీవ్రంగా నష్టపోతే కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 30వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కారంచేడు మండలం తెమిడితపాడు వద్ద లక్ష్మీనాయమ్మకుంటలోని మిరప పొలాలను లోకేశ్ పరిశీలించారు. మిర్చి పంట పూర్తిగా పాడయ్యిందని, ఎవరూ తమను ఆదుకోలేదని రైతులు లోకేశ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అధైర్యపడొద్దని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. దగ్గుపాడులో పొలాల్లోకి దిగి పంటలను పరిశీలించారు.

పంటల బీమా నిధులను ప్రభుత్వం మెడలు వంచి సాధించిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలదే అని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న లోకేశ్... రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం... వారిని నిండా ముంచిందని ధ్వజమెత్తారు. రైతులు పంట నష్టపోయి తీవ్ర ఆందోళన చెందుతుంటే... అధికార యంత్రాంగం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వరదల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులను, ప్రజలను ఆదుకున్న తీరును గుర్తుచేశారు.

రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే తరిమికొట్టే రోజులు త్వరలోనే వస్తాయని లోకేశ్ హెచ్చరించారు. రైతులను పట్టించుకోకుంటే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రైతులతో కలిసి ప్రభుత్వాన్ని దించేవరకు పోరాడుతామని హెచ్చరించారు. పొలాల్లోకి వచ్చి రైతుల పంటలు చూసి పెద్ద మనసుతో రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది బడ్జెట్​లో వ్యవసాయానికి మూడు వేలకోట్లు పెట్టి.. రూ.300 కోట్లు ఖర్చు మాత్రమే చేశారని ఆరోపించారు. రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వం దుకాణం బంద్ చేసుకోవాలని హెచ్చరించారు.

దగ్గుబాడు.. పర్చూరు మీదుగా అన్నంబొట్లవారిపాలెం వరకు నారా లోకేశ్ పర్యటన సాగింది. అన్నంబొట్లవారిపాలెంలో పొగాకు రైతులతో మాట్లాడిన లోకేశ్... స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లా చీరాలలో లోకేశ్ పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

ఇదీ చదవండీ... 'ఇది మరో కోడి కత్తి డ్రామాలాంటిదని వేరే చెప్పాలా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.