ETV Bharat / state

మార్కెట్లో సదుపాయాల్లేక మామిడి రైతులు, వ్యాపారుల అవస్థలు

author img

By

Published : Jun 10, 2021, 6:08 PM IST

ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడికి దేశంలోనే మంచి గిరాకీ ఉంది. ఇలాంటి మామిడికి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చి... మార్కెట్‌ సౌకర్యాలను విస్తరిస్తామంటూ కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు నామమాత్రంగానే మిగిలిపోయాయి. మామిడి వ్యాపారం కోసం నిర్మించిన మార్కెట్‌ యార్డు.... ఇసుక డంపింగ్‌ యార్డుగా మారిపోవడంతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

mango farmers
మామిడి రైతులు, వ్యాపారుల అవస్థలు

మామిడి మార్కెట్లో సదుపాయాల్లేక మామిడి రైతులు, వ్యాపారుల అవస్థలు

ప్రకాశం జిల్లా ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో వేల ఎకరాల్లో విస్తరించిన బంగినపల్లి మామిడికి ప్రత్యేకత ఉంది. సాధారణ మామిడి కంటే ఉలవపాడు మామిడికి ఉన్న డిమాండ్‌ కారణంగా మంచి ధర కూడా పలుకుతుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయి వ్యాపారం లేక రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఉలవపాడు మామిడికి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చి, సౌకర్యాలు కల్పించి రైతులను ఆదుకుంటామని కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చెబుతున్నా... అవి కార్యరూపం దాల్చడంలేదు. దీంతో రైతులు, వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు.

పదేళ్ల క్రితం 4 ఎకరాల విస్తీర్ణంలో ఉలవపాడుకు 8 కిలోమీటర్ల దూరంలో వీరేపల్లి దగ్గర మామిడి మార్కెట్‌ యార్డు నిర్మించారు. శీతల గిడ్డంగులు, రైతు విశ్రాంతి గదులు, కాటా వంటివి ఏర్పాటు చేయాల్సి ఉండగా..... చిన్నచిన్న షెడ్లు మాత్రమే నిర్మించారు. ఫలితంగా ఒక్క ఏడాది కూడా ఇక్కడ వ్యాపారాలు సాగలేదు. పైగా కొద్దిరోజుల నుంచి ఇక్కడ ఇసుక డంపింగ్‌ యార్డు నిర్వహిస్తున్నారు. లోపలికి వెళ్లేందుకు కూడా మార్గం లేకపోడంతో... మార్కెట్‌ యార్డు రైతులకు ఉపయోగపడకుండా వృథాగానే మిగిలిపోయింది.

మూడేళ్ల క్రితం ఉలవపాడు ప్రాంతాన్ని శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. మామిడి సాగుపై జాతీయ ఉద్యాన మండలి కూడా పరిశోధన ప్రారంభించింది. మామిడి మార్కెట్‌ తోపాటు, జ్యూస్‌, పల్ప్‌ పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై కూడా ప్రతిపాదనలు చేసింది. 75శాతం రాయితీపై ఆర్థిక సాయం అందించి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించింది. ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. మార్కెట్‌ యార్డు ఉపయోగంలోకి రాకపోవడం, పారిశ్రామికంగా గుర్తింపు రాకపోవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభు‌త్వం... ఉలవపాడు మామిడికి గుర్తింపు కల్పించి.. మార్కెట్‌ యార్డును పూర్తిస్థాయిలో నిర్మించి వినియోగంలోకి తీసుకురావాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

ఆనందయ్య మందుకు క్రేజ్.. పోటాపోటిగా పంపిణీ చేసిన ఎంపీ, మంత్రి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.