ETV Bharat / state

అధికార పార్టీ అండదండలుంటే... నిబంధనలు పట్టవా?

author img

By

Published : Jun 5, 2020, 1:50 PM IST

నిబంధనలకు విరుద్ధంగా... అధికారపార్టీ నాయకుల అండదండలతో... ఏకంగా చెరువునే తవ్వేస్తున్నారు అక్రమార్కులు. ప్రొక్లెయినర్​తో తవ్వకాలు జరపుతున్నా... అధికారులు చూసీచూడనట్లు.. అసలేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులంటున్నారు.

illegally gravel digging
చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామ చెరువులో... అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. చెరువులో యంత్రాలు పెట్టి గ్రావెల్​ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. చెరువుల్లో పూడికతీత పనులు చేసేటప్పుడు మాత్రమే తవ్వకాలు జరుపుతారు. దీనికి నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకాల ద్వారా ఈ పనులు చేయంచి, కూలీలకు పని కల్పించేవారు. కానీ ఇక్కడ ఎటువంటి ప్రభుత్వ పథకం అమలు చేయకుండా, కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతోనే తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ప్రొక్లెయినర్లతో గ్రావెల్​ను తవ్వి, టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులకు ఈ గ్రావెల్​ను తరలిస్తున్నారు. సుమారు 550 ఎకరాల విస్తీర్ణం గల చెరువుకు ఎగువ నుంచి వచ్చే నీరే ఆధారం. ఇప్పుడు ఈ చెరువుకు నీరు వచ్చే వాగుకు ఆనుకొని గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్నారు.

పూడికతీత పనులు చేపట్టినా... చెరువు మధ్యలో అదీ 1 మీటరు లోతులో మాత్రమే తవ్వాలి. ఇప్పడు నిబంధనలకు తూట్లు పొడుస్తూ, చెరువుకు ఒక మూలన.. అందునా 5 మీటర్లు పైబడి తవ్వకాలు జరుపుతున్నారు. చెరువుకు వచ్చే నీళ్లన్నీ ఈ గ్రావెల్ లోతుల్లో చేరి... చెరువు నిండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అనధికార తవ్వకాలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలు సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.