ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: జనరిక్ మందుల వైపు ప్రజల చూపు

author img

By

Published : Oct 17, 2020, 12:32 PM IST

కరోనా మహమ్మారి ఎంతోమంది ఆదాయ మార్గాలపై దెబ్బకొట్టింది. కొవిడ్ సమయంలో దాదాపు ప్రతి ఇంట్లో మందుల వినియోగం పెరిగింది. రక్షణ చర్యల్లో భాగంగా విటమిన్ టాబ్లెట్స్, యాంటీ బయాటిక్స్ వాడడం అధికమైంది. దీంతో ఆయా మందుల ధర పెరిగింది. దీనికితోడు దీర్ఘకాలిక వ్యాధుల వారు ఉండనే ఉన్నారు. అసలే ఆదాయానికి గండి పడిన ఈ సమయంలో.. మందుల ఖర్చులు అధికమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో చాలామంది చూపు జనరిక్ మందులపై పడింది. బ్రాండెడ్ వాటితో పోలిస్తే ధరలో చాలా వ్యత్యాసం ఉండడం, వాటిలానే పనిచేయటంతో ఎక్కువ మంది జనరిక్ వైపు దృష్టి సారించారు. అలా మందుల ఖర్చును తగ్గించుకున్నారు.

generic tablets
పెరిగిన జనరిక్ మందుల వినియోగం

కరోనా వైరస్ విజృంభించిన వేళ దాదాపు ప్రతి ఇంట్లో మందుల వాడకం పెరిగింది. విటమిన్, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వాడేవారు అధికమయ్యారు. దానికితోడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా మందుల ఖర్చు ఉండనే ఉంది. అసలే ఆదాయానికి గండిపడిన వేళ ఈ ఖర్చు అందరికీ భారమయ్యేదే. ఇలాంటి సమయంలో చాలామంది జనరిక్ మందులవైపు అడుగులు వేశారు. ఎప్పట్నుంటో ఇవి ఉన్నా.. కరోనా కారణంగా ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా జనరిక్ మందుల వినియోగం పెరిగింది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే ధర తక్కువగా ఉండడం, వాటిలానే పనిచేస్తుండటంతో చాలామంది జనరిక్ వైపు చూస్తున్నారు.

బ్రాండెడ్ -జనరిక్ మధ్య తేడా

ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి మందును మా‌ర్కెట్​లోకి తీసుకొస్తాయి. అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీపై ఆ కంపెనీకి కొంతకాలం పాటు పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ మందును ఆ ఫార్ములాలో వేరే ఏ సంస్థ కూడా ఔషధం తయారు చేయకూడదు. అలా తయారుచేసి అమ్మితే వారు శిక్షార్హులవుతారు. అలా తయారు చేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు. వాటి తయారీకి అయిన ఖర్చు తక్కువే అయినప్పటికీ ఫార్మా కంపెనీలు వాటిని చాలా అధిక ధరలకు అమ్ముతారు.

ఆ మందు మొట్టమొదట తయారు చేసిన కంపెనీ పేటెంట్ కాలం ముగిసిన తర్వాత.. అవే కెమికల్స్ ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ సంస్థైా తయారు చేసి మార్కెట్​లోకి విడుదల చేయవచ్చు. అలా తయారు చేసిన మందులను " జనరిక్_డ్రగ్స్" అంటారు. జనరిక్ డ్రగ్స్ తయారు చేయటానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కాని క్లినికల్ ట్రయల్స్ గాని జరపవలసిన అవసరం లేదు. అందువలన జనరిక్ డ్రగ్స్ ధరలు, బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుంచి 80 శాతం తక్కువ ధరలలో లభిస్తాయి. వీటిపై ముద్రించే యం.ఆర్.పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని అమ్ముతారు.

కరోనాతో పెరిగిన వినియోగం

ఎప్పట్నుంటో జనరిక్ మందులపై ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా.. ప్రజలు లేనిపోని అపోహలతో బ్రాండెడ్ వైపే మొగ్గు చూపేవారు. అయితే కరోనాతో ఆదాయం తగ్గిపోయిన వేళ ప్రజలంతా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే జనరిక్ మందులవైపు దృష్టి సారించారు. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర మాత్రలు 50 నుంచి 70 శాతం తక్కువ ధరకే లభిస్తాయి. సాధారణ అనారోగ్యాలకు అతి తక్కువ ధరకే జనరిక్ మందులు లభిస్తాయి.

ప్రకాశం జిల్లా ఒంగోలులోనూ ప్రజలు జనరిక్ మందులనే ఎక్కువగా వాడుతున్నారు. ధరలో తగ్గుదల, బ్రాండెడ్ వాటిలానే పని చేయడం వంటి కారణాలతో జనరిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీటి వాడకం వల్ల నెలవారీ మందుల ఖర్చు చాలావరకు తగ్గినట్లు చెప్తున్నారు.

బ్రాండెడ్ మందులకు, జనరిక్ మందులకు తేడా ఏం లేదు. వైద్యుడి సిఫార్సు మేరకు అన్ని వ్యాధులకు జనరిక్ మందులను ఉపయోగించవచ్చు. సాధారణ మందుల్లానే ఇవీ పనిచేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. -- డాక్టర్ శ్రీరాములు, సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలు.

ఇవీ చదవండి..

'800' సినిమా వివాదంపై స్పందించిన మురళీధరన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.