ETV Bharat / state

ఉదయగిరి నారాయణ మృతిపై ఎస్సీ కమిషన్‌ విచారణ..

author img

By

Published : Aug 7, 2022, 11:47 AM IST

SC COMMISSION: నెల్లూరు గ్రామీణ మండలం కందమూరు గ్రామానికి చెందిన ఉదయగిరి నారాయణ మృతిపై పలు ఆరోపణల నేపథ్యంలో.. జాతీయ ఎస్సీ కమిషన్ కేసును ప్రత్యేకంగా పరిగణించింది. దీంతో ఎస్సీ కమిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సునీల్‌కుమార్‌బాబు జిల్లాలో విచారణ చేపట్టారు. తొలుత మృతదేహం లభ్యమైన ప్రాంతాన్ని పరిశీలించి తర్వాత కందమూరు వెళ్లారు.

SC COMMISSION
SC COMMISSION

SC COMMISSION: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు గ్రామీణ మండలం కందమూరుకు చెందిన ఉదయగిరి నారాయణ మృతిపై జాతీయ ఎస్సీ కమిషన్‌ విచారణ చేపట్టింది. పొదలకూరు ఎస్సై కరిముల్లా కొట్టడంతోనే జూన్‌ 19న నారాయణ చనిపోయాడని, తమకు న్యాయం చేయాలని నారాయణ భార్య పద్మ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ఎస్సీ కమిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సునీల్‌కుమార్‌బాబు శనివారం జిల్లాలో విచారణ చేపట్టారు. తొలుత మృతదేహం లభ్యమైన ప్రాంతాన్ని పరిశీలించి తర్వాత కందమూరు వెళ్లారు. మృతుడి భార్య పద్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమయంలో పెద్ద కుమారుడు సైతం తన తండ్రిని పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడని తెలిపినట్లు సమాచారం. పద్మ మాట్లాడుతూ తన భర్తను ఎస్సై కరిముల్లా, బ్రిక్స్‌ కంపెనీ యజమాని వంశీనాయుడు కొట్టి చంపారని వివరించారు. మరణ ధ్రువీకరణ పత్రంకోసం వెళితే.. స్థానిక అధికారులు తన భర్త ఉరేసుకుని చనిపోయాడని రాసిస్తేనే ఇస్తామంటున్నారని ఆరోపించారు. అక్కడి నుంచి పొదలకూరులోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై కరిముల్లాతో మాట్లాడారు. అక్కడే పొదలకూరు మండల తెదేపా అధ్యక్షుడు మస్తాన్‌బాబు.. ఎస్సై కరిముల్లా తీరును కమిషన్‌ డైరెక్టర్‌ దృష్టికి తెలిపారు.

బాధితులకు న్యాయం చేస్తాం
నారాయణ మృతిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేశామని ఎస్సీ కమిషన్‌ డైరెక్టర్‌ జి.సునీల్‌కుమార్‌బాబు తెలిపారు. బాధితురాలి ఖాతాలో రూ.4,12,500 జమ చేశారని, మిగిలిన మొత్తం ఛార్జిషీట్‌ దాఖలైన తర్వాత ఇస్తారని చెప్పారు. ఆమెకు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉద్యోగం, రూ.5వేలు పింఛను ఇస్తున్నామని, 3సెంట్ల స్థలం, పిల్లలకు ఉచిత విద్య అందించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు సూచించామని అన్నారు. ఛైర్మన్‌ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నారాయణ మృతిపై ఎస్సీ కమిషన్‌ విచారణ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.