Somasila project: జలాశయం తెగిపోయిందని వదంతులు..జనం పరుగులు

author img

By

Published : Nov 23, 2021, 3:53 PM IST

Updated : Nov 23, 2021, 5:20 PM IST

somasila project

నెల్లూరు జిల్లాలోని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సోమశిల జలాశయం తెగిపోయిందన్న వదంతులతో జనం పరుగులు తీశారు. అధికారులు వచ్చి జలాశయం సురక్షితంగానే ఉందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

జలాశయం తెగిపోయిందని వదంతులు..జనం పరుగులు

సోమశిల జలాశయం తెగిపోయిందన్న వదంతులతో నెల్లూరు పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కోవూరు మండలంలో సాలుచింతల, స్టౌబిడి కాలనీప్రాంత వాసులు చేతికందిన సామాగ్రితో పరుగులు పెట్టారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలు, సోమశిల జలాశయం తెగిందన్న వదంతులతో మరింత కంగారు పడ్డారు. వృద్ధులు, పిల్లలను తీసుకొని వీధుల వెంట పరుగులు తీయడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చివరకు అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరదల సమయంలో ఎందుకు సమాచారం ఇవ్వలేదని కొంతమంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్యాం తెగిపోయిందని చెప్పడంతో ప్రాణ భయంతో పరుగులు తీశాం. ఇంతలో అధికారులు వచ్చి డ్యాం సురక్షితమేనని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాం. వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయడం సరికాదు.- బాధితులు

జిల్లా జేసీ హరేంద్ర ప్రసాద్ సైతం సోమశిలకు ఎలాంటి ముప్పు లేదని అధికారికంగా ప్రకటించారు. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం తెగిపోయిందని ఎవరో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని. ఎవరూ ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని నెల్లూరు జిల్లా జలవనరుల శాఖ అధికారి కృష్ణ మోహన్ తెలిపారు .

ప్రాజెక్టు తెగిపోయిందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. సోమశిల సురక్షితంగా ఉంది. ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. -అధికారులు

ఇదీ చదవండి:

కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం

Last Updated :Nov 23, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.