ETV Bharat / state

చెరుకు రైతుల ఆవేదన... డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న షుగర్ ఫ్యాక్టరీ

author img

By

Published : Jun 14, 2020, 5:19 PM IST

ఆరుగాలం కష్టపడి పండించిన చెరుకును అమ్ముకున్నా... రైతు కష్టాలు తీరడంలేదు. పంటను షుగర్ ఫ్యాక్టరీకి అమ్ముకున్న రైతులకు నిరాశ ఎదురైంది. చెరుకు అమ్మి ఒకటిన్నర సంవత్సరం పూర్తి అవుతున్నా... షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం డబ్బులు చెల్లించలేదు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు. డబ్బులు అడిగితే రేపు, మాపు అంటూ తిప్పుతున్నారని రైతులు వాపోతున్నారు.

చెరుకు రైతుల ఆవేదన
చెరుకు రైతుల ఆవేదన

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలో సూదుల గుంట షుగర్ ఫ్యాక్టరీ 2018లో కడప, నెల్లూరు జిల్లాల రైతుల వద్ద 95 వేల మెట్రిక్ టన్నుల చెరుకు కొనుగోలు చేసింది. 95 వేల మెట్రిక్ టన్నులకు రూ.23 కోట్లు రైతులకు చెల్లించాలి. కానీ 14 కోట్ల రూపాయల మాత్రమే చెల్లించారు. మిగిలిన తొమ్మిది రూ.కోట్లు చెల్లించకుండా ఏడాదిన్నరగా కాలం వెళ్లదీస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు అడిగినా.. కంపెనీ యాజమాన్యం సమాధానం చెప్పడం లేదని రైతులు అంటున్నారు.

చెరుకును షుగర్ ఫ్యాక్టరీకి తరలిస్తే.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్​కు తమ గోడు చెప్పుకున్నా.. ఎవరూ పట్టించుకోవటంలేదని ఆవేదన చెందుతున్నారు. పంటపై లక్షల్లో పెట్టుబడి పెట్టామని, షుగర్ ఫ్యాక్టరీ యజమాని డబ్బులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం.. రైతులకు డబ్బులు ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని రైతు నాయకులు అంటున్నారు. ఇకనైనా డబ్బులు ఇవ్వకపోతే ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసులు పెడతామన్నారు.

రైతులకు ఒకటిన్నర సంవత్సరం నుంచి సూదుల గుంట షుగర్ ఫ్యాక్టరీ డబ్బులు ఇవ్వకపోవడం వాస్తవమేనని చెరుకు సహాయ కమిషనర్ జాన్ విక్టర్ అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఆర్​ఆర్ చట్టం కింద కేసు నమోదు చేశామని, త్వరలో షుగర్ ఫ్యాక్టరీ వేలం నిర్వహించి, రైతులకు డబ్బులు ఇస్తామని తెలిపారు.

ఇదీ చదవండి : కరోనా ఎఫెక్ట్: నిర్మాణ రంగం కుదేలు... కష్టాల్లో కూలీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.