ETV Bharat / state

"గుర్తుపెట్టుకో సజ్జల..! నాకు ఆడియో ​కాల్స్​ వస్తే.. మీకు వీడియో కాల్సే !"

author img

By

Published : Feb 4, 2023, 1:16 PM IST

Updated : Feb 4, 2023, 3:02 PM IST

MLA KOTAMREDDY STRONG COUNTER : మంత్రి కాకాణి చేసిన విమర్శలపై నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు ఫోన్ బెదిరింపులు రావడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర పద జాలంతో విరుచుకుపడ్డారు. తాను ఎవ్వరికి భయపడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.

MLA KOTAMREDDY STRONG COUNTER
MLA KOTAMREDDY STRONG COUNTER

000

KOTAMREDDY STRONG COUNTER TO KAKANI : అధికార వైఎస్సార్సీపీ నుంచి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో.. మౌనంగా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లాలనుకున్నట్లు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అయితే, పార్టీకి చెందిన 13 మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు తన వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతుంటే తప్పని పరిస్థితుల్లో స్పందిస్తున్నట్లు ఆయన చెప్పారు. నెల్లూరులో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తనపై మంత్రి కాకాణి చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.

బావా కాకాణి.. నాది నమ్మక ద్రోహమా?: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ వీర విధేయుడు కాదని.. వేరే వాళ్లకు విధేయుడని మంత్రి కాకాని గోవర్ధన్ అన్నట్లు తెలిపారు. అందుకు ఆయన చెప్పింది నూటికి నూరు శాతం నిజం అన్న కోటంరెడ్డి.. తాను కష్టాల్లో నడిచిన వ్యక్తినని.. ఎక్కడ ఉంటే అక్కడ విధేయుడిగా ఉంటానే తప్ప పక్కదారులు చూసే మనిషిని కాదని ఘాటుగా బదులిచ్చారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే అది నమ్మక ద్రోహమా? అని ప్రశ్నించిన ఆయన.. మరి మిమ్మల్ని (కాకాణి) జడ్పీ ఛైర్మన్‌ చేసి రాజకీయ మెట్టు ఎక్కించిన ఆనంకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారని నిలదీశారు.

"నన్ను విమర్శిస్తున్న మంత్రి కాకాణికి సమాధానం చెబుతున్నా. జగన్‌ ఓదార్పు యాత్ర సమయంలో కాకాణి చేసింది గుర్తులేదా?. పొదలకూరులో వైఎస్‌ విగ్రహం పెట్టకుండా అడ్డుకోలేదా కాకాణి?. వైఎస్‌ కుటుంబానికి వీరవిధేయుడైతే విగ్రహాన్ని ఎందుకు అడ్డుకున్నారు?. వీర విధేయత గురించి కాకాణి మాట్లాడుతుంటే నాకు చాలా జాలేస్తోంది. నన్ను తిడితే పదవులు వస్తాయనే నాపై వరుస విమర్శలు. వైసీపీలో ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టింది కాకాణి కాదా?"కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి, నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే

కోర్టులో దస్త్రాల చోరీ కేసులో జాగ్రత్తగా ఉండు: ఓదార్పు యాత్ర సమయంలో పొదలకూరులో వైఎస్‌ విగ్రహం పెట్టకుండా మీరు అడ్డుకోలేదా అని నిలదీశారు. వైఎస్ కుటుంబానికి మీరు వీరవిధేయుడైతే వైఎస్‌ విగ్రహాన్ని పెట్టేందుకు ఎందుకు అడ్డుకున్నారు కాకాణి? అని ప్రశ్నించారు. విధేయత గురించి మీరు మాట్లాడుతుంటే తనకు చాలా జాలేస్తోందని ఎద్దేవా చేశారు. తనను తిడితే వైసీపీ ప్రభుత్వంలో పదవులు వస్తాయనుకొని వరుస విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టింది కాకాణి కాదా? అని విమర్శించారు. నెల్లూరు కోర్టులో దస్త్రాల చోరీ కేసులో కాకాణిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నా అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

"కాకాణి.. కోర్టులో దస్త్రాలు చోరీచేశావని చెప్పట్లేదు.. అన్నీ వేళ్లు నిన్నే చూపిస్తున్నాయి. దస్త్రాల చోరీ కేసులో జాగ్రత్తగా ఉండాలని కాకాణికి సలహా ఇస్తున్నా. సజ్జల పేరు వచ్చేసరికి ఉలిక్కిపడి నాపై కాకాణి విమర్శలు చేశారు. మంత్రి పదవి ఇప్పించిన సజ్జలను విమర్శిస్తే కాకాణికి కోపం వచ్చినట్లుంది"-కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి, నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే

సజ్జల కోటరీ నుంచే బెదిరింపు కాల్​: మంత్రి పదవిని ఇప్పించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శిస్తే ఆయనకు కోపం వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. తనకు బెదిరింపు కాల్స్‌ వచ్చినా భయపడకుండా అంతా వింటున్నట్లు తెలిపిన ఆయన.. రికార్డు చేస్తున్నారని తెలిసినా మాట్లాడానని.. అయినా తాను భయపడలేదన్నారు. తనని, తన తమ్ముడిని కొట్టుకుంటూ తీసుకెళ్తానని ఎవరో కడప నుంచి అనిల్‌ అనే వ్యక్తితో ఫోన్‌ చేయించారని ఆరోపించారు. సజ్జల కోటరీ నుంచే ఆ వ్యక్తి మాట్లాడినట్లు తెలిసిందన్నారు.

"బెదిరింపు కాల్స్​ ఎన్ని వచ్చినా భయపడేది లేదు.రికార్డు చేస్తున్నారని తెలిసినా మాట్లాడా.. నేను భయపడలేదే. నన్ను, నా తమ్ముడిని కొట్టేసుకుంటూ తీసుకెళ్తారా.. రండి చూద్దాం. సజ్జల కోటరీ నుంచి బెదిరింపు కాల్‌ మాట్లాడినట్లు తెలిసింది. అనిల్‌తో మాట్లాడించిన సజ్జలకు చెబుతున్నా.. బాగా వినండి. నీ మాటలకు వణికేవాళ్లం కాదు. నెల్లూరు రూరల్‌ నుంచి నేరుగా వీడియో కాల్స్‌ వస్తాయి గుర్తుంచుకోండి"-కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి, నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్​ నుంచి వీడియో కాల్స్​ వస్తాయి: ఎవరో వ్యక్తితో మాట్లాడించిన సజ్జలకు తాను చెప్పేది ఒక్కటేనన్న కోటంరెడ్డి.. తాను అలాంటి వ్యక్తిని కాదని.. అలాంటి ఫోన్‌ కాల్స్‌ తన కొస్తే.. నెల్లూరు రూరల్‌ నుంచి వీడియో కాల్స్‌ ఒస్తాయనే విషయం సజ్జల గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. తనపై కిడ్నాప్‌ కేసు పెట్టారని.. అవసరమైతే హత్యాయత్నం కేసు కూడా పెట్టుకోండని హితవు పలికారు.

ఫోన్లు చేసి బయపెట్టాలని చూస్తే సహించేది లేదు: సలహాదారుగా ప్రభుత్వ పనులను మాసేసి ఆపరేషన్‌ నెల్లూరు రూరల్‌ అనే విధంగా సజ్జల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేయాలి కానీ.. ఇలా ఫోన్లు చేయించి భయపెట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. తాను భయపడతానని అనుకుంటే అది అమాయకత్వమే అవుతుందని కోటంరెడ్డి హెచ్చరించారు.

కోటంరెడ్డి అన్నతోనే ప్రయాణం: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెంటే నడుస్తానని నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి స్పష్టం చేశారు. కార్పొరేటర్, మేయర్‌గా ఈ స్థితికి రావడానికి కోటంరెడ్డి కారణమని మేయర్‌ స్రవంతి తెలిపారు. అవసరమైతే మేయర్ పదవికి రాజీనామా చేస్తానన్నారు. మా జెండా.. మా ఊపిరి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..ఆయన ఎటుంటే అటే నడుస్తామని అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 4, 2023, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.